కరోనా విజృంభణ కాలంలో ఆందోళనగా, నిస్సారంగా గడిపిన ఖాళీ సమయాలను మర్చిపోలేం. అయితే, చాలా మంది ముఖ్యంగా యువత ఆ ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకుంటూ తమకున్న అభిరుచులను పెంచుకునే దిశగా కృషి చేశారు. కొంతమంది కొత్త కొత్త అభిరుచులవైపు తమ దృష్టిని మళ్లించుకున్నారు. ఆ కళాత్మక దృష్టి వారిని కొత్త వ్యాపారం వైపు ప్రయాణించేలా చేసింది.
దీపాక్షి దత్తా, దృష్టి అరోరా, తవ్లీన్‌కౌర్, నాజియా నసీఫ్‌లు ఖాళీ సమయాన్ని సద్వియోగం చేసుకోవాలని ఆలోచించారు. ఆన్‌లైన్ వేదికగా తమ అభిరుచులకు పదును పెట్టుకున్నారు. అదే ఆన్‌లైన్ ద్వారా పాఠాలు నేర్పారు. చదువుకుంటూ, ఇంటివద్ద ఉంటూ ఆదాయాన్ని, గుర్తింపునూ పొందుతున్నారు.
నాట్స్ ఆఫ్ లవ్
కోల్‌కతాకు చెందిన 24 ఏళ్ల దీపాక్షి దత్తా knotsoflovebydeepakshi అనే ఆన్ లైన్ స్టోర్ నడుపుతోంది. దీపాక్షి మాట్లాడుతూ, ‘నాకు ఉద్యోగం రావడానికి టైమ్ పడుతుంది. దాని కోసం ఎదురుచూసుకుంటూ ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. మహమ్మారిలో, ప్రజలు ఎక్కువ మంది ఇంటర్నెట్‌పై ఆధారపడ్డారు. నైపుణ్యాలు నేర్చుకోగల పెద్ద పాఠశాల ఆన్‌లైన్ అయ్యింది. ఇదే నాకు ఉపాధిని తెచ్చిపెట్టింది. ఇప్పటికీ అల్లికలు అల్లుతూ, నేర్పిస్తూ ఆదాయం పొందుతున్నాను’ అని ఆనందంగా చెబుతుంది.
ఆత్మీయ ఫొటో కార్డ్
@artsymomo ఇన్‌స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్న టవ్లీన్ కౌర్ రాజ్‌పాల్ వయసు 19. తన స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా ఫొటో కార్డ్ తయారు చేసి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. ‘నా ఫ్రెండ్ ఆ ఫొటో కార్డ్ చూసి చాలా సంతోషించింది. కుటుంబంలోని వ్యక్తుల ఆత్మీయ క్షణాలను బంధించిన ఫొటోలను తీసుకొని, వాటిని కార్డ్స్ రూపంలో తయారు చేసి, లామినేట్ చేయడం మొదలుపెట్టాను. ఇది నాకు మంచి పేరును, ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. పెంపుడు జంతువులతో ఉన్న ఫొటోలు కూడా చేస్తున్నాను. ఇవి జనాలకు బాగా నచ్చుతున్నాయి’అని ఆనందంగా వివరిస్తుంది.
కళాదృష్టి
21 ఏళ్ల దృష్టి అరోరా నివాసం ఢిల్లీలో @kalaadrishti అనే పేరుతో చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దృష్టి ‘నేను మా అత్త నుండి కొన్ని బేసిక్ కుట్లు నేర్చుకున్నాను. యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి, రింగ్స్ తయారీ నేర్చుకున్నాను. డిజిటల్ ఇలస్ట్రేషన్ నుండి కోచింగ్ వరకు, తెలుసుకోవడానికి కొరతే లేదు. వీటన్నింటినీ నేర్చుకోవడానికి, తయారీకి సమయం ఏ మాత్రం సరిపోవడం లేదు’ అని వివరిస్తుంది.
కళాత్మక అన్వేషణ
పాట్నాకు చెందిన నాజియా నఫీజ్ వయసు 30. ఇద్దరు పిల్లల తల్లి. కుటుంబ బాధ్యతలతో సమయమే సరిపోయేది కాదు. పైగా కుటుంబంలో ఆమె ఆలోచనలను ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ కరోనా మహమ్మారి కాలంలో చేసిన ఆల్లికలు ఆమెలోని కళాత్మక దృష్టిని సమాజం ముందుకు తీసుకు వచ్చేలా చేశాయి. ఆమె ఇప్పుడు @crazy_knot పేజీ ద్వారా చెప్పులు, జూకాలు, గాజులు.. రంగుదారాల అల్లికతో మంచి ఆదాయాన్ని పొందుతోంది. కుటుంబానికి అండగా నిలబడింది.
వీరెవ్వరూ గొప్ప కళాకారులు, అనుభవజ్ఞులైన వ్యాపార వేత్తలు కాదు. తమకున్న కళను అమ్మడం అనే ఆలోచనే వారెప్పుడూ చేయలేదు. ఆర్డర్ తీసుకున్నాక, తను పంపాల్సిన ప్యాకేజీలను సరిగ్గా చేయకపోడం వల్ల టవ్లీన్ కొన్నిసార్లు నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ‘వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొనే రోజులు ఉంటాయి. నేర్చుకునే ప్రక్రియలో ఇది కూడా ఓ భాగం’ అంటోంది దృష్టి. అంతేకాదు వ్యాపార మెలకువల కోసం ఆమ్‌స్టర్ డ్యామ్ యూనివర్శిటీ నుంచి ఆన్‌లైన్ పాఠాలు కూడా నేర్చుకుంటోంది. తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో ఈ సంవత్సరం ఆమె తన కాలేజీ ఫీజులో సగం చెల్లించానని టవ్లీన్ సంతోషంగా చెబుతుంది.
టవ్లీన్, దీపాక్షి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే చదువుపై దృష్టి పెడుతున్నారు. దృష్టి తన వ్యాపారాన్ని ఫ్రీలాన్స్ అవకాశంగా చూస్తోంది. నాజియా ఇదొక సొంత వ్యవస్థాపక ప్రయాణంగా భావిస్తోంది. ‘నాట్స్’పై పెద్ద ప్రణాళికలను రచిస్తూనే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంలో నిమగ్నమైంది. వీరంతా వేల మైళ్లు ప్రయాణించలేదు. ఇంటి వద్ద ఉండే ఉన్న వనరులతో కళాత్మక దృష్టికి పదునుపెట్టారు. ఆ అభిరుచినే వ్యాపారంగా మార్చుకుని ఉపాధి పొందుతున్నారు.
కళాత్మక దృష్టితో కొత్త వ్యాపారం.. ఆదర్శంగా నిలుస్తున్న అమ్మాయిలు!
Published Sun, Sep 26 2021 12:40 AM | Last Updated on Sun, Sep 26 2021 12:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment