న్యూఢిల్లీ: కరోనా రెండేళ్ల ప్రభావం అనంతరం.. వ్యాపార పర్యటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓయో ‘బిజినెస్ ట్రావెల్’ నివేదిక ప్రకారం.. 2022 జనవరి నుంచి అన్ని రంగాల్లోనూ వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం వల్ల వ్యాపార ప్రయాణాల్లోనూ స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. ‘‘వ్యాపార ప్రయాణాల్లో కార్పొరేట్ ఉద్యోగుల వాటా 29 శాతం, చిన్న వ్యాపారుల వాటా 17.7 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వాటా 12.3 శాతంగా ఉంది’’అని ఓయో నివేదిక తెలిపింది.
ఈ ఏడాది జూన్ నెలలో 25–30 తేదీల మధ్య 1,300 మంది అభిప్రాయాలను సమీకరించి ఈ నివేదికను ఆతిథ్య సేవల కంపెనీ ‘ఓయో’ విడుదల చేసింది. వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణించే వారికి ఢిల్లీ ప్రముఖ కేంద్రంగా ఉంటున్నట్టు, ఆ తర్వాత బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. వ్యాపార ప్రయాణాలు చేసే వారిలో యువత(20–24 ఏళ్లు) 43 శాతంగా ఉంటున్నారు. ఆ తర్వాత 25–30 ఏళ్ల గ్రూపులోని వారు 34.5 శాతం, 31–45 వయసులోని వారు 18.6 శాతం మేర ఉన్నారు.
‘‘కొన్ని నెలల పాటు వర్చువల్ సమావేశాలు, టెలిఫోన్ల సంప్రదింపుల తర్వాత.. యువ వ్యాపార ప్రయాణికులు (ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారు, ట్రేడర్లు, చిన్న సంస్థల అధినేతలు) ముఖాముఖి వ్యవహారాలకు ఆసక్తి చూపిస్తున్నారు’’అని ఓయో ప్రకటన విడుదల చేసింది. కంపెనీలు, చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలు, ప్రభుత్వరంగం నుంచి చేసే ప్రయాణాలు పుంజుకున్నాయని, సమీప భవిష్యత్తులో ఈ ధోరణి ఇంకా పెరుగుతుందని ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు.
నిర్మాణ రంగం నుంచి ఎక్కువ..
► నెలకోసారి తాము వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణిస్తామని ఈసర్వేలో 29 శాతం మంది చెప్పారు.
► మూడు నెలల్లో ఒక్కసారైనా వెళతామని 25 శాతం మంది తెలిపారు.
► 73 శాతం మంది తాము కనీసం మూడు రోజుల పాటు పర్యటన పెట్టుకుంటామని చెప్పగా, 19 శాతం మంది 3–7రోజులు, 4 శాతం మంది వారంకంటే ఎక్కువ రోజులు అవసరమవుతాయని చెప్పారు.
► నిర్మాణ రంగం నుంచి ఎక్కువగా 16 శాతం మేర వ్యాపార ప్రయాణాలు ఉంటున్నాయి. ఆ తర్వాత రవాణా, వస్త్ర రంగం, ఎలక్ట్రానిక్స్, ఐటీ, హెల్త్‌కేర్ రంగాల వారు వ్యాపార అవసరాలకు ఎక్కువగా పర్యటించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment