హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు ముందు వరకు దేశంలో బ్యాంకు లావాదేవీల్లో ఆన్‌లైన్ వాటా కేవలం 2 శాతమే. డీమానిటైజేషన్ తర్వాత ఇది 6 శాతానికి వచ్చి చేరింది. ఇక కోవిడ్–19 మహమ్మారి కారణంగా నగదు ముట్టుకోవడానికి ప్రజలు చాలా మంది విముఖత చూపిస్తున్నారు. దీంతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. మొత్తంగా రోజువారీ ఆన్‌లైన్ లావాదేవీలు గతేడాది 14% ఉంటే.. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌తో ఇది ఏకంగా 23%కి వచ్చింది. వైరస్ తీవ్రరూపం దాల్చడంతో బ్యాంకుకు వెళ్లడానికి కస్టమర్లు జంకుతుండడం.. బ్యాంకులు వ్యాపార పనివేళలు కుదించడమూ ప్రస్తుతం ఈ స్థాయి డిజిటల్ లావాదేవీలకు కారణమైంది. భారత్‌లో సగటున బ్యాంకు పనిదినాల్లో రోజుకు రూ.50,000–60,000 కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం.
బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్..
కోవిడ్–19 మహమ్మారి బ్యాంకులకూ చుట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో 9.5 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 12,000 పైచిలుకు ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. దాదాపు 600 మంది కోవిడ్–19కు బలయ్యారు. ఈ నేపథ్యంలో పనిగంటలు కుదించాల్సిందిగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అన్ని బ్యాంకులను కోరింది. ఐబీఏ సూచనతో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు ఇటీవల సమావేశమయ్యాయి. వ్యాపార పనివేళలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, ఉద్యోగుల పని గంటలు సాయంత్రం 4 వరకు ఉండాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశాయి. ప్రభుత్వాల అంగీకారంతో చాలా రాష్ట్రాలు ఈ పనివేళలను అమలు చేస్తున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి.
ఆ నాలుగు సేవలే..: కరోనా కట్టడిలో భాగంగా బ్యాంకులు తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలను సాగిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 50% మంది ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ విధానంలో ప్రోత్సహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే 10 శాతంలోపు బ్యాంకు ఉద్యోగులే ఇంటి నుంచి పని విధానంలో విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వ్యాపార పనివేళలు కుదించిన నేపథ్యంలో డిపాజిట్స్, క్యాష్ విత్‌డ్రాయల్స్, రెమిటెన్స్, ప్రభుత్యానికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే బ్యాంకులు అందిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లకు పెద్దగా అడ్డంకులు లేవని ఒక అధికారి వ్యాఖ్యానించారు. వినియోగదార్లు ఏటీఎంలు, పేమెంట్స్ యాప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వేదికలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని తెలిపారు.
50 శాతం చేయాల్సిందే..
బ్యాంకులన్నీ సగం మంది ఉద్యోగులను షిఫ్ట్ విధానంలో ఇంటి నుంచి పనిచేసేలా వెసులుబాటు కల్పించాలి. మధ్యాహ్నం 2 గంటలకల్లా శాఖలను మూసివేయాలి. వైరస్ ఉధృతి తగ్గేవరకు వికలాంగులు, గర్భిణులు, 55 ఏళ్లకుపైబడ్డ వారిని సెలవులో ఉంచాలి. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. కంటైన్‌మెంట్ జోన్లలోని శాఖలను పూర్తిగా మూసివేయాలి. శిక్షణ కేంద్రాలను కోవిడ్ సెంటర్లుగా మార్చాలి. బ్యాంకులు సీఎస్‌ఆర్ కింద 3 శాతం మొత్తాన్ని ప్రజలకు ఖర్చు చేయాలన్నది మా డిమాండ్.
– బి.ఎస్.రాంబాబు, తెలంగాణ కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్
బ్యాంకు లావాదేవీలు ఆన్‘లైన్’
Published Thu, Apr 29 2021 4:21 AM | Last Updated on Thu, Apr 29 2021 4:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment