railway officers
-
వాదోపవాదాల విషాదం
రైల్వే సిగ్నల్స్ నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండకపోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నైరుతి రైల్వే ప్రధాన అధికారి హెచ్చరించారు! అలాగే, రైలు ప్రయాణికుల భద్రత గురించి ‘కాగ్’, పార్లమెంటరీ స్థాయీ సంఘం అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత కేంద్ర కమిటీలు, ఉన్నతస్థాయి విచారణ సంఘాల నివేదికలను అధికారులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? రైళ్లు ఢీకొనకుండా ‘కవచ్’ రక్షణ వ్యవస్థను రూపొందించినా, బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గాల్లో కాపలా లేని లెవెల్ క్రాసింగ్స్‌ను కూడా తొలగించినా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు.. మంత్రులు రాజీనామాలు చేయాలని, కాదు కాదు... కింది తరగతి రైల్వే ఉద్యోగుల్ని, కార్మికుల్ని శిక్షించాలని వాదోపవాదాలకు దిగడం కూడా విషాదమే! ‘‘వందలాదిమంది ప్రయాణికుల దుర్మరణానికి దారి తీసిన ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ శతాబ్దంలోనే ఇది అతి పెద్ద ప్రమాదం.’’ – ప్రధాని నరేంద్ర మోదీ (4.6.2023) ‘‘చాలాకాలంగా భారత రైల్వేలోని సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణలో ఉన్న తీవ్రమైన లోపాల గురించీ, వైఫల్యాల గురించీ, రైళ్ల రాకపోకలను తెలియజేసే గుర్తులను సూచించే సరైన పద్ధతుల గురించీ; రైలు బయలుదేరిన తరువాత, రైలు వెళ్లే దిశను మార్చవలసి వస్తే ఆ మార్పును సూచించే గుర్తును తెలిపే విధానం గురించీ స్పష్టంగా ఉంది. కానీ నిర్దిష్టమైన సిగ్నల్స్‌ను అనుసరిస్తూ లోపాల్ని తక్షణం సవరించకపోతే – రైలు దుర్ఘటనలు అనివార్యమవుతాయి...’’ అని కూడా నైరుతి రైల్వే ప్రధాన అధికారి ఈ ఏడాది ఫిబ్రవరి 9 న హెచ్చరించారు. అంతేగాదు, రైల్వే సిగ్నల్స్ నిర్వహణ వ్యవస్థపై నిరంతరం కన్నువేసి, సరిదిద్దుకుంటూ ఉండకపోతే రైలు ప్రమాదాలు తరచూ సంభవించే అవకాశం ఉందని ఆ ఉన్నతాధికారి హెచ్చరించారు. అలాగే, రైలు ప్రయాణికుల భద్రత గురించి ‘కాగ్’, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికల హెచ్చరికలను పాలకులు పెడచెవిన పెట్టడానికి కారకులెవరన్న ప్రశ్నలకూ సమాధానం లేదు! ఈ పై కారణాలను పరిశీలించినప్పుడు ఎవరిని నిందించాలి? పాలకుల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర కమిటీలు, దఫదఫాలుగా నియమించిన సాధికార ఉన్నతస్థాయి విచారణ సంఘాల నివేదికలను, వాటి సారాంశాన్ని అధికారులు ఎందుకు పాటించడం లేదన్నది అసలు ప్రశ్న. రైలు ప్రమాద ఘటన సందర్భంగా, మహబూబ్‌నగర్ వద్ద రైలు ప్రమాదంలో 112 మంది ప్రయాణికులు చనిపోయినందుకు విలవిలలాడిన నాటి కేంద్ర రైల్వే మంత్రి, గాంధేయవాది అయిన లాల్ బహ దూర్ శాస్త్రి తన పదవికి క్షణాలలో రాజీనామా చేసి ఆదర్శంగా నిలబడ్డారు. ప్రధాని పండిట్ నెహ్రూ ‘వద్దని’ వారించినా లాల్‌బహదూర్ రాజీనామాకే పట్టుబట్టారు! మహబూబ్‌నగర్ దుర్ఘటన తరువాత కొలది రోజులకే తమిళనాడులోని అరియలూర్ దుర్ఘటనలో 144 మంది చనిపోయారు. ఈ రెండు ఘటనలూ లాల్‌బహదూర్‌ను కుదిపేశాయి. 68,100 కిలోమీటర్ల నిడివిగల రైల్వే లైన్లతో కూడిన భారత వ్యవస్థలో గత 15 ఏళ్లలో జరిగిన ప్రధాన దుర్ఘటనలు: జ్ఞానేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (మృతులు 148), ఉత్తర బంగా–వనాంచల్ ఎక్స్ ప్రెస్ (63 మంది), ఛాప్రా–మథుర ఎక్స్‌ప్రెస్ (63 మంది), హుబ్లీ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (25మంది), తమిళనాడు–ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (30), యూపీ సంత్‌కబీర్–గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ (25), డెహ్రాడూన్–వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ (30), పాట్నా–ఇండోర్ ఎక్స్‌ప్రెస్ (150), బికనీర్– గౌహతి ఎక్స్‌ప్రెస్ (9 మంది), హౌరా–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (140). రైళ్లు ఢీకొనకుండా ‘కవచ్’ రక్షణ వ్యవస్థను రూపొందించినా, బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గాల్లో కాపలా లేని లెవెల్ క్రాసింగ్స్‌ను కూడా తొలగించినా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదుపాజ్ఞల వ్యవస్థ పకడ్బందీగా లేనందున జరుగుతున్న ఈ వరస రైలు దుర్ఘటనల నివారణకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అక్కరకు రావడం లేదు. అంటే సిబ్బందికి ఇచ్చే శిక్షణలో కూడా లోపం ఉందని పలువురు రైల్వే అధికారుల నోట కూడా వినవస్తోంది. కానీ ఈ తీవ్ర లోపాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు కింది తరగతి రైల్వే ఉద్యోగుల్నీ, కార్మికుల్నీ శిక్షించే మార్గాలను పాలకులు వెతకడానికి ప్రయత్నించడం సమంజసం కాదు. ఒకవైపున రైల్వేబోర్డే సిగ్నలింగ్‌లో లోపం వల్ల ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని చెబుతున్నప్పుడు, ప్రమాద కారణాల్ని కార్మిక సిబ్బందిపైకి నెట్టడానికి ప్రయత్నించడం సరి కాదు. ఆధునిక పరిజ్ఞానం ఆకళింపులో ఉన్నా మానవుల స్వయం పరిమితుల్ని కూడా గమనించుకోవాలి. అక్కడికీ ఒక సీనియర్ రైల్వే అధికారి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు: ‘‘ఇంటర్ లాకింగ్‌లోని సాఫ్ట్ వేర్ లేదా హార్డ్ వేర్ పనిచేయడంలో సంభవించే లోపం వల్ల కూడా రైళ్లకు సూచించవలసిన లూప్‌లైన్, మెయిన్ లైన్ ఎంపికలో గందరగోళానికి అవకాశం ఉంది. అంటే సిగ్నల్ ఒకటై, స్విచ్ ఆపరేషన్ వేరైతే ఈ ప్రమాదానికి ఆస్కారం ఉంది (5.6.23). ఈ ఘోరానికి రైల్వేమంత్రి రాజీనామా పరిష్కారం కాకపోవచ్చుగాని, ఆ స్థానంలో మరొకర్ని విచారణ పేరిట తేలిగ్గా ఇరికించే అవకాశం ఉంది. ఇంతకూ మనిషి (మంత్రి కూడా మనిషే అయితే) స్వార్థం ఎలా పనిచేస్తుందో కవి ‘సినారె’కు బాగా తెలిసి నట్టుంది: ‘‘తోడుగ సాగే నీడను కూడా వాడుకుంటుంది స్వార్థం ఆపై వాణ్ణే పాచిక చేసే ఆడుకుంటుంది స్వార్థం మనిషిలోని ఆ చీకటి కోణం మార్చే వేషాలెన్నో – చిటికెడు పేరుకు నీతిని నిలువున చీల్చేస్తుంది స్వార్థం మూరెడు గద్దె కోసం జాతి పరువునే ఆరవేస్తుంది స్వార్థం!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఇక గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణం!
సాక్షి, అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంతకల్ రైల్వే డివిజన్లలో రైళ్ల వేగం పెరగనుంది. సోమవారం నుంచి గరిష్టంగా గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ మేరకు రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంపొందించారు. విజయవాడ డివిజన్లోని కొండపల్లి– గూడూరు, గుంతకల్ డివిజన్లోని రేణిగుంట–గుంతకల్ సెక్షన్లలో రైళ్ల రద్దీ అధికంగా ఉంది. దీంతో రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచాలని 2020లో నిర్ణయించారు. ఇందుకు లక్నోలోని ఆర్డీఎస్వో అనుమతి ఇచ్చిన తర్వాత 2020 నుంచే రైల్వే అధికారులు దశలవారీగా రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో ఇప్పటివరకు గంటకు 110 కి.మీ. వేగంతో ప్రయాణించిన రైళ్లు సోమవారం నుంచి గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణించనున్నాయి. ఇక నుంచి రైళ్ల ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ప్రయాణికులకు సుఖ ప్రయాణం సాధ్యపడుతుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
Secunderabad Railway Station: సాఫీగా రైలు కూత!
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా తేరుకుంది. శుక్రవారం రాత్రే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం చాలా వరకు రైళ్ల రాకపోకలను యథాతథంగా కొనసాగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు, లింక్ రైళ్లు నడవకపోవడం వంటి ఇబ్బందులో కొన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం ప్రయాణికుల రద్దీ సాధారణంగానే కనిపించింది. మరోవైపు ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆర్ఏఎఫ్ బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్ రెండు వైపులా సాయుధ సిబ్బందితో కాపలా ఏర్పాటు చేసి, అందరినీ పూర్తిగా తనిఖీ చేశాకే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతిస్తున్నారు. మరికొద్ది రోజులు ఇబ్బందులు శుక్రవారం నాటి ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయిన విషయం తెలిసిందే. సాధారణంగా రైళ్ల నిర్వహణ జతలుగా ఉంటుంది. ఒకవైపు నుంచి మరోవైపు రైలు వెళితేనే మళ్లీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సర్వీసులు కొనసాగుతాయి. ఒక దగ్గరే నిలిచిపోతే అంతరాయం ఏర్పడుతుంది. శుక్రవారం ఇలా రైళ్లు ఆగిపోవడంతో.. శనివారం కూడా పలు రైళ్లను నడపలేకపోయారు. ఇక విశాఖపట్నం మీదుగా ఉత్తరాదికి వెళ్లే మార్గంలో ఏర్పడ్డ ఆటంకాలతో మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణాలతో వచ్చే మూడు నాలుగు రోజులపాటు కూడా పలు రైళ్లకు ఆటంకం కొనసాగనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శనివారం రాత్రి ప్రకటన వెలువరించింది. శనివారం 18 సాధారణ రైళ్లు, సిటీలో నడిచే 40 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయగా.. ఆదివారం ఐదు రైళ్లను.. సోమ, మంగళవారాల్లో ఒక్కో రైలు రద్దయినట్టు ప్రకటించింది. రాకపోకలకు ఆటంకాలతో ఏర్పడ్డ రద్దీ నేపథ్యంలో 19న రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పార్శిళ్లకు నష్ట పరిహారం ఆందోళనకారుల విధ్వంసంలో నష్టపోయిన పార్శిళ్లకు రైల్వే నుంచి నష్టపరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే పార్శిల్‌ను బుకింగ్ చేసుకునే సమయంలో పేర్కొన్న విలువ మేరకు నష్ట పరిహారం ఇస్తామని వెల్లడించారు. వేగంగా మరమ్మతులు.. ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన పరికరాలు, మౌలిక వసతులకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. ట్యూబ్‌లైట్లు, సీసీ కెమెరాలు, ఫ్యాన్లు కొత్తవి బిగిస్తున్నారు. పగిలిన సిమెంటు బెంచీలకు మరమ్మతులు చేయిస్తున్నారు. విధ్వంసంలో దెబ్బతిన్న దుకాణాలను నిర్వాహకులు పునరుద్ధరించుకున్నారు. రద్దయిన, షెడ్యూల్ మారిన రైళ్లు ఇవీ.. ► భువనేశ్వర్–సికింద్రాబాద్, త్రివేండ్రం సెంట్రల్–సికింద్రాబాద్, దర్బంగా–సికింద్రాబాద్, షాలీమార్–సికింద్రాబాద్ తదితర రైళ్లను అధికారులు రద్దు చేశారు. ► ఆదివారం సికింద్రాబాద్–షాలిమార్ (ఉదయం 4.20), కాచిగూడ–నర్సాపూర్ (రాత్రి 11 గంటలకు) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. సికింద్రాబాద్–దానాపూ ర్, సికింద్రాబాద్–రాజ్‌కోట్, సికింద్రాబాద్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లను సమయా లను రీషెడ్యూల్ చేసి నడుపుతున్నారు. నేడూ ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం కూడా పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌లను రద్దు చేశారు. ఆదివారం కూడా ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి తదితర రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
కొత్త నంబర్లతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను నూతన నంబర్లతో నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 08117 నంబరు గల హౌరా–మైసూర్ ఎక్స్‌ప్రెస్ 2022 జనవరి 7వ తేదీ నుంచి 08017 నంబరుతో నడుస్తుందని పేర్కొన్నారు. 08118 నంబరు గల మైసూర్–హౌరా రైలు జనవరి 9వ తేదీ నుంచి 08018 నంబరుతో నడుస్తుందని తెలిపారు. 08645 నంబరు గల షాలిమార్–హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ జనవరి 2వ తేదీ నుంచి 08045 నంబరుతో నడుస్తుందని పేర్కొన్నారు. 08646 నంబరు గల హైదరాబాద్–షాలిమార్ రైలు జనవరి 4వ తేదీ నుంచి 08046 నంబరుతో నడుస్తుందని వివరించారు. -
‘ఈస్ట్‌కోస్ట్’లో కోచ్‌ల ఆట
సాక్షి, విశాఖపట్నం: ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారుల పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైంది. వాల్తేరు డివిజన్‌కు పాత కోచ్‌లు పడేసి.. కొత్త టెక్నాలజీతో తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను తమ పరిధిలో తిప్పుకోవడం వారికి ఆనవాయితీగా మారిపోయింది. వీటిపై విమర్శలు రావడంతో ఈసారి కొత్త పంథాని అనుసరించారు. కొత్త కోచ్‌లను విశాఖ డివిజన్‌కు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించి.. తమ పరిధిలోనే కొత్త కోచ్‌లను తిప్పుకుంటున్నారు. తాజాగా వచ్చిన ప్రకటనతో ఈ విషయం తేటతెల్లమైంది. పేరు వాల్తేరుదే అయినా.. కొత్త కోచ్‌లపై పెత్తనం మాత్రం భువనేశ్వర్దేనన్న విషయం చెప్పకనే చెప్పారు. జగదల్పూర్–భువనేశ్వర్(08445) స్పెషల్ ట్రైన్‌ను ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో ఈ నెల 10 నుంచి నడుపుతున్నట్లు గురువారం వాల్తేరు డివిజన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రైలు వాస్తవానికి జగదల్పూర్, కోరాపుట్, రాయగడ, విజయనగరం, పలాస మీదుగా ప్రయాణిస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు రాదు. ఈ రైలు వల్ల విశాఖ డివిజన్‌కు పెద్దగా ఉపయోగం లేదు. వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని స్టేషన్ల మీదుగా రైలు వెళ్తుంది కాబట్టి.. విశాఖ డివిజన్‌కు కేటాయించామని చెబుతున్నారు. కానీ.. పెత్తనమంతా భువనేశ్వర్ అధికారులదే. విశాఖ స్టేషన్‌కు రాని ఎల్‌హెచ్‌బీ ట్రైన్‌ని వాల్తేరు డివిజన్‌కు కేటాయిస్తున్నట్లు ఎలా పేర్కొంటారని రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దీనిపై వాల్తేరు డివిజన్ అధికారులు కూడా నోరు మెదపకపోవడం శోచనీయమని వ్యాఖ్యానిస్తున్నారు. -
వారణాసి రైలు ఉలిక్కిపడింది
ఉత్తరప్రదేశ్ గాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్ మంగళవారం (ఫిబ్రవరి 2) రాత్రి వారణాసి రైలెక్కింది. ఫిబ్రవరి 3– బుధవారం మధ్యాహ్నం వారణాసిలో ఆమెకు టీచర్ సర్టిఫికెట్ ఎగ్జామ్ ఉంది. లెక్కప్రకారం అయితే రైలు వారణాసికి ఉదయం తొమ్మిదికి చేరుకోవాలి. కాని తెల్లారి పొగమంచు కమ్ముకుంది. వారణాసికి రెండు గంటల దూరంలోని ‘మౌ’ అనే ఊరిలో రైలు ఆగిపోయింది. నాజియా ఎగ్జామ్ తప్పిపోయేలా ఉంది. కాని అప్పుడొక చిత్రం జరిగింది. నాజియా ఎగ్జామ్ రాసింది. భారతీయ రైల్వేలు ప్రయాణికుల పక్షాన ఉన్నాయని ఈ ఉదంతం చెబుతోంది. ప్రతి తమ్ముడికి ఒక అక్క ఉంటే బాగుంటుంది నిజమే కాని ప్రతి అక్కకు కూడా ఒక తమ్ముడు ఉంటే బాగుంటుందని ఇది చదివితే అర్థమవుతుంది. ‘ఏం చేయన్రా తమ్ముడూ... ఎగ్జామ్ మిస్ అయ్యేలా ఉంది’ అని అక్క ఆందోళన చెందితే తమ్ముడు రంగంలోకి దిగాడు. అతడు చేసిన పని ఫలితం ఇచ్చింది. అక్కకు గండం గట్టెక్కింది కూడా. పొగమంచులో భవిష్యత్తు ఉత్తర ప్రదేశ్‌లో ఘాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్ వారణాసిలో బుధవారం (ఫిబ్రవరి 3) మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష రాయాలి. టీచర్ సర్టిఫికెట్ ఎగ్జామ్ అది. అంటే టీచరు కావాలనే నాజియా తబస్సుమ్ కల నెరవేరాలంటే ఆ ఎగ్జామ్ రాయకతప్పదు. అందుకే ఆమె ఘాజీపూర్‌లో మంగళవారం రాత్రి వారణాసి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. దాదాపు 10 గంటల ప్రయాణం. రైలు మరుసటి రోజు ఉదయం 9.30 గం. లోపు చేరుకున్నా ఎగ్జామ్ రాయడానికి మధ్యలో రెండు గంటల టైమ్ ఉంటుంది. కొంచెం లేటైనా పర్వాలేదనుకుని రైలు ఎక్కింది తబస్సుమ్. కాని పొగమంచులో రైలు ప్రయాణం నత్త నడకన సాగింది. వారణాసికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మౌ’ అనే జంక్షన్లో ట్రైను పూర్తిగా ఆగిపోయింది. అక్కడి నుంచి మామూలు రోజుల్లో ప్రయాణం దాదాపు 2 గంటలు. పొగమంచు వల్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టేలా ఉందని రైల్వే అధికారులు, ప్రయాణికులు కూడా నిర్థారణకొచ్చేశారు. కాని ట్రైన్లో ఉన్న నాజియాకు పరీక్ష ఎలాగైనా రాయాలన్న పట్టుదల. ఏం చేయాలి? ఏం చేద్దాం తమ్ముడూ..? అక్కకు తోడుగా ట్రైన్లో ఉన్న ఆమె తమ్ముడు అన్వర్ జమాల్ పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని గ్రహించాడు. వెంటనే ‘రైల్వేసేవ’ ట్విటర్ అకౌంట్లో పరిస్థితి వివరించాడు. అక్క హాల్ టికెట్, ట్రైన్ నంబర్ పెట్టి ‘సాయం చేయండి’ అని కోరాడు. నిజానికి అది చిగురంత ఆశతో చేసిన పనే. కాని ఆ పని ఫలితం ఇచ్చింది. అన్వర్ జమాల్ ట్వీట్‌కు రైల్వేశాఖ తక్షణమే స్పందించింది. రంగంలో దిగిన రైల్వేశాఖ వారణాసిలో ఉన్న రైల్వే అధికారులు వెంటనే రంగంలో దిగారు. ట్రైన్ ఎక్కడ ఉందో ఆరా తీశారు. ‘మౌ’ జంక్షన్లో ఉన్న ట్రైను వారణాసికి చేరాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయని గ్రహించారు. వారణాసి ఎక్స్‌ప్రెస్ ‘మౌ’ నుంచి వారణాసి చేరే మధ్యలో 4 స్టాపుల్లో ఆగాలి. ఆ స్టేషన్లలో దిగాల్సిన ప్రయాణికులకు ఇబ్బంది రాకూండా ఉండేందుకు ఆ నాలుగు స్టేషన్లలో రైలు ఆపడానికే నిశ్చయించుకున్నారు. కాని మౌ వారణాసిల మధ్య సింగిల్ లైన్లో ఇంకో ట్రైన్ ఏదీ లేకుండా చూసుకున్నారు. స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ ఖాళీ లేకపోతే ఈ ట్రైనును లూప్లైన్లో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. అన్ని స్టేషన్ల నుంచి సిగ్నల్ సకాలంలో అందేలా శ్రద్ధ పెట్టారు. ట్రైను డ్రైవర్‌కు, గార్డ్‌కు సమాచారం అందించారు. ట్రైను చకచక కదిలింది. మధ్యలోని నాలుగు స్టేషన్లలో ఆగి వెంటనే బయలుదేరి నాజియాను వారణాసి చేర్చింది. ‘అందరికీ కృతజ్ఞతలు. మేము సమయానికి చేరుకున్నాం’ అని అన్వర్ జమాల్ సంతోషంగా ట్వీట్ చేశాడు. నాజియా ఎగ్జామ్ రాసింది. రేపు ఆమె టీచర్ అయితే అందరూ ఆమెను రైలు టీచరమ్మ అని పిలుచుకున్నా ఆశ్చర్యం లేదు. అలా ఆమె ప్రయాణం అందరికీ గుర్తుండిపోయింది. – సాక్షి ఫ్యామిలీ -
కాంట్రాక్టుల కోసం రూ.కోటి లంచం
న్యూఢిల్లీ: కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, కోటి రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్‌కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(కన్స్ట్రక్షన్) మహేందర్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసింది. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్(ఐఆర్ఎస్ఈ) 1985 బ్యాచ్‌కు చెందిన చౌహాన్‌ను అస్సాం రాజధాని గువాహటిలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే లంచం చేరవేసిన ఏబీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి భూపేంద్ర రావత్, మరో వ్యక్తి ఇంద్రాసింగ్ను అరెస్టు చేశారు. దీంతో సంబంధం ఉన్న రైల్వే అధికారులు హేమ్‌చంద్ బోరా, లక్ష్మీకాంత్ వర్మ, ఏబీసీఐ సంస్థ డైరెక్టర్ పవన్ బైద్పై కేసు నమోదు చేశారు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వేస్ పరిధిలో పలు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు చౌహాన్ ఏబీసీఐ సంస్థకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన ఆ సంస్థ నుంచి లంచం కింద రూ. కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 60 లక్షలను సీబీఐ రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, అస్సాంలో పలుచోట్ల దాడులు చేసి, రూ.54 లక్షలు స్వాధీనం చేసుకుంది. -
రైల్వే ఏసీలో కొత్త గాలి..
న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఏసీ రైళ్లలోని పంపింప్ వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నారు. బోగీలో ఉండే గాలిని తరచూ మార్చేలా సరికొత్త వ్యవస్థను అమర్చనున్నారు. దీంతో కొత్త గాలి ప్రవేశించి కరోనా వ్యాప్తిని అరికడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలో గంటకు ఆరు నుంచి ఎనిమిది సార్లు మాత్రమే కొత్తగాలి బోగీలో ప్రవేశించేది. అందులో 80 శాతం గాలి అక్కడే తిరుగుతుండగా కేవలం 20 శాతం కొత్త గాలి ప్రవేశించేది. అయితే కొత్త వ్యవస్థ ద్వారా 16 నుంచి 18సార్లు కొత్త గాలి బోగిలోకి ప్రవేశి స్తుంది. ఏసీ స్థాయిని కూడా 23 నుంచి 25 డిగ్రీలకు పెంచుతామని, ఈ విధానంలో రైళ్లు ఎక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయని అధికారులు తెలిపారు. -
వలస కూలీలను అవమానపరిచినందుకు..
ఫిరోజాబాద్ : వలస కార్మికుల పట్ల చిన్నచూపుతో వ్యవహరించిన సీనియర్ రైల్వే అధికారిని సస్పెండ్ చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గత సోమవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. డికె దీక్షిత్ ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్లో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గత సోమవారం దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా తన టీంతో కలిసి ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అయితే దీక్షిత్ పుట్టినరోజు సందర్భంగా బిస్కెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇంతలో వలసకూలీలకు సంబంధించిన శ్రామిక్‌రైలు అక్కడికి చేరుకొంది.దీక్షిత్ వారికి కూడా బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వాలని తన టీంకు తెలిపాడు. (విశాఖ జిల్లాలో విషాదం) అయితే టీం సభ్యులు బిస్కెట్ పాకెట్లను వారి చేతికి అందివ్వకుండా బిస్కెట్ పాకెట్లను చింపి ఒక్కో బిస్కెట్‌ను కంపార్ట్మెంట్లోకి విసిరారు. ఈ సందర్భంగా దీక్షిత్ టీంలోని సభ్యుడు గట్టిగా అరుస్తూ..' ఈరోజు మా సార్ దీక్షిత్ పుట్టినరోజు. అందుకే బిస్కెట్లు పంచుతున్నాం' అంటూ పేర్కొన్నాడు. అయితే వలస కూలీలు మరికొన్ని బిస్కెట్ పాకెట్లు ఇవ్వాలని కోరితే మీకు ఇచ్చిన దాంట్లోనే సరిపెట్టుకొండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంతేగాక కిందపడిన బిస్కెట్లు వేస్ట్ కాకుండా తీసుకొని తినేయండి అంటూ వలసకూలీల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇది కాస్తా అక్కడి లోకల్ ఆఫీసర్ తన వాట్సప్ గ్రూఫ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.('పటాసులు కాల్చండి.. డ్రమ్ములు వాయించండి') విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు దీక్షిత్‌తో పాటు అతనితో ఉన్న టీమ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.వలసకూలీలపై అవమానకరంగా ప్రవర్తించడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తన ట్విటర్లో పేర్కొంది. సరిగ్గా వారం కిందట ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆహరం కోసం వలసకూలీలు ఒకరిని ఒకరు తోసుకున్న సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. వలసకూలీలపై వివక్ష చూపిస్తూ రైల్వే అధికారులు ఇలా చేయడం దారుణం అని అభివర్ణించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ రైల్వేశాఖ అధికారులను కోరింది. -
రాష్ట్రాలు దాటకుండా రైళ్లు నడిపే యోచన!
సాక్షి, అమరావతి: ఈ నెల 15 నుంచి పరిమిత సంఖ్యలో రైళ్లను తిప్పేందుకు విధి విధానాలు నిర్దేశిస్తూ రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా రాష్ట్రాలు దాటకుండా రైళ్ల ను నడిపించాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏ ఏ మార్గాల్లో రైళ్లు నడపాలనే అంశంపైనా ఉన్నతాధికారు లు కసరత్తు చేస్తున్నారు. రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ గురువారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రైళ్లను ఏ మార్గాల్లో నడపాలి? ఏ విధంగా నడపాలి? అనే అంశాలపై రైల్వే ఉన్నతాధికారులు ప్రతిపాదనల్ని రైల్వే బోర్డుకు అందించారు. అయితే దీనిపై రైల్వే శాఖ ఆదివారం నిర్ణయాన్ని వెలువరించనుంది. ► లాక్డౌన్ తర్వాత రైళ్లను నడిపినా ఫ్లాట్ ఫాం టికెట్ల అమ్మకాలు నిలిపేయాలని యోచిస్తున్నారు. పరిమితంగా నడిపే రైళ్లను నాన్ స్టాప్‌గా తిప్పాలని నిర్ణయించారు. ► ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిపై రైల్వే అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. ► ప్రయాణ సమయంలో జ్వరం వచ్చినా, కరోనా లక్షణాలు బయటపడినా మధ్యలోనే దించేస్తారు. ► బెర్త్ ఖరారైన వారికే ప్రయాణం చేసేందుకు అనుమతి. ► ఎట్టి పరిస్థితుల్లోనూ వయోవృద్ధులను రైలు ఎక్కనివ్వరు. ► ప్రయాణ సమయానికి కనీసం నాలుగు గంటల ముందు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ► ప్రయాణికులంతా భౌతిక దూ రం పాటిస్తూ, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల తర్వాతే రైలెక్కాలి. ► గ్లౌజులు, మాస్క్‌లతోనే బోగీల్లోకి అనుమతిస్తారు. రైలు బోగీలో క్యాబిన్‌కు ఇద్దరు ప్రయాణికులనే అనుమతిస్తారు. ► రైళ్లలో ఏవిధమైన తినుబండారాల విక్రయాలనూ అనుమతించరు. నేటి నుంచి సికింద్రాబాద్‌కు గూడ్స్ రైళ్లు తిరుపతి: రేణిగుంట నుంచి సికింద్రాబాద్‌కు శనివారం నుంచి రెండు గూడ్స్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పార్సెల్ సూపర్వైజర్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి గుంతకల్లు మీదుగా సికింద్రాబాద్‌కు కూరగాయలు, పండ్లతో ఒక రైలు, అరగంట వ్యవధిలో మరొక రైలు రేణిగుంట నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు బయలుదేరుతుందని పేర్కొన్నారు. -
చలిదెబ్బకు రైల్వేకు వణుకు
సాక్షి, గుంతకల్లు: శీతాకాలం అంటే రైల్వే అధికారులకు హడల్. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో రైలు కమ్మీలకు తగినంత ఉష్ణోగ్రత లేని కారణంగా రైలు కమ్మీలు, రైల్ వెల్డింగ్‌లు విరిగిపోవడం సర్వసాధారణం. ముఖ్యంగా నల్లరేగడి, చెరువుల సమీపాన ఉన్న ట్రాక్‌ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటుంది. వేకువజామున 3.00 గంటల నుంచి ఉదయం 7.00 గంటల వరకు, సాయంత్రం 7.00 రాత్రి 10.00 గంటల మధ్య రైలు కమ్మీలు చలి తీవ్రతకు బ్రేక్ అవుతుంటాయి. గడిచిన నెలరోజుల్లో డివిజన్ వ్యాప్తంగా 09 ప్రాంతాల్లో రైలు పట్టాలు విరిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. ముఖ్యంగా రైల్వే లోకో సిబ్బంది (రైళ్ల డ్రైవర్లు, సహా డ్రైవర్లు) అప్రమత్తంగా లేకపోతే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కరితోనే 16 కి.మీల గస్తీ.. ట్రాక్ పరిరక్షణలో అత్యంత కీలకమైన ట్రాక్‌మెన్ రోజూ 16 కి.మీలు గస్తీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్యాంగ్‌మెన్ 4 కి.మీలు పరిధి పర్యవేక్షించాల్సి ఉంటుంది. రెండు పర్యాయాలు ఈ మార్గంలో గ్యాంగ్‌మెన్ తనిఖీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం 6.00 నుంచి అర్ధరాత్రి 12.00 గంటల దాకా ఒక షిప్టు, ఇదిలా ఉండగా మధ్యరాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు నిర్వహించే నైట్ పెట్రోలింగ్ (రాత్రి గస్తీ) విధులకు ఇద్దరు గ్యాంగ్‌మెన్ పని చేస్తుంటారు. ప్రస్తుతం నైట్ పెట్రోలింగ్ విధులకు ఒక్క గ్యాంగ్‌మెన్ నియమించడం భయాందోళన కల్గిస్తోందని గ్యాంగ్మెన్లు చెబుతున్నారు. ఇతర డివిజన్లలో నైట్ పెట్రోలింగ్ ఇద్దరు గ్యాంగ్మెన్తో చేయిస్తుంటే గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ఒక్కరేతోనే నిర్వహిస్తుండటం దారుణమంటున్నారు. అసలే చలి కాలం రాత్రిపూట రైలు పట్టాల వెల్డింగ్ చలికి కరిగిపోయి పట్టాలు పగిలే ప్రమాదం ఉంది. దురదష్టవశాత్తు రైలు ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తూ రైలు ప్రమాదాలు నివారించాలంటే రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఈనెల 03న డివిజన్లోని వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో రైలు పట్టాల అసైన్మెంట్ విరిగి తిరుపతి–షిరిడీ వెళ్లే సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్‌తో వెళ్తుండటంతో పెను ప్రమాదం జరగలేదు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలంటే మాత్రం సిబ్బందిని పెంచాల్సిందే. రైలు పట్టాల ఉష్ణోగ్రతపై ఆరా.. ప్రస్తుతం చలికాలం కావడంతో రైలు పట్టాలు విరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో రైలు పట్టాల ఉష్ణోగ్రత వివరాలపై ఆరా తీస్తున్నట్లు రైల్వే మార్గాల పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రైలు పట్టాలను తరుచుగా అల్ట్రా సోనిక్ ఫ్ల డిటెక్టర్ ద్వారా పరీక్షలు చేయాలని సూచించి ఆ వివరాలను తమకు తెలియజేయాలని ఆదేశించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.. గుంతకల్లు డివిజన్ మొత్తం మీద 1354.27 కి.మీల రైలు మార్గం విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని పర్యవేక్షించడానికి డివిజన్ పరిధిలో 23 ఇంజనీరింగ్ డిపోలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సిబ్బంది కొరత ఉంది. డివిజన్ వ్యాప్తంగా దాదాపు 1700 ట్రాక్‌మెన్ పోస్టులు ఖాళీ ఉండగా గడిచిన ఆగస్టు నెలలో 986 పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 714 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. -
రైలుకు 'ర్యాట్' సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఎలుక... ఇప్పుడు రైల్వే శాఖను గడగడలాడిస్తోంది. సిగ్నల్ లేకుండా రైలు ముందుకు కదిలితే ప్రమాదం ఎలా పొంచి ఉందో, ఎలుకల గుంపుతోనూ అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలుకల రూపంలో ఎదురయ్యే ప్రమాదానికి అడ్డుకట్ట వేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఆ కసరత్తు ఖరీదు ఎంతో తెలుసా... ఏకంగా రూ. 228 కోట్లు. రైలు పట్టాల కింద పందికొక్కుల సైజులో ఉండే ఎలుకలు అటూఇటూ పరుగులు పెడుతుంటాయి. ప్రయాణికులు పట్టాలపైకి విసిరేసే మిగిలిపోయిన చిరుతిండి, కప్పుల్లో మిగిలిపోయిన టీ, కాఫీ చుక్కల కోసం అవి కలియబడుతుంటాయి. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కో ప్లాట్‌ఫామ్ వద్ద అవి వందల్లో కనిపిస్తాయి. పట్టాలకు అటూఇటూ పెద్దపెద్ద బొరియలు చేసుకుని వాటిల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఆ బొరియలే రైళ్లకు చిక్కులు తెస్తున్నాయి. బొరియల కారణంగా పట్టాల దిగువన నేల గుల్లబారి భూమి దిగబడే పరిస్థితి నెలకొంది. దీనివల్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛ రైల్వే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఎలుకల వల్ల ముప్పు పొంచి ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అందుకు పరిష్కారంగా భారీ కాంక్రీట్ బెడ్లు నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. రైళ్ల గమనాన్ని మార్చి మరీ పనులు చేస్తున్నారు. ఒక్కో ప్లాట్ఫామ్కోసం రూ. 3 కోట్ల ఖర్చు గతంలో పట్టాల కింద స్లీపర్స్... వాటి కింద మామూలు నేలనే ఉండేది. ఒక దశాబ్దం క్రితం నుంచి సిమెంటు పూత వేయటం ప్రారంభించారు. అయితే ఆ సిమెంట్‌పూత ఎలుకల తాకిడికి తట్టుకోలేకపోతోంది. తాజాగా వాటి స్థానంలో భారీ కాంక్రీట్ బెడ్ నిర్మిస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌కు 500 మీటర్ల మేర వీటిని నిర్మిస్తున్నారు. చాలా మందంగా ఈ బెడ్ వేసిన తర్వాత దానిపై ట్రాక్‌ను బిగిస్తున్నారు. ట్రాక్ ప్రాంతాన్ని శుభ్రం చేసిన తర్వాత ఆ నీళ్లు వెళ్లేందుకు ఓ పక్కన ప్రత్యేక డ్రెయిన్ నిర్మిస్తున్నారు. ఈ బెడ్ నిర్మాణానికి మీటరుకు రూ.60 వేల నుంచి రూ.65 వేల వరకు ఖర్చవుతోంది. వెరసి ఒక ప్లాట్‌ఫామ్ వద్ద బెడ్ నిర్మాణానికి దాదాపు రూ.3 కోట్లు ఖర్చవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 34 స్టేషన్లలో 76 ప్లాట్‌ఫామ్స్ వద్ద పనులు పూర్తవుతున్నాయి. పరిశుభ్రతే లక్ష్యం స్వచ్ఛ రైల్వేలో భాగంగా అన్ని స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గతంలో రైల్వే అధికారులను గట్టిగా ఆదేశించారు. దీంతో అధికారులు ఆ పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలుకలు ఎక్కువగా ఉండి, మట్టి తోడి చిందరవందర చేయటంతో పరిశుభ్రత పనులు సాధ్యం కావటం లేదు. నీటితో శుభ్రం చేసినా మళ్లీ ఎలుకలు చిందరవందర చేస్తున్నాయి. కడిగిన నీళ్లు బొరియల్లోకి చేరిపోతున్నాయి. అలా కాకుండా ఆ నీళ్లు సాఫీగా ముందుకు వెళ్లాలంటే డ్రెయిన్లు ఉండాలి. ఇలా అన్నింటికి కలిసి వచ్చేలా ఈ పనులు చేపట్టారు. -
రైల్వేస్టేషన్లో కింగ్‌కోబ్రా కలకలం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కత్తగోడెం రైల్వే స్టేషన్లో ఓ నల్లత్రాచు పాము కలకలం సృష్టించింది. 10 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా(నల్లత్రాచు)ను అటవి అధికారులు పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఉత్తరాఖండ్ ‘కత్తగోడెం రైల్వే స్టేషన్లో రైలు కింది భాగంలో చుట్టలుగా చుట్టుకుని ఉన్న నల్లత్రాచు పామును చూసి ప్రయాణికులంతా బెంబెలేత్తిపోయారు. దీంతో రైల్వే అధికారుల ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పామును పట్టుకుని అడవిలో వదిలి పెట్టిన వీడియోను ధఖ్తే అనే ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 28 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 వేలకు పైగా వ్యూస్ రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పామును పట్టుకున్న ఆటవీ అధికారులను నెటిజన్లంతా అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్లున్నారు. ఇక ‘కత్తగోడెం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు కింది భాగంలో నల్లత్రాచును గుర్తించిన అధికారులు వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు, అటవీ అధికారులు కలిసి ప్రయాణికులను అప్రమత్తం చేసి పామును సునాయాసంగా పట్టుకున్న అటవీ అధికారులు దానిని అడవిలో వదిలిపెట్టారంటూ’ ధఖ్తే తన ఇన్‌స్టా పోస్టులో రాసుకోచ్చారు. -
దక్షిణ మధ్య రైల్వే మరో ఘనత
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే మరో ఘనతను సాధించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల తరలింపు ద్వారా రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించి భారతీయ రైల్వేలో రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఆదాయం పెరుగుదల రేటులో కూడా రెండో స్థానంలో నిలిచింది. మార్చితో ముగిసిన 2018–19 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే 38.30 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి టికెట్లు, లగేజీ చార్జీల రూపంలో రూ. 4,059 కోట్లను ఆర్జించింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 8 శాతం ఎక్కువ కావడం విశేషం. 2017–18లో 37.90 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి రూ.3,749 కోట్లను ఆర్జించింది. వసతులు పెంచాం..: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఎప్పటికప్పుడు వారికి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా పది రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. వీటిల్లో మూడు హమ్ సఫర్ రైళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. 18 రైళ్ల గమ్య స్థానాలను పొడిగించినట్లు, 3 రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచినట్లు, 21 రైళ్లకు అదనపు స్టాపులను సమకూర్చినట్లు వెల్లడించారు. ఏకంగా 2 వేల ప్రత్యేక రైళ్లను నడిపామని చెప్పారు. ఈ ఘనతను సాధించినందుకు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు. -
రైల్వే బీమా వసూల్!
సాక్షి, హైదరాబాద్: రైల్వే శాఖ ఖర్చులు తగ్గించుకుని సంస్థాగత బలోపేతానికి చర్యలు చేపట్టింది. భారంగా పరిణమించిన విషయాల నుంచి మెల్లిగా దూరం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రయాణికుల వద్ద నుంచి అదనపు వసూళ్లకు వెనకాడటం లేదు. ఇందులో భాగం గా 2016లో ‘ఫ్లెక్సీ ఫెయిర్ సిస్టం’ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రయాణికులకు పెద్దగా లాభం లేకపోయినా.. రైల్వేకు మాత్రం బాగానే ఆదాయం సమకూరుతోంది. తాజాగా ఈ–టికెట్ తీసుకునే ప్రయాణికులకు బీమాను ఆప్షన్ గా మార్చింది. అంటే.. ఇకపై ఆన్లైన్లో ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు బీమా కావాలా? వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేసింది. అంటే.. టికెట్ కోసం వివరాలు సమర్పించే సమయంలో ఇన్సూరెన్స్ కూడా ఒక ఆప్షన్‌గా ఇస్తుంది. కావాల్సిన వారికి రూ.1 అదనంగా వసూలు చేస్తారు. (వాస్తవానికి ఇది 92 పైసలుగా ఉంది. పన్నులన్నీ కలుపుకొని రూ.1గా నిర్ణయించారు) ఏంటి లాభం? వాస్తవానికి ఆన్లైన్ విధానంలో టికెట్ బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు 2017 డిసెంబర్ నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఈ విధానం ఈ నెల 2 వరకు కొనసాగింది. దాదాపు 9 నెలల పాటు ప్రయాణికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించింది. ఇటీవల ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తెచ్చింది. స్లీపర్, ఏసీ, చెయిర్ కార్ సీట్ల కోసం టికెట్లు బుక్ చేసే ప్రయాణికులు బీమా కావాలా వద్దా? అన్నది ఇకపై వారిష్టమన్న మాట. ఇందుకోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్ ఫైనాన్స్‌లాంటి సంస్థలతో రైల్వే శాఖ ఒప్పందం చేసుకుంది. బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే.. రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. ప్రైవేటు కంపెనీల లబ్ధికే..ప్రయాణికులు ఈ–టికెట్‌పై బీమాను ఆప్షన్‌గా చేయడంపై ప్రయాణికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రయాణికుడి సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రైవేటు బీమా సంస్థలకు అప్పగించడం సరికాదని అభిప్రాయపడుతున్నా రు. అదనంగా బీమా వసూలు చేయడమేంటని ప్ర శ్నిస్తున్నారు. ప్రభుత్వ కంపెనీలకు కాకుండా ప్రైవే టు కంపెనీలకు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. బీమా అందరికీ ఉంటుంది రైల్వే అధికారులు బీమా విషయంలో సాధారణ టికెట్ ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రయాణికులకు ఏదైనా జరిగితే వారికి నష్ట పరిహారం రైల్వే శాఖ చెల్లిస్తుందని చెబుతున్నారు. ఈ–టికెట్/ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే వారికి ఈ బీమా అదనం అని వెల్లడిస్తున్నారు. ఐఆర్సీటీసీలో నమోదు చేసుకున్న వారి సంఖ్య 3,00,00,000 రోజుకు జరిగే బుకింగ్‌లు 5,00,000 నుంచి 13,00,000 నెలకు వసూలయ్యే బీమా రూ. 1.5కోట్ల నుంచి రూ. 3.9 కోట్లు ఏడాదికి వసూలయ్యే బీమా రూ. 18కోట్ల నుంచి రూ. 48 కోట్లు -
తప్పిన ఘోర రైలు ప్రమాదం
-
విశాఖ గాంధీనగర్ వాసుల్లో గుబులు
-
పేదల పై రైల్వే అధికారుల జులుం
-
బేటా ఉఠో.. బేటా గుర్మిత్..!
‘బేటా ఉఠో.. బేటా గుర్మిత్! జర ఆంఖే ఖోలోకర్ దేఖో.. యా గురునానక్.. జర రహెం కరో.. మేరే బేటేకో బచావో’ అంటూ కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కళ్లముందే రైలు కింద పడి తీవ్రంగా గాయపడిన కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే కన్న పేగు వేదనకు అంతు లేకుండా పోయింది. బిడ్డను ప్రాణాలతో చూడాలనుకుని పరితపించింది. కనిపించని దేవుళ్లను ప్రార్థించింది. ఉఠోరే గుర్మిత్ అంటూ గుండెలవిసేలా రోదించింది. చివరకు తన ఒడిలోనే ప్రాణాలు కోల్పోయిన కుమారుడిని హత్తుకుని బోరున విలపించింది. సాక్షి, అనంతపురం: తల్లిని రైలు ఎక్కించే క్రమంలో తనయుడు కాలుజారి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. కళ్లెదుటే కన్న కొడుకు ప్రాణాలు కోల్పోవడం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వివరాల్లోకెళితే.. పంజాబ్‌లోని ఫసిల్‌కా జిల్లా బలేల్‌కాకమల్ గ్రామానికి చెందిన గుర్మిత్‌సింగ్ (30) కేకే ఎక్స్‌ప్రెస్‌లో తన తల్లి బీబీకి ఆపరేషన్ చేయించేందుకు ఢిల్లీ నుంచి పుట్టపర్తికి బయలుదేరాడు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో కేకే ఎక్స్‌ప్రెస్ అనంతపురం వచ్చింది. దాహంగా ఉండటంతో తల్లీకొడుకులు స్టేషన్లో దిగారు. కాసేపటికే రైలు కదిలింది. దీంతో గుర్మిత్‌సింగ్ అతని తల్లి బీబీ పరుగులు తీశారు. ఈ క్రమంలో తల్లిని రైలెక్కించే క్రమంలో గుర్మిత్‌సింగ్ రైల్వే ట్రాక్, రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. కాలు రైలు కింద పడడంతో తీవ్రంగా దెబ్బతింది. శరీరంపై రైలు ఒత్తిడి ఎక్కువ పడడంతో గుర్మిత్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు రైల్వే ట్రాక్‌కు, రైలుకు మధ్య చిక్కుకుని గుర్మిత్‌సింగ్ మృతి చెందడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కేకే ఎక్స్‌ప్రెస్‌ను పది నిమిషాలపాటు ఆపేశారు. గుర్మిత్‌సింగ్ తల్లి బీబీ తలకు తీవ్రగాయమై బాధపడుతున్నా రైల్వే అధికారులు కానీ, సిబ్బంది కానీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందితే రైల్వే అధికారులు, సిబ్బంది కనీసం తొంగిచూడకపోవడంపై డీవైఎఫ్ఐ నాయకులు బాలకృష్ణ మండిపడ్డారు. మృతుడి తల్లికి తీవ్రగాయమైనా ఆస్పత్రికి తరలించేందుకు కూడా ముందుకు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యులు కూడా అందుబాటులో లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైల్వే బోర్డుపై ఎంపీ రాయపాటి ఆగ్రహం
-
రైల్వే బోర్డుపై ఎంపీ రాయపాటి ఆగ్రహం
విజయవాడ: దక్షిణ మధ్య రైల్వే బోర్డుపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ జరుగుతున్న సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం రాయపాటి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రైల్వేమంత్రి చెప్పినా అధికారులు లెక్కచేడయం లేదని, వారు ప్రధానికన్నా పవర్ఫుల్ అని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న పనులు కూడా అధికారులు చేయడం లేదని, ఇలా అయితే ప్రజలు తమను చెప్పుతో కొడతారని ఆయన అన్నారు. గుంటూరు-తెనాలి డబ్లింగ్ పనులు పదేళ్లు నుంచి సాగుతునే ఉన్నాయని అన్నారు. అలాగే గుంటూరు-చెన్నై డే ట్రయిన్ అడిగానని, దానిపై కూడా స్పందన లేదన్నారు. ఇక విశాఖ రైల్వే జోన్ ...అధికారుల వల్లే రాలేదని విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం బోర్డు అధికారులకు ఇష్టం లేదని అన్నారు. అసలు ముందు రైల్వే జోన్‌ను ప్రకటిస్తే...తర్వాత చిన్నగా విశాఖకు తరలించవచ్చన్నారు. తాను మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినా తాను మాట్లాడతానని రాయపాటి అన్నారు. చంద్రబాబు పదిసార్లు ప్రధానిని కలిసినా రైల్వే జోన్ ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై సీఎంకానీ, పార్టీ నేతలు కానీ ఆలోచించడం లేదని, కొద్దిరోజులు ఆగితే రైల్వేజోన్‌ను కూడా మర్చిపోవడమే అని అన్నారు. ప్రతి ఏటా సమావేశాలు పెట్టి విందు భోజనాలతో సరిపెడుతున్నారన్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల ఆందోళన
విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ఆందోళనకు దిగారు. విజయవాడ నుంచి ధర్మవరం కు కొత్తగా ప్రారంభించిన రైలుకు సాధారణ టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రేజర్వేషన్ లేని వారిని రైల్వే పోలీస్ లు కిందకు దించివేశారు. ఈ రైలులో 5 ఏ.సీ, 8 స్లీపర్ భోగీలు మాత్రమే ఉన్నాయి. సాధారణ భోగీలు లేవని సాకుతో ప్రయాణికులను అనుమతిచలేదు. దాంతో రైల్వే అధికారుల తీరు పై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని నుంచి రాయలసీమ కు రైలు వేశామని గొప్పగా చెప్పిన వారు అందులో సామాన్యులకు ప్రవేశం కల్పించలేదని ఆక్రోశం వెలిబుచ్చారు. కొత్త రైలు ఈ నెల 12 న లాంఛనంగా ప్రారంభమైనా ప్రయాణికులకు మాత్రం శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదటి రోజే ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
డబుల్ డెక్కర్‌కు ఆదరణ కరువు
► కనీసం 10 శాతం కూడా నిండని రైలు ► రూటు, వారాలే కారణమంటున్న ప్రయాణికులు నగరంపాలెం : గుంటూరు రైల్వే డివిజనులో ఖాజీపేట నుంచి గుంటూరు వరకు నడుపుతున్న డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. సికింద్రాబాద్ వైపునకు మరిన్ని రైళ్లు నడపాలని డివిజను ప్రజల విన్నపాలకు ప్రతిఫలంగా రెండేళ్ల కిందట రైల్వే ఉన్నతాధికారులు డివిజనుకు డబుల్ డెక్కర్ బైవీక్లీ రైలును ఏర్పాటు చేశారు. అయితే.. ఇది సికింద్రాబాద్ నుంచి కాకుండా ఖాజీపేట- గుంటూరు- ఖాజీపేటకు మంగళవారం, శుక్రవారాల్లో నడుస్తోంది. పూర్తి ఏయిర్ కండీషన్డ్‌తో 1200 మంది సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ రైలు ప్రారంభించినప్పటి నుంచి పండుగల రద్దీ సమయంలో మినహా మిగతా సమయాల్లో 10 శాతానికి మంచి ప్రయాణీకులు ప్రయాణించడం లేదు. సమస్య ఎక్కడుందంటే.. ఇది వారం మధ్యలోని మంగళ, శుక్రవారాల్లో ఉండటం ఒక సమస్య అయితే.. గుంటూరు నుంచి ఖాజీపేట మాత్రమే వెళ్లటం మరో సమస్యగా మారింది. టిక్కెట్టు ధరలు ఎక్కువగా ఉండటం, ఖాజీపేటకు పిడుగురాళ్ల వైపు నుంచి రైలు ఉండటంతో ప్రయాణికులు ఎక్కువ ధర వెచ్చించి దీనిలో ప్రయాణించలేకపోతున్నారు. దీన్ని గుంటూరు నుంచి విజయవాడ వైపు ఖమ్మం మీదుగా సికింద్రాబాద్‌కు నడిపితే అనుకూలంగా ఉంటుందని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా నడిపే రోజులైనా వారంతం లేదా వారం మొదటి రోజుల్లో (ఆదివారం లేదా సోమవారం) నడిపితే ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వేసవి కావటంతో ప్రజలకు అనువైన రూట్లో డబుల్ డెక్కర్ నడిపితే ప్రయాణీకులకు సౌకర్యవంతగా ఉంటుందని, రైల్వేకూ లాభాదాయకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన బొకారో ఎక్స్‌ప్రెస్
ప్రకాశం: జిల్లాలోని ఉలవపాడు మండలం చాగొల్లు వద్ద బోకారో ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం నిలిచిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే రైలును నిలిపివేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
కేకే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్
అరుకు వెళ్లేందుకు ఇక రోజూ రైలు పర్యాటకుల్లో ఉత్సాహం విశాఖపట్నం సిటీ: కొత్తవలస-కిరండూల్(కేకే) రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తూర్పు కోస్తా రైల్వే అధికారులు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హుద్‌హుద్ ధాటికి ఈ మార్గంలోని బొడ్డవర-గోరాపూర్ స్టేషన్ల మధ్య 45 ప్రాంతాల్లో ట్రాక్‌పై కొండచరియలు, భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. బ్రిడ్జిలు పడిపోయాయి. టైడా-చిమిడిపల్లి మధ్య ఉన్న 24 మీటర్ల పొడవైన బ్రిడ్జి దిమ్మ(పిల్లర్లు కాంక్రీట్‌తో నిర్మించిన దిమ్మ) కొట్టుకుపోయింది. దీంతో సుమారు నెల రోజులపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, ఆర్డీఎస్వో లక్నో అధికారులు, తూర్పుకోస్తా రైల్వే చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్ విపి శ్రీవాస్తవ ఈ బ్రిడ్జి నిర్మాణానికి తీవ్రంగా శ్రమించారు. 120 టన్నుల బ్రేక్ డౌన్ క్రేన్ సాయంతో అహ్మదాబాద్ నుంచి తీసుకొచ్చి 24 మీటర్ల బ్రిడ్జి దిమ్మను నిర్మించారు. ఇలా అనుకున్న సమయానికన్నా రెండు రోజుల ముందుగానే తూర్పు కోస్తా అధికారులు రైలును పట్టాలెక్కించారు. ఈ నెల 9వ తేదీరాత్రి 8.30 గంటల ప్రాంతంలో గూడ్సు రైలును నడిపి ట్రాక్ ఫిట్‌ను పరీక్షించారు. ట్రాక్ ఫిట్ కావడంతో విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే 1వీకే ప్యాసింజర్‌ను మంగళవారం నుంచి రోజూ ఉదయం 6.45 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు జగదల్పూర్ వర కే నడుపుతున్నారు. తిరిగి జగదల్పూర్ నుంచి విశాఖకు బుధవారం నుంచీ రోజూ నడుస్తుందని రైల్వే సీనియర్ డివిజనల్‌కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ సోమవారం రాత్రి విలేకరులకు తెలిపారు. -
ఆహారంలో బొద్దింక.. ఐఆర్సీటీసీకి రూ.లక్ష జరిమానా!
న్యూఢిల్లీ:రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహారంలో నాణ్యత లోపించడంతో ఐఆర్సీటీసీకి(ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) రూ.లక్ష జరిమానా పడింది. ట్రైన్లలో సరఫరా చేస్తున్న ఆహారాన్ని గత వారం పర్యవేక్షించిన అధికారులకు బొద్దింక కనబడటంతో ఈ జరిమానాను విధించారు. కోల్ కతా రాజధాని రైల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆహారంలో బొద్దింక ఉండటాన్ని గుర్తించి అవాక్కయ్యారు. దీంతో ఈ ఆహారాన్నిసరఫరా చేస్తున్న ఐఆర్సీటీసీ రూ.లక్ష జరిమానా విధించారు. జూలై 23 వ తేదీన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన రైల్వే అధికారులు 13 రైళ్లలో సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లోపించినట్లు గుర్తించారు. ఇందుకు గాను ఐఆర్సీటీసీ మరియు తొమ్మిది కేటరింగ్ సెక్షన్లకు రూ.11.50 లక్షల జరిమానాను విధించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
‘గేటు’ పెట్టిస్తాం ఓటేయండి.. ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం కోటి మాటలు చెప్పే నేతలు ఆ తర్వాత ప్రజలను పట్టించుకోరనే విషయం... మాసాయిపేట ప్రమాదం నేపథ్యంలో మరోసారి రుజువైంది. గురువారం ప్రమాదం జరిగిన మాసాయిపేట లెవల్ క్రాసింగ్‌తోపాటు దానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లి, డిల్లాయ్, కూచారం తండాల వ ద్ద కూడా కాపలా లేని క్రాసింగ్‌లు ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. గేట్లు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు రైల్వే అధికారులను కోరినా వారు పట్టించుకోకపోవటంతో విసిగిపోయిన ఆ ప్రాంతాల ప్రజలు... గత సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో కంగారుపడ్డ నేతలు... రైల్వే అధికారులను ఒప్పించి మరీ వెంటనే గేట్లు ఏర్పాటు చేయిస్తామని, ఓట్లేయాలని బతిమాలారు. దీంతో ప్రజలు ఓట్లేశారు. కానీ నేతలు మాత్రం తామిచ్చిన హామీని మరచిపోయారు. -
నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..
* గేటు ఏర్పాటుపై పట్టించుకోని రైల్వే అధికారులు * అప్రమత్తంగా లేని బస్సు డ్రైవర్ సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా ప్రజలు మొత్తుకుంటున్నా రైల్వే శాఖ మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్ద గేటు ఏర్పాటు చేయలేదు.. కాపలాదారులను నియమించలేదు.. గేటు లేదు సరికదా ట్రాక్ కనిపించకుండా ఓ గార్డు రూం కట్టి వదిలేశారు..! కాపలాదారు లేని లెవల్ క్రాసింగ్స్ వద్ద వాహనాల డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ పాఠశాల బస్సు డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తతతో వ్యవహరించలేదు. ...వెరసి ఈ రెండు నిర్లక్ష్యాలు ఏకంగా 16 మంది చిన్నారుల ప్రాణాలను కబళించాయి. గది కట్టారు... గేటు వదిలేశారు.. రైల్వే శాఖ నిర్లక్ష్యానికి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట వద్ద చోటు చేసుకున్న దుర్ఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మాసాయిపేట వద్ద ప్రమాదం జరిగిన ప్రాంతంమీదుగా ఉన్న రైల్వే లైన్‌ను సరిగ్గా 14 ఏళ్లక్రితం బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. దీంతో ఇటువైపు రైళ్ల రాకపోకలు పెరిగాయి. మీటర్‌గేజ్‌గా ఉన్నప్పుడే లెవల్‌క్రాసింగ్ వద్ద గేటుకోసం గట్టిగా డిమాండ్ చేసిన ప్రజలు బ్రాడ్‌గేజ్‌గా మారాక మరింత గా పోరాటం చేశారు. అయినా రైల్వేశాఖ పట్టించుకోలేదు. నిధులు లేవంటూ గేటు ఏర్పాటు చేయలేదు. చివరకు స్థానికుల ఆందోళన తీవ్రతరమవడంతో మూడేళ్లక్రితం గేటును మంజూరు చేసి కాపలా సిబ్బందికోసం విశాలమైన గది నిర్మించారు. రెండే ళ్లక్రితం గేటు అమర్చి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీంతో సమస్య పరిష్కారమైందని ప్రజలు సంతోషించారు. కానీ మరుసటిరోజే ఆ గేటును తొలగించి తీసుకెళ్లిపోయారు. మధ్యలో రెండుసార్లు ఆ గదికి మరమ్మతులు చేసి రంగులేసిన రైల్వే అధికారులు ఇప్పటివరకు గేటును పెట్టలేదు. విచిత్రమేంటంటే ఆ గది పేరుతో ఇప్పటివరకు దాదాపు రూ.25 లక్షలు ఖర్చు చేశారు. నిజానికి సాధారణ గేటు ఏర్పాటుకయ్యే వ్యయమే రూ.20 లక్షలు. కాగా ఇక్కడ గేటు ఏర్పాటు చేసి గేట్‌మెన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సాక్షి గతంలో పలు సందర్భాల్లో సూచించింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. రైలు కనపడకుండా అడ్డుగా మారిన గది.. గేటు లేకుండా దిష్టిబొమ్మలా మిగిలిన ఆ గది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ట్రాక్ దాటేందుకొచ్చే వాహనదారులు దగ్గరికొచ్చాక.. రైలు ఇంజిన్ సరిగ్గా ఎంతదూరంలో ఉందో కనిపించకుండా ఆ గది అడ్డుగా మారింది. ఇంజిన్ కాస్త దూరంగానే ఉండిఉంటుందన్న భావనతో కొందరు వాహనదారులు వేగంగా వాహనాన్ని పట్టాలెక్కించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ గది కట్టకముందు అడపాదడపా జరిగే ప్రమాదాలు.. ఆ తర్వాత తరచూ జరుగుతున్నాయి. గది నిర్మాణం తర్వాత దాదాపు 25కుపైగా ప్రమాదాలు జరిగాయన్నది స్థానికుల కథనం. అందులో ఈ స్కూలు బస్సు దుర్ఘటన అతిపెద్దది. ఒకవేళ గేటు ఏర్పాటు చేయటంలో మరింత జాప్యం జరిగేపక్షంలో వెంటనే ఆ గదిని కూల్చేయాలని వారు అధికారులను కోరుతుండటం గమనార్హం. రెగ్యులర్ డ్రైవర్ రాకపోవడంతో... పిల్లల పాలిట మృత్యుశకటంగా మారిన పాఠశాల బస్సు(ఎ.పి.23ఎక్స్ 5349)ను కేవలం స్కూలుబస్సుగా వాడతామంటూ పాఠశాల యాజమాన్యం 2012లో దాని రిజిస్ట్రేషన్ సమయంలో రవాణా అధికారులకు తెలిపింది. ఈ బస్సుకు రెగ్యులర్ డ్రైవర్‌గా కె.ఎల్లం(40) వ్యవహరిస్తున్నాడు. అయితే బుధవారం ఉదయం అతను రాకపోవటంతో భిక్షపతి అనే మరో డ్రైవర్‌ను యాజమాన్యం పిలిపించింది. ఇతనికి ఆ మార్గం కొత్త. సాధారణంగా ఆ బస్సు రైల్వేట్రాక్‌కు ఈవల ఉన్న వెంకటాయపల్లి, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, దాతరపల్లి, కిష్టాయపల్లి గ్రామాల విద్యార్థులను ఎక్కించుకుని ట్రాక్ ఆవల ఉన్న మాసాయిపేట వెళ్లి మరికొందర్ని ఎక్కించుకుని తూప్రాన్‌కు వెళుతుంది. ఈ క్రమంలో శ్రీనివాసనగర్ స్టేషన్ వైపున్న గేటు ఉండే లెవల్‌క్రాసింగ్ గుండా మాసాయిపేటకు వెళ్లి తిరుగుప్రయాణంలో ఈ గేటులేని క్రాసింగ్ ద్వారా వస్తుంది. అయితే కొత్త డ్రైవర్ భిక్షపతికి అవగాహనలేక గేటు లేని క్రాసింగ్ గుండా వెళ్లే ప్రయత్నం చేశాడు. శ్రీనివాసనగర్ స్టేషన్నుంచి వస్తున్న రైలును గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. ఆ సమయంలో అతను సెల్‌ఫోన్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుండటంతో రైలు కూతను వినలేదన్నది స్థానికుల కథనం. ప్రమాదాన్ని నిమిషం ముందే విద్యార్థులు గమనించి, పెద్దగా అరుస్తూ హెచ్చరించినప్పటికీ డ్రైవర్ జాగ్రత్త పడలేదని ప్రత్యక్ష సాక్షి మురళీకృష్ణ ‘సాక్షి’ వివరించారు. కాగా బస్సు ట్రాక్‌కు దగ్గరగా రావడం గమనించిన రైలు లోకోపైలట్ సత్యనారాయణ వెంటనే బ్రేక్ వేశాడు. అది అక్కడ్నుంచీ సరిగ్గా 534 మీటర్ల దూరం వెళ్లి నిలిచింది. ఈలోపే బస్సును ఢీకొనటం, దాన్ని ఈడ్చుకుంటూ దాదాపు 35 మీటర్ల దూరం వరకు వెళ్లటం రెప్పపాటులో జరిగిపోయాయి. రైళ్లకు సడన్‌బ్రేకు వేయటం సాధ్యం కాదు. అలా వేస్తే బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలు తప్పి భారీ ప్రమాదానికి కారణమవుతుంది. రైల్వే వ్యవస్థలో సడన్ బ్రేక్ అంటే... బ్రేకు వేసిన 600 మీటర్ల దూరంలో రైలు నిలిచిపోయేలా చేయటం. ఇక్కడా ఆ ‘సడన్ బ్రేకే’ వేశారు. పాడు రైలు... టైమ్కొచ్చినా బాగుండు! మృత్యువు దరిచేరేవేళ అన్ని కారణాలను మోసుకొస్తుందంటారు. మాసాయిపేట రైల్వే లెవల్‌క్రాసింగ్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఇదే కనిపిస్తుంది. స్కూలు బస్సును ఢీకొన్న నాందేడ్-కాచిగూడ ప్యాసింజర్ రైలు వాస్తవానికి ఉదయం నాలుగున్నరకే ఆ ప్రాంతంమీదుగా వెళ్లాల్సి ఉంది. కానీ దాని జత రైలు రావటంలో జాప్యం ఫలితంగా ఈ రైలు మంగళవారం రాత్రి నాందేడ్‌లో రాత్రి 11.30కు బదులుగా తెల్లవారుజాము 3.30కి బయల్దేరింది. ఫలితంగా.. సరిగ్గా స్కూలు బస్సు పట్టాలెక్కిన సమయానికి మృత్యురూపంలో దూసుకొచ్చింది. తండావాసులు డబ్బులు పోగుచేసి కడితే.. తీసుకుని చేతులెత్తేసిన రైల్వేశాఖ! సాక్షి, హైదరాబాద్: నిధులు లేకనే లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్లు పెట్టలేకపోతున్నామని, రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)లు నిర్మించలేకపోతున్నామని రైల్వే శాఖ చెబుతోంది. మరి స్థానికులు డబ్బులు పోగుచేసి రైల్వే అధికారుల చేతిలో పెట్టిన తర్వాత కూడా పనిచేయకపోతే దాన్నేమనాలి? మాసాయిపేట లెవల్ క్రాసింగ్ దాటి మేడ్చల్ వైపు ముందుకెళ్తే వచ్చే చిన్న తండా కూచారం. ఆ తండా ప్రజలు రోడ్డువైపు రావాలంటే ట్రాక్ దాటాల్సిందే. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని ఆ తండావాసులు ఎన్నోమార్లు ఆందోళనలు చేశారు. అయితే అక్కడ ఆర్యూబీ నిర్మాణానికి రూ.1.30 కోట్లు అవసరమవుతాయని, నిధులు లేకనే నిర్మించలేకపోతున్నామని అధికారులు చెప్పారు. దీంతో తండావాసులు ఇంటికి కొంతచొప్పున చందాలు పోగుచేసి రూ.80 వేలు సమకూర్చుకుని చెక్కురూపంలో రైల్వే అధికారులకు అందజేశారు. అంతే.. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఆర్యూబీ కట్టనేలేదు. దాంతోపాటు తండావాసులిచ్చిన ఆ నిధుల జాడా లేకుండా పోయింది..! ఆటోలో వెళ్లిన అన్న.. బస్సులో చితికిన తమ్ముడు ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వీరేశం, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు భగవాన్ పదో తరగతి, చిన్న బాబు విష్ణువర్థన్ 7వ తరగతి చదువుతున్నాడు. భగవాన్‌కు ప్రత్యేక తరగతులు ఉండడంతో ఆటోలో స్కూల్‌కు వెళ్లాడు. బస్సులో వెళ్లిన భగవాన్ తమ్ముడు విష్ణు మాత్రం మృత్యు శకటానికి బలయ్యాడు. -
దోపిడీ దొంగల హల్చల్
నెల్లూరు(నవాబుపేట)/ బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు నడుపుతున్న ప్రత్యేక రైళ్లు కూడా నిండిపోతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు దుండగులు దోపిడీలకు తెగబడుతున్నారు. ఎక్స్‌ప్రెస్, స్పెషల్ రైళ్ల ప్రయాణికులను టార్గెట్ చేసుకుని విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా అర్ధరాత్రి తర్వాత, వేకువ జామున బోగీల్లోకి ప్రవేశించి హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కొడవలూరు మండలం తలమంచి సమీపంలో స్వైర విహారం చేస్తున్న దొంగలను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో రైలు ప్రయాణికులు భయం తో హడలిపోతున్నారు. వరుస ఘటనలు నెల్లూరు-ఒంగోలు మధ్య జరుగుతున్న వ రుస ఘటనలతో రైలు ప్రయాణికులు హడలిపోతున్నారు. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ సమీపంలో ఉన్న జువ్వలగుం ట చెరువు ప్రాంతంలో ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ రై ళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఇది తెలుసుకున్న దొంగల ముఠాలు సోమవారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో తిష్టవేశాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన హౌరా- చెన్నై మెయిల్, భువనేశ్వర్-యశ్వంత్‌పూర్ వీక్లీ, చెన్నై-న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రె స్, కాకినాడ-బెంగళూరు శేషాద్రి ఎక్స్‌ప్రెస్ లో ఎక్కి దోపిడీకి యత్నించారు. అయితే ప్రయాణికులు తీవ్రంగా ప్రతిఘటించడం తో చేతికి చిక్కిన సుమారు 15 గ్రాముల ఆ భరణాలతో ఉడాయించారు. అదే సమయంలో రామేశ్వరం-భువనేశ్వర్ ఎక్రరపెస్ను కొడవలూరు మండలం తలమంచి వద్ద చైన్ లాగి ఆపారు. రైలు నెమ్మదిగా ఆ గుతున్న సమయంలో ఎస్-11,ఎస్-4 బో గీల్లో మహిళలపై దాడి చేశారు. వారి మెడల్లోని 55 గ్రాముల నగలను దోచుకున్నారు. కిటికీ పక్కనే కూర్చున్న విశాఖపట్టణానికి చెందిన రవి మెడలోని 15 గ్రాముల చైన్‌ను లాక్కెళ్లారు. ఇంతలో మిగిలిన ప్రయాణికు లు కేకలు పెట్టడంతో దుండగులు ఉడాయించారు. మంగళవారం సరిగ్గా అదే సమయంలో తలమంచి వద్ద గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను చైన్ లాగి ఆపారు. కిటికీ పక్కన నిద్రపోతున్న వారి మెడల్లో ఆభరణాలను లా గేందుకు ప్రయత్నించగా ప్రయాణికులు కే కలు వేయడంతో రైల్వే ఎస్సై సుభాన్ అప్రమత్తమై గాలిలోకి కాల్పులు జరిపారు. త ప్పించుకున్న దొంగలు గొల్లపాళెం వైపు పా రిపోయారు. అటవీ ప్రాంతం కావడంతో రైల్వే పోలీసులు వెంబడించలేకపోయారు. 15 రోజులుగా తలమంచి రైల్వే స్టేషన్లో సంచారం గుర్తుతెలియని వ్యక్తులు కొందరు 15 రో జులుగా తలమంచి రైల్వేస్టేషన్లో సంచరి స్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ట్రా క్‌పై నడిచి వెళ్లడం, తూములపై కూర్చుని మంతనాలు చేస్తున్నారని తెలిపారు. కొందరు తమిళంలో, మరికొందరు హిందీలో మాట్లాడుతున్నారని తెలియజేయడంతో దొంగలు బీహార్ ముఠా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే 15 రోజులుగా ట్రాక్ పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తుంటే తలమంచి స్టేషన్‌మాస్టర్, ఇతర సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రైల్వే ప్రయాణికుల భద్రతపై ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
గులక గుటకాయ స్వాహా!
పెనుకొండ, న్యూస్‌లైన్ : అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. కంకర రవాణాలో అక్రమాలకు పాల్పడుతూ లక్షల్లో స్వాహా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రైల్వే శాఖలో పీడబ్ల్యూ విభాగం అత్యంత కీలకమైనది. దీని నేతృత్వంలో చాలా పనులు జరుగుతుంటాయి. పనులను పర్యవేక్షించడం ఈ విభాగంలోని సిబ్బంది బాధ్యత. అయితే బాధ్యతల్ని విస్మరించిన కొందరు సిబ్బంది అక్రమాలకు తెరలేపారు. రైల్వేలో దెబ్బతిన్న, బలహీనంగా ఉన్న లైన్లకు, కొత్త లైన్లకు కంకర తోలడానికి సంబంధించి రెండేళ్ల క్రితం సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు టెండర్లు పిలువగా.. పెనుకొండకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. మొదటి విడతగా 33 వేల క్యూబిక్ మీటర్లు, రెండో విడతగా 50 వేల క్యూబిక్ మీటర్ల కంకర సరఫరా చేయడానికి టెండర్లు పిలిచారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కంకర సరఫరా చేయడం ప్రారంభించారు. ఇందుకోసం కాంట్రాక్టర్‌కు క్యూబిక్ మీటర్‌కు రూ.800 రైల్వే శాఖ చెల్లిస్తుంది. అన్ని పన్నులు పోను కాంట్రాక్టర్‌కు రూ.650 మేరకు దక్కుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట గౌరిబిదనూరు వద్ద కంకర డంప్ చేయాలని రైల్వే అధికారులు భావించినా కాలుష్యం సమస్యగా మారుతుందని పెనుకొండ సమీపంలోని మక్కాజిపల్లి కేంద్రంగా డంపింగ్ ప్రారంభించారు. ఇక్కడ నిల్వ ఉంచిన కంకరను మండీలుగా విభజించి దానికి కొలతలు తీసిన తర్వాత అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. ఇలా కొలతలు తీసిన కంకరను రైలు వ్యాగిన్లలో నిర్ధేశిత ప్రాంతాలకు తరలించి ట్రాక్ పక్కన వదలాలి. ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్లు కమ్మక్కయ్యి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొలతలు వేసిన కంకరను రైలు పెట్టెల్లోకి నింపే ముందు ఒకరిద్దరు కాంట్రాక్టర్లు తమ సహాయకుల ద్వారా టిప్పర్లలో కంకరను పక్కకు తరలిస్తున్నారు. పక్కకు తరలించిన కంకరను తిరిగి కొత్త కంకరగా చూపుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం రైల్వే శాఖలోని కొందరు అధికారులకు తెలిసినా.. ఉన్నతాధికారులకు అక్రమాల్లో వాటాలు ఉండడంతో మిన్నకుండిపోతున్నట్లు తెలిసింది. శుక్రవారం మక్కాజిపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలో కొలతలు తీసిన కంకరను టిప్పర్ల ద్వారా బయటకు మళ్లించారని తెలియడంతో ‘న్యూస్‌లైన్’ అక్కడికెళ్లి పరిశీలించింది. పాత వేరుశనగ మిల్లు వద్ద పెద్ద ఎత్తున కంకర నిల్వలు కన్పించాయి. మండీలుగా ఉన్న ప్రాంతానికి అతి సమీపంలోనే ఈ కంకర నిల్వలు ఉంచడం పలు సందేహాలకు తావిస్తోంది. కంకర తరలింపు సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కంకర పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. నిఘా ఉంటుంది కాంట్రాక్టర్లు ఒక సారి కంకర తోలి కొలతలు తీసిన తర్వాత దాన్ని కావాల్సిన ప్రాంతానికి తరలించే వరకు నిఘా వుంటుంది. బెంగళూరు, హిందూపురం రైల్వే అధికారులు తరచూ పరిశీలన జరుపుతారు. మేం నిల్వ చేసిన కంకర ఎంత? తరలించిన కంకర ఎంత? నిల్వ వున్న కంకర ఎంత? అన్న లెక్కలు ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఎప్పటికపుడు పరిశీలిస్తారు. కంకరను బోగీల ద్వారా తరలించే సమయంలో మా సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. - సుందరయ్య, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, పెనుకొండ ఆ కంకర మాదే మక్కాజిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పాత వేరుశెనగ మిల్లు వద్ద నిల్వ వుంచిన కంకర మాదే. అధికారులు రైల్వేస్టేషన్ సమీపంలో నిర్ధేశించిన ప్రాంతంలో కంకర నిల్వ వుంచడానికి స్థలం లేదని చెప్పడంతో పాత మిల్లు వద్ద నిల్వ ఉంచాం. కర్ణాటక ప్రాంతం నుంచి తీసుకువచ్చిన కంకర అత్యవసరంగా దించాల్సి రావడంతో అక్కడే అన్లోడ్ చేశాం. - సవితమ్మ, కాంట్రాక్టర్, పెనుకొండ -
మరో రైలు బుగ్గి
సాక్షి, ముంబై: పది రోజుల వ్యవధిలో మళ్లీ అదే ఘోరం. రైల్వే భద్రత గాల్లో దీపం చందమన్నట్లుగా మంటల్లో మరో రైలు కాలిపోయింది. 9 మంది ప్రయాణికులను బుగ్గి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 28న బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి 26 మంది సజీవదహనమైన దుర్ఘటన మరవకముందే మరోసారి అదే తరహా ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న డహాన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి సుమారు 2.50 గంటలకు బాంద్రా నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 9 మంది ప్రయాణికులు సజీవదహనమవగా మరో ఐదుగురు గాయపడ్డారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాలు... రైలు ముంబైకి సుమారు 140 కి.మీ. దూరంలో ఉన్న థానే జిల్లా డ హాన్ తాలూకా వద్దకు చేరుకోగానే ఎస్-2, ఎస్-3 బోగీల మధ్య వెస్టిబ్యూల్ (లింకు)లో మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఆపై ఎస్-4 బోగీకి వ్యాపించాయి. ఆ సమయంలో ఎస్-4లో 64 మంది ప్రయాణికులు ఉండగా ఎస్-2లో 54 మంది, ఎస్-3లో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. బోగీలకు మంటలు అంటుకోవడాన్ని గుర్తించిన కొందరు ప్రయాణికులు బిగ్గరగా అరచి అందరినీ అప్రమత్తం చేసేందుకు యత్నించగా మరికొందరు చైన్ లాగి రైలును ఆపేందుకు ప్రయత్నించారు. చాలా మంది వెనక తలుపులు తెరుచుకొని ప్రాణాలు దక్కించుకోగా తొమ్మిది మంది దట్టమైన పొగల నుంచి బయటపడలేక సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒక మహిళ, నలుగురు పురుషులు ఉన్నట్లు అధికారులు ఇప్పటివరకూ గుర్తించినట్లు పశ్చిమ రైల్వే పీఆర్వో శరత్ చంద్ర తెలిపారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉందన్నారు. ఎస్-3 బోగీ అడుగున కాలిన వైర్లు కనిపించడంతో ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చన్నారు. గేట్‌మన్ సమయస్ఫూర్తి... రైల్వే గేట్‌మన్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం భారీగా తగ్గింది. రైలుకు మంటలు అంటుకోవడాన్ని డహాన్ రోడ్-ఘోల్వాడ్ లెవల్ క్రాసింగ్ వద్ద గమనించిన గేట్‌మన్ వెంటనే రైలుకు రెడ్ సిగ్నల్ ఇచ్చి రైలును నిలిపేందుకు యత్నించాడు. అయితే రైలు అప్పటికే ముందుకు వెళ్లిపోవడంతో ఘోల్వాడ్ రైల్వేస్టేషన్ మాస్టర్‌కు ఈ విషయాన్ని తెలియజేశాడు. స్టేషన్ మాస్టర్ రైలు డ్రైవర్‌కు విషయం చెప్పడంతో ఘోల్వాడ్ స్టేషన్ సమీపంలో రైలును ఆపాడు. అనంతరం మంటలను ఆర్పేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశం: ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రైల్వే మంత్రి మలికార్జున ఖర్గే...మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఘటనాస్థలిని సందర్శించారని వివరించారు. కాగా, ఢిల్లీ నుంచి లక్నో వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్రేకు జామ్ కారణంగా ఓ బోగీ చక్రాల నుంచి పొగలు వ్యాపించాయి. ఆస్ట్రేలియా పరిజ్ఞానంతో ఫైర్ అలారం రైళ్లలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా పరిజ్ఞానంతో ఫైర్ అలారం వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు. భువనేశ్వర్-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో గతంలో ఉపయోగించిన అలారం వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దీన్ని జమ్మూ-రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో మరో 20 రైళ్లలో ఈ ఫైర్ అలారం వ్యవస్థను అమరుస్తామన్నారు. -
నత్త నడకే
మోర్తాడ్, న్యూస్‌లైన్: నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణ పను లు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గత మార్చిలోగానే మోర్తాడ్ నుంచి జగిత్యాల వరకు ప్యాసింజర్ రైలును నడపాల్సి ఉంది. ఏడా ది సమీపిస్తున్నా దానికి అతీగతీ లేకుండా పోయింది. భూసేకరణలో అంతరాయం, కాంట్రాక్టర్ల అలసత్వం తో నిజామాబాద్ నుంచి మోర్తాడ్ వరకు పనులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ‘ప్యాసింజర్’ వస్తుందన్నారు మోర్తాడ్ నుంచి జగిత్యాల మీదుగా పెద్దపల్లి, చెన్నూర్ వరకు ప్యాసింజర్ రైలు నడుపుతామని రైల్వే శాఖ ఉ న్నతాధికారులు గతంలో ప్రకటించారు. తొలుత జగి త్యాల, మోర్తాడ్ మధ్య రైలును నడుపుతామని, ఇది సక్సెస్ అయితే వారం రోజులలో చెన్నూర్ వరకు పొడి గిస్తామని అప్పుడు అధికారులు పేర్కొన్నారు. ఇది అమలులోకి రావాలంటే ముందుగా మోర్తాడ్ వరకు రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలి. కానీ, కరీంనగర్ జిల్లా మెట్పల్లి వరకే పనులు జరిగాయి. మెట్పల్లి, మోర్తాడ్ మధ్య పనులలో తీవ్ర జాప్యం జరిగింది. మోర్తాడ్ వద్ద జరుగుతున్న ‘చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల ఆలస్యం కూడా దీనిపై ప్రభావం చూపింది. ఈ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. రైల్వే లైన్ వెంట వర్షపు నీరు వెళ్లిపోవడానికి కాలువలు నిర్మించాల్సి ఉంది. మోర్తాడ్‌కు వెళ్లే దారిలో వంతెన నిర్మాణం పూర్తికాగా, ఇక్క డ పట్టాలు వేసి కంకర పోయాల్సి ఉంది. రైల్వే స్టేషన్ పరిసరాలలో కూడా లైన్ పనులు పూర్తి కావాలి. అంతులేని నిర్లక్ష్యం పనులను సజావుగా సాగించడంలో మొదటి నుంచి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేసినా పనులు మాత్రం చురుకుగా ముందుకు సాగడం లేదు. ఆలస్యానికి నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం జరిమానా వసూలు చేస్తున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మోర్తాడ్ రైల్వే స్టేషన్ నుంచి నిజామాబాద్ రూటులో పెద్దవాగు వద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ పనులు గత ఏడాది మొదలైనా ఇప్పటివరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. వంతెనపై ఏర్పాటు చేయాల్సిన ప్లేట్లు సిద్ధమైనా, పిల్లర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో అవి వృథాగా ఉండిపోయాయి. ప్రజాప్రతినిధులేరీ? రైల్వే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చాటేయడం, అధికారులు కాంట్రాక్టర్ల చెప్పు చేతలలో ఉండటంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ రైల్వే లైన్ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. -
అస్వస్థతకు గురై...
కడప అర్బన్, న్యూస్‌లైన్ : చెన్నై నుంచి ముంబైకి వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-7 బోగీలో ప్రయాణిస్తున్న ఎంఎస్ వీణా (32) తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకు చెందిన వీణా తన తండ్రి శేషాద్రి , సోదరుడు బాలాజీతో కలిసి మంగళవారం ఉదయం చెన్నై నుంచి ముంబైకు వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదే రారు. వీరు మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. రే ణిగుంటలో మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో పాటు వీణా ఆహారం తీసుకుంది. నందలూరుకు వచ్చే సమయానికి ఊపిరాడక, వాంతులకు గురై అస్వస్థత అయింది. కడపలోని రైల్వే అధికారులకు సమాచారం రాగా కడపలో 3వ నంబరు ప్లాట్‌ఫారంకు రైలు వచ్చి నిలబడగానే ఎస్-7 బోగీ వద్దకు రైల్వే అధికారులు చేరుకున్నారు. బాధితురాలికి వైద్య సహాయం అందించేందుకు స్ట్రెచర్‌పై బయటకు తీసుకు వచ్చారు. రైల్వే డాక్టర్, 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో రెండు నెలల్లో వీణాకు వివాహం కావాల్సి ఉందని, ఉన్నట్లుండి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మృతురాలి బంధువులు బోరున విలపించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ పీవీ రమణ, సిబ్బంది, ఆర్పీఎఫ్ పోలీసులు, అధికారులు బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. మృతురాలి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు స్టేట్మెంట్ రికార్డు చేసి మృతదేహాన్ని వారికి అప్పగించారు.