ఆన్‌లైన్ తరగతులు వింటున్న విద్యార్థులు (ఫైల్)
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా మహమ్మారితో విద్యా వ్యవస్థ అతలాకుతులమైంది. 2020–21 విద్యా సంవత్సరంపై కరోనా ప్రభావం పడింది. వైరస్ విలయతాండవంతో విద్యా సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులు మొదలుపెట్టాయి. తమ వద్ద ఉన్న విద్యార్థులు చేదాటి పోకూడదన్న కారణంతో దాదాపు 20 రోజులకు పైగా కొన్ని పాఠశాలలు వీడియో కాల్స్, యూట్యూబ్ లింకుల ద్వారా పాఠాలు చెబుతున్నాయి. రోజు ఆన్‌లైన్‌లో హోంవర్క్ ఇచ్చి వాటిని తల్లిదండ్రుల పర్యవేక్షణలో పూర్తి చేయిస్తున్నారు. ఇన్ని చేసి చివర్లో మీ పిల్లల మొదటి టర్మ్ ఫీజులు కట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తల్లిదండ్రులు మొదటి టర్మ్ ఫీజులు కట్టి ఆన్‌లైన్ రశీదులు కూడా తీసుకున్నారు. ఫీజుల వసూళ్లు చేయాలంటూ యాజమాన్యాలు ఉపాధ్యాయులను వేధిస్తున్నాయి. ఫీజుల వసూలును బట్టి మీకు మూడు నెలలుగా ఇవ్వాల్సిన జీతం ఎంత శాతం ఇవ్వాలో నిర్ణయిస్తామంటూ టార్గెట్‌లు పెడుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ప్రైవేట్ టీచర్లు అడ్మిషన్లు, ఫీజుల టార్గెట్ పూర్తి చేయటానికి నానా అవస్థలు పడుతున్నారు. జీరో అకడమిక్ ఇయర్‌గా ప్రకటిస్తే ఇప్పటికే కట్టిన ఫీజుల సంగతి ఏంటని తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. మరికొంతమంది ఈ భయంతో ఫీజులు కట్టకుండా వాయిదాలు వేస్తున్నారు.
ఉపయోగం లేదు....
వాస్తవానికి ఆన్‌లైన్ పాఠాల వల్ల విద్యార్థులకు పెద్దగా ఉపయోగంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో పిల్లలు శ్రద్ధగా పాఠాలు వినడంలేదని, ముఖ్యంగా ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి లోపు పిల్లలు ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ ముందు కుదురుగా కూర్చోవటం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ తరగతులకు అనుమతి లేదు
జిల్లాలోని అన్ని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు, పరీక్షలు నిర్వహించటానికి అనుమతి లేదు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఆడ్మిషన్లు చేపట్టకూడదు. ప్రభుత్వం విద్యాసంవత్సరం ఆరంభ తేదీ ప్రకటించేవరకు ఆన్‌లైన్ తరగతులు, ఫీజుల వసూలు చేయటం జరిగితే డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఫోన్ ద్వారా 08632271784 కి కాల్ చేసి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం.–గంగభవాని, డీఈఓ, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment