Nazia
-
కామెడీ లవ్ ఎంటర్టైనర్గా ‘జస్ట్ ఏ మినిట్’
అభిషేక్ పచ్చిపాల హీరోగా, నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. కామెడీ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను యశ్వంత్ దర్శకత్వంలో తన్వీర్, ప్రకాశ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరో అభిషేక్ మాట్లాడుతూ –‘‘సినిమా మొత్తం ఫన్ ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. బాజీ మ్యూజిక్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ వేడుకలో నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్, సారిపల్లి సతీష్, జబర్దస్త్ ఫణి మాట్లాడారు. -
రికార్డ్: నజియ విజయం
ఎక్కడి కేరళ, ఎక్కడి మహారాష్ట్ర! కానీ కళకు దూరం ఎప్పుడూ భారం కాదు అని నిరూపించింది నజియ నవస్. తిరువనంతపురం(కేరళ)కు చెందిన నజియ ఇంటర్నెట్లో ఒకసారి వర్లీ పెయింటింగ్‌లను చూసి అబ్బురపడింది. మహారాష్ట్రలో ప్రసిద్ధి పొందిన వర్లీ ఆర్ట్ తనను ఎంత ఆకట్టుకుందంటే ఎలాగైనా సరే ఆ ఆర్ట్ నేర్చుకోవాలి అనుకునేంతగా! అనుకోవడానికేం... ఎన్నయినా అనుకుంటుంటాం. మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి వర్లీ నేర్చుకోవడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే అంతర్జాలాన్నే గురువుగా భావించి సాధన మొదలు పెట్టింది. దానికి ముందు ఎన్నో విషయాలను చదివి తెలుసుకుంది. వర్లీ కళ అనేది అసామాన్య చిత్రకారుల సృష్టిలో నుంచి వచ్చింది కాదు. సామాన్య గిరిజనులే దాని సృష్టికర్తలు. మట్టిగుడిసెలను తమకు తోచిన కళతో అలంకరించేవారు. నిత్యం అందుబాటులో ఉన్న వస్తువులనే పెయింటింగ్స్ కోసం వాడేవారు. తరాలు మారుతున్న కొద్దీ ఈ కళ మరింత విస్తృతి పొందింది. విశేషం ఏమింటే వర్లీ చిత్రాలలో ప్రకృతి ప్రధాన వస్తువుగా కనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి మధ్య ఉండే సంబంధాలను అవి చిత్రీకరిస్తాయి. వర్లీ కళకు సంబంధించి రకాల విషయాలు తెలుసుకునే క్రమంలో ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదల నజియాలో పదింతలైంది. ఎట్టకేలకు తనకు ఇష్టమైన కళలలో పట్టు సాధించింది. ఇప్పటివరకు వందకు పైగా వర్లీ పెయింటింగ్స్ వేసింది. డిగ్రీ పూర్తి చేసిన నజియాకు తన అభిరుచి ఆదాయ మార్గంగా కూడా మారింది. ఆన్లైన్లో తన వర్లీ పెయింటింగ్‌లు అమ్ముతుంది. తాజాగా 5 అంగుళాల పొడవు, వెడల్పైన వర్లీ పెయింటింగ్‌తో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది నజియ. గతంలో ఉన్న పది అంగుళాల పొడవు, వెడల్పయిన వర్లీ పెయింటింగ్ రికార్డ్‌ను నజియ బ్రేక్ చేసింది. ‘నేర్చుకున్నది చాలు’ అని అనుకోవడం లేదు నజియ. ముంబైకి వెళ్లి ఆ కళలో మరిన్ని మెళకువలు నేర్చుకోవాలనుకుంటుంది. ‘కళను పట్టుదలగా నేర్చుకోవాలి. ఉదారంగా పంచాలి’ అంటారు. వర్లీ కళను సొంతంగా నేర్చుకున్న నజియ ఇప్పుడు ఆ కళను ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగా నేర్పించడానికి రెడీ అవుతుంది. -
ఉద్యోగం రావడానికి టైం పడుతుంది కదా.. అభిరుచితో ఆదాయం
కరోనా విజృంభణ కాలంలో ఆందోళనగా, నిస్సారంగా గడిపిన ఖాళీ సమయాలను మర్చిపోలేం. అయితే, చాలా మంది ముఖ్యంగా యువత ఆ ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకుంటూ తమకున్న అభిరుచులను పెంచుకునే దిశగా కృషి చేశారు. కొంతమంది కొత్త కొత్త అభిరుచులవైపు తమ దృష్టిని మళ్లించుకున్నారు. ఆ కళాత్మక దృష్టి వారిని కొత్త వ్యాపారం వైపు ప్రయాణించేలా చేసింది. దీపాక్షి దత్తా, దృష్టి అరోరా, తవ్లీన్కౌర్, నాజియా నసీఫ్లు ఖాళీ సమయాన్ని సద్వియోగం చేసుకోవాలని ఆలోచించారు. ఆన్లైన్ వేదికగా తమ అభిరుచులకు పదును పెట్టుకున్నారు. అదే ఆన్లైన్ ద్వారా పాఠాలు నేర్పారు. చదువుకుంటూ, ఇంటివద్ద ఉంటూ ఆదాయాన్ని, గుర్తింపునూ పొందుతున్నారు. నాట్స్ ఆఫ్ లవ్ కోల్‌కతాకు చెందిన 24 ఏళ్ల దీపాక్షి దత్తా knotsoflovebydeepakshi అనే ఆన్ లైన్ స్టోర్ నడుపుతోంది. దీపాక్షి మాట్లాడుతూ, ‘నాకు ఉద్యోగం రావడానికి టైమ్ పడుతుంది. దాని కోసం ఎదురుచూసుకుంటూ ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. మహమ్మారిలో, ప్రజలు ఎక్కువ మంది ఇంటర్నెట్పై ఆధారపడ్డారు. నైపుణ్యాలు నేర్చుకోగల పెద్ద పాఠశాల ఆన్లైన్ అయ్యింది. ఇదే నాకు ఉపాధిని తెచ్చిపెట్టింది. ఇప్పటికీ అల్లికలు అల్లుతూ, నేర్పిస్తూ ఆదాయం పొందుతున్నాను’ అని ఆనందంగా చెబుతుంది. ఆత్మీయ ఫొటో కార్డ్ @artsymomo ఇన్స్టాగ్రామ్ పేజీని నిర్వహిస్తున్న టవ్లీన్ కౌర్ రాజ్‌పాల్ వయసు 19. తన స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా ఫొటో కార్డ్ తయారు చేసి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. ‘నా ఫ్రెండ్ ఆ ఫొటో కార్డ్ చూసి చాలా సంతోషించింది. కుటుంబంలోని వ్యక్తుల ఆత్మీయ క్షణాలను బంధించిన ఫొటోలను తీసుకొని, వాటిని కార్డ్స్ రూపంలో తయారు చేసి, లామినేట్ చేయడం మొదలుపెట్టాను. ఇది నాకు మంచి పేరును, ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. పెంపుడు జంతువులతో ఉన్న ఫొటోలు కూడా చేస్తున్నాను. ఇవి జనాలకు బాగా నచ్చుతున్నాయి’అని ఆనందంగా వివరిస్తుంది. కళాదృష్టి 21 ఏళ్ల దృష్టి అరోరా నివాసం ఢిల్లీలో @kalaadrishti అనే పేరుతో చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దృష్టి ‘నేను మా అత్త నుండి కొన్ని బేసిక్ కుట్లు నేర్చుకున్నాను. యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూసి, రింగ్స్ తయారీ నేర్చుకున్నాను. డిజిటల్ ఇలస్ట్రేషన్ నుండి కోచింగ్ వరకు, తెలుసుకోవడానికి కొరతే లేదు. వీటన్నింటినీ నేర్చుకోవడానికి, తయారీకి సమయం ఏ మాత్రం సరిపోవడం లేదు’ అని వివరిస్తుంది. కళాత్మక అన్వేషణ పాట్నాకు చెందిన నాజియా నఫీజ్ వయసు 30. ఇద్దరు పిల్లల తల్లి. కుటుంబ బాధ్యతలతో సమయమే సరిపోయేది కాదు. పైగా కుటుంబంలో ఆమె ఆలోచనలను ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ కరోనా మహమ్మారి కాలంలో చేసిన ఆల్లికలు ఆమెలోని కళాత్మక దృష్టిని సమాజం ముందుకు తీసుకు వచ్చేలా చేశాయి. ఆమె ఇప్పుడు @crazy_knot పేజీ ద్వారా చెప్పులు, జూకాలు, గాజులు.. రంగుదారాల అల్లికతో మంచి ఆదాయాన్ని పొందుతోంది. కుటుంబానికి అండగా నిలబడింది. వీరెవ్వరూ గొప్ప కళాకారులు, అనుభవజ్ఞులైన వ్యాపార వేత్తలు కాదు. తమకున్న కళను అమ్మడం అనే ఆలోచనే వారెప్పుడూ చేయలేదు. ఆర్డర్ తీసుకున్నాక, తను పంపాల్సిన ప్యాకేజీలను సరిగ్గా చేయకపోడం వల్ల టవ్లీన్ కొన్నిసార్లు నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ‘వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొనే రోజులు ఉంటాయి. నేర్చుకునే ప్రక్రియలో ఇది కూడా ఓ భాగం’ అంటోంది దృష్టి. అంతేకాదు వ్యాపార మెలకువల కోసం ఆమ్స్టర్ డ్యామ్ యూనివర్శిటీ నుంచి ఆన్లైన్ పాఠాలు కూడా నేర్చుకుంటోంది. తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో ఈ సంవత్సరం ఆమె తన కాలేజీ ఫీజులో సగం చెల్లించానని టవ్లీన్ సంతోషంగా చెబుతుంది. టవ్లీన్, దీపాక్షి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే చదువుపై దృష్టి పెడుతున్నారు. దృష్టి తన వ్యాపారాన్ని ఫ్రీలాన్స్ అవకాశంగా చూస్తోంది. నాజియా ఇదొక సొంత వ్యవస్థాపక ప్రయాణంగా భావిస్తోంది. ‘నాట్స్’పై పెద్ద ప్రణాళికలను రచిస్తూనే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంలో నిమగ్నమైంది. వీరంతా వేల మైళ్లు ప్రయాణించలేదు. ఇంటి వద్ద ఉండే ఉన్న వనరులతో కళాత్మక దృష్టికి పదునుపెట్టారు. ఆ అభిరుచినే వ్యాపారంగా మార్చుకుని ఉపాధి పొందుతున్నారు. -
వారణాసి రైలు ఉలిక్కిపడింది
ఉత్తరప్రదేశ్ గాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్ మంగళవారం (ఫిబ్రవరి 2) రాత్రి వారణాసి రైలెక్కింది. ఫిబ్రవరి 3– బుధవారం మధ్యాహ్నం వారణాసిలో ఆమెకు టీచర్ సర్టిఫికెట్ ఎగ్జామ్ ఉంది. లెక్కప్రకారం అయితే రైలు వారణాసికి ఉదయం తొమ్మిదికి చేరుకోవాలి. కాని తెల్లారి పొగమంచు కమ్ముకుంది. వారణాసికి రెండు గంటల దూరంలోని ‘మౌ’ అనే ఊరిలో రైలు ఆగిపోయింది. నాజియా ఎగ్జామ్ తప్పిపోయేలా ఉంది. కాని అప్పుడొక చిత్రం జరిగింది. నాజియా ఎగ్జామ్ రాసింది. భారతీయ రైల్వేలు ప్రయాణికుల పక్షాన ఉన్నాయని ఈ ఉదంతం చెబుతోంది. ప్రతి తమ్ముడికి ఒక అక్క ఉంటే బాగుంటుంది నిజమే కాని ప్రతి అక్కకు కూడా ఒక తమ్ముడు ఉంటే బాగుంటుందని ఇది చదివితే అర్థమవుతుంది. ‘ఏం చేయన్రా తమ్ముడూ... ఎగ్జామ్ మిస్ అయ్యేలా ఉంది’ అని అక్క ఆందోళన చెందితే తమ్ముడు రంగంలోకి దిగాడు. అతడు చేసిన పని ఫలితం ఇచ్చింది. అక్కకు గండం గట్టెక్కింది కూడా. పొగమంచులో భవిష్యత్తు ఉత్తర ప్రదేశ్‌లో ఘాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్ వారణాసిలో బుధవారం (ఫిబ్రవరి 3) మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష రాయాలి. టీచర్ సర్టిఫికెట్ ఎగ్జామ్ అది. అంటే టీచరు కావాలనే నాజియా తబస్సుమ్ కల నెరవేరాలంటే ఆ ఎగ్జామ్ రాయకతప్పదు. అందుకే ఆమె ఘాజీపూర్‌లో మంగళవారం రాత్రి వారణాసి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. దాదాపు 10 గంటల ప్రయాణం. రైలు మరుసటి రోజు ఉదయం 9.30 గం. లోపు చేరుకున్నా ఎగ్జామ్ రాయడానికి మధ్యలో రెండు గంటల టైమ్ ఉంటుంది. కొంచెం లేటైనా పర్వాలేదనుకుని రైలు ఎక్కింది తబస్సుమ్. కాని పొగమంచులో రైలు ప్రయాణం నత్త నడకన సాగింది. వారణాసికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మౌ’ అనే జంక్షన్లో ట్రైను పూర్తిగా ఆగిపోయింది. అక్కడి నుంచి మామూలు రోజుల్లో ప్రయాణం దాదాపు 2 గంటలు. పొగమంచు వల్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టేలా ఉందని రైల్వే అధికారులు, ప్రయాణికులు కూడా నిర్థారణకొచ్చేశారు. కాని ట్రైన్లో ఉన్న నాజియాకు పరీక్ష ఎలాగైనా రాయాలన్న పట్టుదల. ఏం చేయాలి? ఏం చేద్దాం తమ్ముడూ..? అక్కకు తోడుగా ట్రైన్లో ఉన్న ఆమె తమ్ముడు అన్వర్ జమాల్ పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని గ్రహించాడు. వెంటనే ‘రైల్వేసేవ’ ట్విటర్ అకౌంట్లో పరిస్థితి వివరించాడు. అక్క హాల్ టికెట్, ట్రైన్ నంబర్ పెట్టి ‘సాయం చేయండి’ అని కోరాడు. నిజానికి అది చిగురంత ఆశతో చేసిన పనే. కాని ఆ పని ఫలితం ఇచ్చింది. అన్వర్ జమాల్ ట్వీట్‌కు రైల్వేశాఖ తక్షణమే స్పందించింది. రంగంలో దిగిన రైల్వేశాఖ వారణాసిలో ఉన్న రైల్వే అధికారులు వెంటనే రంగంలో దిగారు. ట్రైన్ ఎక్కడ ఉందో ఆరా తీశారు. ‘మౌ’ జంక్షన్లో ఉన్న ట్రైను వారణాసికి చేరాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయని గ్రహించారు. వారణాసి ఎక్స్‌ప్రెస్ ‘మౌ’ నుంచి వారణాసి చేరే మధ్యలో 4 స్టాపుల్లో ఆగాలి. ఆ స్టేషన్లలో దిగాల్సిన ప్రయాణికులకు ఇబ్బంది రాకూండా ఉండేందుకు ఆ నాలుగు స్టేషన్లలో రైలు ఆపడానికే నిశ్చయించుకున్నారు. కాని మౌ వారణాసిల మధ్య సింగిల్ లైన్లో ఇంకో ట్రైన్ ఏదీ లేకుండా చూసుకున్నారు. స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ ఖాళీ లేకపోతే ఈ ట్రైనును లూప్లైన్లో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. అన్ని స్టేషన్ల నుంచి సిగ్నల్ సకాలంలో అందేలా శ్రద్ధ పెట్టారు. ట్రైను డ్రైవర్‌కు, గార్డ్‌కు సమాచారం అందించారు. ట్రైను చకచక కదిలింది. మధ్యలోని నాలుగు స్టేషన్లలో ఆగి వెంటనే బయలుదేరి నాజియాను వారణాసి చేర్చింది. ‘అందరికీ కృతజ్ఞతలు. మేము సమయానికి చేరుకున్నాం’ అని అన్వర్ జమాల్ సంతోషంగా ట్వీట్ చేశాడు. నాజియా ఎగ్జామ్ రాసింది. రేపు ఆమె టీచర్ అయితే అందరూ ఆమెను రైలు టీచరమ్మ అని పిలుచుకున్నా ఆశ్చర్యం లేదు. అలా ఆమె ప్రయాణం అందరికీ గుర్తుండిపోయింది. – సాక్షి ఫ్యామిలీ -
7 కోట్ల రూపాయల ప్రశ్నకు జవాబు ఇదే?
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్లో భాగంగా మంగళవారం నాటి ఎపిసోడ్లో ఐపీఎస్ అధికారి మహితా శర్మ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. షోలో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు ఏకధాటిగా సమాధానాలు ఇచ్చిన ఆమె రూ.7 కోట్లు గెల్చుకునే అవకాశం ఉన్న 15వ ప్రశ్న వద్ద క్విట్ అయ్యారు. దీంతో ఆమె కోటి రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మహితా శర్మను ఇంతగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఏంటా అనుకుంటున్నారా... అయితే తెలుసుకోండి మరీ.. 1817లో ముంబైలో వాదియా గ్రూపు నిర్మించిన బ్రిటీష్ యుద్ధనౌక పేరేంటి అనేదే ఆ ప్రశ్న. దీనికి సమధానం చెప్పాల్సిందిగా ఆమెకు నాలుగు ఆప్సన్స్ ఇచ్చారు. అందులో 1. హెచ్ఎమ్ఎస్ మిండెన్ 2. హెచ్ఎమ్ఎస్ కోర్న్‌వాలీస్ 3. హెచ్ఎమ్ఎస్ త్రింకోమలీ 4. హెచ్ఎమ్ఎస్ మియానీ.. అయితే మహితా శర్మ దీనికి సమాధానం చెప్పలేక పోటి నుంచి తప్పుకుంటునట్లు చెప్పారు. దీనికి ‘హెచ్ఎమ్ఎస్ త్రింకోమలీ’ అనేది సరైన సమాధానం అని, ప్రస్తుతం ఈ యుద్ధ నౌక రాయల్ నేవీ జాతీయ మ్యూజియంలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుందని అమితాబ్ వెల్లడించారు. మహితా శర్మ కన్నా ముందు ఈ సీజన్ మొదటి కంటెస్టెంట్‌గా నజీయా నసీమ్ పాల్గొన్నారు. ఆమె కూడా కోటి రూపాయలు గెల్చుకుని రూ.7 కోట్ల ప్రశ్న వద్ద క్విట్ అయ్యారు. నేతాజీ సుభాష్ చంద్రబోష్ ‘ఆజాద్ హింద్ ప్రభుత్వం’ గురించి సింగపూర్‌లోని ఏ ప్రదేశంలో ప్రకటన చేశారనేది నజియాను అమితాబ్ అడిగిన రూ.7 కోట్ల ప్రశ్న. కేథలీ సినిమా హాల్, ఫోర్ట్ కానింగ్ పార్క్, సింగపూర్ జాతీయ యూనివర్సిటీ, సింగపూర్ జాతీయ గ్యాలరీ అనేవి ఆప్షన్లు. దీనికి సరైన సమాధానం.. కేథలీ సినిమాహాల్. క్విట్ కావడంపై నజియా మాట్లాడుతూ.. రూ.7 కోట్ల ప్రశ్న వద్ద క్విట్ అయినందుకు తాను బాధ పడట్లేదన్నారు. ఇప్పుడు గెల్చుకున్న కోటి రూపాయలు రాకపోయినా తనకు ఏ మాత్రం నిరాశ ఉండదన్నారు. వేదిక పైకి వెళ్లి తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నజియా పేర్కొన్నారు. నిజానికి తాను డబ్బు కోసం షోలో పాల్గొనలేదని, నన్ను అక్కడ చూడాలన్న తన తల్లి కోరిక నెరవేర్చడం కోసమే వెళ్లానన్నారు. తన తల్లి కోరిక తీర్చినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని నజియా తెలిపారు. (చదవండి: కేబీసీలో ప్రశ్న.. అమితాబ్‌పై కేసు) -
గోవాలో ‘మోని’
లక్కీఏకారి, నజియా జంటగా అర్కాన్ ఎంటరై్టన్మెంట్స్ బ్యానర్ పై రంజిత్ కోడిప్యాక సమర్పణలో తెలుగు , హిందీ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోని‘. సత్యనారాయణ ఏకారి దర్శకుడు. యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ–‘‘దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. హీరో, హీరోయిన్లు బాగా నటిస్తున్నారు. ప్రస్తుతం గోవా షెడ్యూల్ పూర్తి కావొచ్చింది. రెండో షెడ్యూల్‌ని హైదారాబాద్‌లో, మూడో షెడ్యూల్ ముంబైలో జరపనున్నాం. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మిస్తున్నాం. దర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రెండు పాటలు, నాలుగు భారీ ఫైట్లు ఉంటాయి. ఇందులో ఓ ప్రముఖ బాలీవుడ్ విలన్ నటిస్తున్నాడు. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్లో మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి. -
ప్రైమ్ మినిస్టర్
ప్రధాని నరేంద్ర మోదీ ఎవరితోనైనా కనీసం అరగంట సేపు మాట్లాడారంటే.. వాళ్లు, దేశంలోని ప్రముఖులైనా అయి ఉంటారు. లేదా ప్రత్యేక విదేశీ ఆహ్వానితులైనా అయి ఉంటారు. అయితే ఇటీవల మోదీతో అరగంట సేపు ముచ్చటించిన ఉత్తరప్రదేశ్ యువతి.. 18 ఏళ్ల నజియా ఖాన్ ఆ ప్రముఖులందరిలోకీ ప్రముఖురాలిగా గుర్తింపు పొందారు. బి.ఎ. ప్రథమ సంవత్సరం చదువుతున్న నజియా.. ‘సాహస పురస్కారం (బ్రేవరీ అవార్డు) అందుకోవడానికి మరో 14 మందితో కలిసి ఢిల్లీ వచ్చిన సందర్భంగా మోదీ ఆమెతో ప్రత్యేకంగా సంభాషించారు. కిడ్నాప్ కాబోతున్న ఆరేళ్ల బాలికను దుండగుల బారి నుంచి కాపాడటమే కాకుండా, ఆగ్రాలో తన కుటుంబ పరిసరాలలో జూదాన్ని అరికట్టడానికి తెగువ చూపడంతో ఈ అవార్డుకు నజియా ఎంపికయ్యారు. అవార్డును స్వీకరించేందుకు తల్లితో కలిసి ఢిల్లీ వచ్చిన నజియాతో మాట్లాడుతూ ఆ వివరాలన్నిటినీ కుతూహలంగా అడిగి తెలుసుకున్నారు మోదీ. సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్పంచుకుని అనేక అవార్డులను గెలుచుకున్న నజియాకు.. మోదీ తనతో అంతసేపు మాట్లాడడం సహజంగానే సంతోషాన్ని కలిగించింది. ‘‘మోదీజీ నన్ను ‘లడకు’ అని పిలిచారు అని ఇప్పటికీ ఆమె ఎంతో అబ్బురంగా చెప్పుకుంటున్నారు. లడకా, లడికీ (అబ్బాయి, అమ్మాయి) లను కలిపి.. మోదీ మురిపెంగా ‘లడకు’ అని చేసిన పద ప్రయోగంలో అమ్మాయిలు అబ్బాయిలకన్నా ఏమీ తక్కువ కాదు అనే భావన ఉంది. అయితే మోదీ అక్కడితో ఆగలేదు. ‘‘నజియా మీతో పోట్లాడుతుంటుందా?’’ అని నజియా తల్లిని దగ్గరకు పిలిచి మరీ అడిగారు. దానికి ఆ తల్లి మనసు ఉప్పొంగిపోయింది. అవార్డు తీసుకున్న అనంతరం రిపబ్లిక్ డే పరేడ్‌లో కూడా నజియా పాల్గొన్నారు. మొత్తం 18 మంది అవార్డు గ్రహీతలలో నజియా ఒకరు. వారిలో ముగ్గురికి మరణానంతరం అవార్డు లభించింది. -
ఎప్పుడు చూస్తానో!
‘‘రా రా’ చిత్రం టీజర్ చాలా బాగుంది. టీజర్ చూశాక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఉత్సుకత మరింత పెరిగింది. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అన్నారు. శ్రీకాంత్, నాజియా జంటగా శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ యూనిట్ దర్శకత్వంలో విజయ్ నిర్మించిన చిత్రం ‘రా రా’. ఈ సినిమా టీజర్‌ను మోహన్‌లాల్ విడుదల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ –‘‘వినోదంతో కూడిన హారర్ థ్రిల్లర్ చిత్రమిది. తొలిసారి నేను ఈ తరహా చిత్రం చేస్తున్నా. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు ప్రేక్షకులకు పూర్తి వినోదం పంచుతాయి. ఈ సినిమా పాటల వేడుకను విభిన్న రీతిలో జరుపనున్నాం’’ అన్నారు. ‘‘జూన్ ప్రథమార్ధంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు విజయ్. ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, కెమెరా: పూర్ణ. -
దెయ్యాలతో దోస్తీ
దెయ్యం అంటే ఎవరైనా ఆమడ దూరం పారిపోతారు. కానీ, వీళ్లు వేరే టైప్. దెయ్యాలతో దోస్తీ చేస్తారు. బ్రేక్ డ్యాన్సులు కూడా చేస్తారు. అప్పటివరకూ ఎంచక్కా ఆడిపాడిన దెయ్యాలు సడన్‌గా యూ టర్న్ తీసుకుని ఎటాక్ చేస్తే ఎలా ఉంటుందన్న అంశాలతో రూపొందుతున్న హర్రర్ చిత్రం‘రా..రా’. శ్రీకాంత్, నాజియా జంటగా శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజయ్ నిర్మించారు. విజి చరిష్ దర్శకుడు. రాక్ రాక్ షకీల్ సంగీత దర్శకుడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారి చేస్తున్న కామెడీ హర్రర్ థ్రిల్లర్ చిత్రమిది. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి’’ అన్నారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ఈ చిత్రం మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఓ టాప్ హీరోతో టీజర్ రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత విజయ్. -
'సీఎంగారు రక్షించండి.. వేధిస్తున్నారు'
ఆగ్రా: నజియా అనే ఆ అమ్మాయి గొప్ప సాహసికురాలుగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది కిడ్నాపర్ల చెర నుంచి ఓ ఆరేళ్ల బాబును రక్షించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేతుల మీదుగా ఆగస్టులో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి అవార్డును అందుకుంది. కానీ, అలాంటి బాలిక ఇప్పుడు మాత్రం అదే ముఖ్యమంత్రికి 'తనను రక్షించండి' అంటూ వరుసగా ట్వీట్లు చేసింది. గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ల ఆకృత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని ఆమె సీఎం అఖిలేశ్ కు విజ్ఞప్తి చేసింది. ఆగ్రాలోని మంటోలా ఏరియాలో ఓ గ్యాంబ్లింగ్ బ్యాచ్ మట్కా గ్యాంబ్లింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా ఫిర్యాదుచేసినప్పటి నుంచి వారి వేధింపులు మొదలయ్యాయి. పోలీసులు, గ్యాంబ్లర్స్ కలిసి తనను వేధిస్తున్నారని, తనకు అపఖ్యాతి తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని సీఎంకు ట్వీట్ ద్వారా తెలిపింది. తనను ఈ వేధింపుల నుంచి రక్షించాలని సీఎంను వేడుకుంది. అలాగే, ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారని, అతడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడంతో అతడి వల్ల తమ కుటుంబానికి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 'ఇలాగే తన పోరాటం కొనసాగించమని ముఖ్యమంత్రి నా భుజం తట్టి చెప్పారు. ఎప్పుడు నా గొంతు విప్పినా నా జీవితాన్ని ఓ సమస్యల సుడిగుండంలా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఫిర్యాదు చేసినవారిని కాకుండా పోలీసులు నన్ను పిలిచి విచారిస్తున్నారు. నేను జూలైలో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు' అని ఆ బాలిక నేరుగా సీఎం అఖిలేశ్‌కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేసింది. -
సినిమా రివ్యూ: నీజతగా...నేనుండాలి
ప్లస్ పాయింట్స్: కథ, కథనం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: హీరోయిన్ డైలాగ్స్, డబ్బింగ్ కథ, స్క్రీన్ ప్లే: షగుఫ్తా రఫీఖ్ సంగీతం: మిథున్, జీత్ గంగూలీ, అంకిత్ తివారీ నిర్మాత: బండ్ల గణేష్ దర్శకత్వం: జయ రవీంద్ర బాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై..భారీ ఘన విజయాన్ని ఆషికీ-2 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్, మద్యానికి బానిసై.. విఫలమైన ఓ గాయకుడి కథను నేపథ్యంగా తీసుకుని మ్యూజికల్, లవ్‌స్టోరిగా రూపొందిన ఆషికీ-2 చిత్రాన్ని ప్రాంతాలు భాషలకతీతంగా ప్రేక్షకులు బ్రహ్మరంధం పట్టారు. అదే చిత్రాన్ని తాజాగా ‘నీజతగా...నేనుండాలి’ టైటిల్‌తో రూపొందించి ఆగస్టు 22 తేదిన విడుదల చేశారు. హిందీలో ఆకట్టుకన్న విధంగానే ‘నీజతగా నేనుండాలి’ ప్రేక్షకులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్లాల్సిందే. కొద్దికాలంలోనే పాపులారిటీని సొంతం చేసుకున్న ఆర్జే, గాయకుడు రాఘవ జయరాం. డ్రగ్స్, మద్యానికి బానిసైన రాఘవ క్రమంగా తన పాపులారిటీని క్రమంగా కోల్పోతాడు. ఈ నేపథ్యంలో గాయత్రి నందన అనే బార్ సింగర్‌ను చూసి ఆమెలోని టాలెంట్‌ను ఇష్టపడుతాడు. గాయత్రిని గొప్ప సింగర్ చేయాలని నిర్ణయించుకుంటాడు. గాయత్రిపై ఇష్టం ప్రేమగా మారుతుంది. గాయత్రిని గొప్ప సింగర్‌ని చేశాడా? సింగర్‌గా రాఘవ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడా?గాయత్రి, రాఘవల ప్రేమ సుఖాంత మవుతుందా అనే ప్రశ్నలకు సమాధానమే నీజతగా నేనుండాలి. రాఘవగా సచిన్, గాయత్రిగా నజ్రియాలు నటించారు. తమ శక్తి సామర్ధ్యాల మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. పాధ్యాన్యత ఉన్న పాత్రల్లో నటించిన రావు రమేశ్, శశాంక్‌లు వారి పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. సగటు సంగీత అభిమానులను హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించికున్న ఆషికీ-2 మ్యూజిక్ ఒరిజినల్ ట్రాక్స్ మళ్లీ వినాలనే రేంజ్లో ఉన్నాయి. నేపథ్యగీతాలకు చంద్రబోస్ అందించిన సాహిత్యం బాగుంది. విశ్లేషణ: దేశవ్యాప్తంగా ఆషికీ-2 చిత్రానికి యువతతోపాటు అన్నివర్గాల నుంచి లభించిన ఆదరణ ఈ మధ్యకాలంలో ఏచిత్రానికి లభించలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటే అంచనాలు, కంపారిజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత వద్దనుకున్నా.. ఆషికీ-2 చిత్ర ప్రభావం వెంటాడుతునే ఉంటుంది. ఆషికీ-2 చిత్రం ప్రభావం ఆ రేంజ్లో ఉంటుంది. ‘నీజతగా నేనుండాలి’ చిత్ర విషయానికి వస్తే.. ఆ రేంజ్లో ఫీల్ కలిగించలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ఇంటెన్సిటిని, ఫీల్‌ను కొనసాగించడానికి జట్టు తమ శాయశక్తులా ప్రయత్నించారు. నటీనటుల యాక్టింగ్‌ను.. డైలాగ్స్, డబ్బింగ్ ఎక్కువగా డామినేట్ చేశాయి. హీరో, హీరోయిన్ల ఎంపిక విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆషికీ-2 చిత్రాన్ని చూడని తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. కొన్ని సీన్లలో ఎమోషన్స్‌ను తెరపైన చూపించడంలో సంగీతం, దర్శకుడు జయ రవీంద్ర ప్రతిభ ప్రధానపాత్ర పోషించింది. ఆషికీ-2 చూడని ప్రేక్షకులకు ‘నీజతగా నేనుండాలి’ ఓ ఫీల్‌ను కలిగిస్తుంది కాని.. అద్బుతమైన ఫీలింగ్‌ను మాత్రం కాదు..