వారణాసి రైలు ఉలిక్కిపడింది | Railways runs delayed train at full speed and girl reaches exam hall on time | Sakshi
Sakshi News home page

వారణాసి రైలు ఉలిక్కిపడింది

Published Sat, Feb 6 2021 12:35 AM | Last Updated on Sat, Feb 6 2021 4:57 AM

Railways runs delayed train at full speed and girl reaches exam hall on time - Sakshi

నాజియా తబస్సుమ్‌

ఉత్తరప్రదేశ్‌ గాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్‌ మంగళవారం (ఫిబ్రవరి 2) రాత్రి వారణాసి రైలెక్కింది. ఫిబ్రవరి 3– బుధవారం మధ్యాహ్నం వారణాసిలో ఆమెకు టీచర్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామ్‌ ఉంది. లెక్కప్రకారం అయితే రైలు వారణాసికి ఉదయం తొమ్మిదికి చేరుకోవాలి. కాని తెల్లారి పొగమంచు కమ్ముకుంది. వారణాసికి రెండు గంటల దూరంలోని ‘మౌ’ అనే ఊరిలో రైలు ఆగిపోయింది. నాజియా ఎగ్జామ్‌ తప్పిపోయేలా ఉంది. కాని అప్పుడొక చిత్రం జరిగింది. నాజియా ఎగ్జామ్‌ రాసింది. భారతీయ రైల్వేలు ప్రయాణికుల పక్షాన ఉన్నాయని ఈ ఉదంతం చెబుతోంది.

ప్రతి తమ్ముడికి ఒక అక్క ఉంటే బాగుంటుంది నిజమే కాని ప్రతి అక్కకు కూడా ఒక తమ్ముడు ఉంటే బాగుంటుందని ఇది చదివితే అర్థమవుతుంది. ‘ఏం చేయన్రా తమ్ముడూ... ఎగ్జామ్‌ మిస్‌ అయ్యేలా ఉంది’ అని అక్క ఆందోళన చెందితే తమ్ముడు రంగంలోకి దిగాడు. అతడు చేసిన పని ఫలితం ఇచ్చింది. అక్కకు గండం గట్టెక్కింది కూడా.

పొగమంచులో భవిష్యత్తు
ఉత్తర ప్రదేశ్‌లో ఘాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్‌ వారణాసిలో బుధవారం (ఫిబ్రవరి 3) మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష రాయాలి. టీచర్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామ్‌ అది. అంటే టీచరు కావాలనే నాజియా తబస్సుమ్‌ కల నెరవేరాలంటే ఆ ఎగ్జామ్‌ రాయకతప్పదు. అందుకే ఆమె ఘాజీపూర్‌లో మంగళవారం రాత్రి వారణాసి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. దాదాపు 10 గంటల ప్రయాణం. రైలు మరుసటి రోజు ఉదయం 9.30 గం. లోపు చేరుకున్నా ఎగ్జామ్‌ రాయడానికి మధ్యలో రెండు గంటల టైమ్‌ ఉంటుంది. కొంచెం లేటైనా పర్వాలేదనుకుని రైలు ఎక్కింది తబస్సుమ్‌. కాని పొగమంచులో రైలు ప్రయాణం నత్త నడకన సాగింది. వారణాసికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మౌ’ అనే జంక్షన్‌లో ట్రైను పూర్తిగా ఆగిపోయింది. అక్కడి నుంచి మామూలు రోజుల్లో ప్రయాణం దాదాపు 2 గంటలు. పొగమంచు వల్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టేలా ఉందని రైల్వే అధికారులు, ప్రయాణికులు కూడా నిర్థారణకొచ్చేశారు. కాని ట్రైన్‌లో ఉన్న నాజియాకు పరీక్ష ఎలాగైనా రాయాలన్న పట్టుదల. ఏం చేయాలి?

ఏం చేద్దాం తమ్ముడూ..?
అక్కకు తోడుగా ట్రైన్‌లో ఉన్న ఆమె తమ్ముడు అన్వర్‌ జమాల్‌ పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని గ్రహించాడు. వెంటనే ‘రైల్వేసేవ’ ట్విటర్‌ అకౌంట్‌లో పరిస్థితి వివరించాడు. అక్క హాల్‌ టికెట్, ట్రైన్‌ నంబర్‌ పెట్టి ‘సాయం చేయండి’ అని కోరాడు. నిజానికి అది చిగురంత ఆశతో చేసిన పనే. కాని ఆ పని ఫలితం ఇచ్చింది. అన్వర్‌ జమాల్‌ ట్వీట్‌కు రైల్వేశాఖ తక్షణమే స్పందించింది.

రంగంలో దిగిన రైల్వేశాఖ
వారణాసిలో ఉన్న రైల్వే అధికారులు వెంటనే రంగంలో దిగారు. ట్రైన్‌ ఎక్కడ ఉందో ఆరా తీశారు. ‘మౌ’ జంక్షన్‌లో ఉన్న ట్రైను వారణాసికి చేరాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయని గ్రహించారు. వారణాసి ఎక్స్‌ప్రెస్‌ ‘మౌ’ నుంచి వారణాసి చేరే మధ్యలో 4 స్టాపుల్లో ఆగాలి. ఆ స్టేషన్లలో దిగాల్సిన ప్రయాణికులకు ఇబ్బంది రాకూండా ఉండేందుకు ఆ నాలుగు స్టేషన్లలో రైలు ఆపడానికే నిశ్చయించుకున్నారు. కాని మౌ వారణాసిల మధ్య సింగిల్‌ లైన్‌లో ఇంకో  ట్రైన్‌ ఏదీ లేకుండా చూసుకున్నారు. స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ ఖాళీ లేకపోతే ఈ ట్రైనును లూప్‌లైన్‌లో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. అన్ని స్టేషన్ల నుంచి సిగ్నల్‌ సకాలంలో అందేలా శ్రద్ధ పెట్టారు. ట్రైను డ్రైవర్‌కు, గార్డ్‌కు సమాచారం అందించారు. ట్రైను చకచక కదిలింది. మధ్యలోని నాలుగు స్టేషన్‌లలో ఆగి వెంటనే బయలుదేరి నాజియాను వారణాసి చేర్చింది.


‘అందరికీ కృతజ్ఞతలు. మేము సమయానికి చేరుకున్నాం’ అని అన్వర్‌ జమాల్‌ సంతోషంగా ట్వీట్‌ చేశాడు. నాజియా ఎగ్జామ్‌ రాసింది. రేపు ఆమె టీచర్‌ అయితే అందరూ ఆమెను రైలు టీచరమ్మ అని పిలుచుకున్నా ఆశ్చర్యం లేదు. అలా ఆమె ప్రయాణం అందరికీ గుర్తుండిపోయింది.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement