
సాక్షి, అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంతకల్ రైల్వే డివిజన్లలో రైళ్ల వేగం పెరగనుంది. సోమవారం నుంచి గరిష్టంగా గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ మేరకు రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంపొందించారు. విజయవాడ డివిజన్‌లోని కొండపల్లి– గూడూరు, గుంతకల్ డివిజన్‌లోని రేణిగుంట–గుంతకల్ సెక్షన్లలో రైళ్ల రద్దీ అధికంగా ఉంది. దీంతో రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచాలని 2020లో నిర్ణయించారు.
ఇందుకు లక్నోలోని ఆర్‌డీఎస్‌వో అనుమతి ఇచ్చిన తర్వాత 2020 నుంచే రైల్వే అధికారులు దశలవారీగా రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో ఇప్పటివరకు గంటకు 110 కి.మీ. వేగంతో ప్రయాణించిన రైళ్లు సోమవారం నుంచి గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణించనున్నాయి. ఇక నుంచి రైళ్ల ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ప్రయాణికులకు సుఖ ప్రయాణం సాధ్యపడుతుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.