Guntakal railway division
-
ఇక గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణం!
సాక్షి, అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంతకల్ రైల్వే డివిజన్లలో రైళ్ల వేగం పెరగనుంది. సోమవారం నుంచి గరిష్టంగా గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ మేరకు రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంపొందించారు. విజయవాడ డివిజన్లోని కొండపల్లి– గూడూరు, గుంతకల్ డివిజన్లోని రేణిగుంట–గుంతకల్ సెక్షన్లలో రైళ్ల రద్దీ అధికంగా ఉంది. దీంతో రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచాలని 2020లో నిర్ణయించారు. ఇందుకు లక్నోలోని ఆర్డీఎస్వో అనుమతి ఇచ్చిన తర్వాత 2020 నుంచే రైల్వే అధికారులు దశలవారీగా రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో ఇప్పటివరకు గంటకు 110 కి.మీ. వేగంతో ప్రయాణించిన రైళ్లు సోమవారం నుంచి గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణించనున్నాయి. ఇక నుంచి రైళ్ల ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ప్రయాణికులకు సుఖ ప్రయాణం సాధ్యపడుతుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అభివృద్ధి పట్టాలెక్కేనా?
గుంతకల్లు : రైల్వే బడ్జెట్ వస్తోందంటే ప్రజల్లో ఆశలు చిగురిస్తాయి. తమ ప్రాంతానికేవైనా కొత్త ప్రాజెక్టులు, కొత్త రైళ్లు వస్తాయనే ఆశతో జనం ఎదురు చూడటం పరిపాటి. గుంతకల్లు రైల్వే డివిజన్‌కు 20 ఏళ్లుగా గ్రహణం పట్టుకుంది. ఏ రైల్వే మంత్రి వచ్చినా గుంతకల్లు రైల్వే డివిజన్‌కు ఒరగబెట్టింది శూన్యమే. రాయలసీమ వాసి అయిన కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాషరెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఒక్క రైలు మినహా సాధించింది శూన్యం. రైల్వే బడ్టెట్‌ను ఈనెల 26న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మన జిల్లా ఎంపీలు ఘనంగానే ప్రతిపాదనలు పంపారు. కొత్త రైళ్లతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి నిధులు సాధిస్తామని ఢిల్లీకి బయలుదేరారు. ఎంపీలు పంపిన ప్రతిపాదనలు ఇవే.. పుట్టపుర్తి నుంచి షిర్డీకి కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరు చేయాలి చెన్నై నుంచి హైదరాబాద్ మధ్య పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైలు గుంతకల్లు- హైదరాబాద్ మధ్య పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి కర్నూలు టౌన్ మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలును డోన్, పెండేకల్లు మీదుగా గుంతకల్లు వరకు పొడగించాలి. అనంతపురం మీదుగా రాజస్థాన్ వైపు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేషన్లో ఆగడం లేదు. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతకల్లులో వంద విద్యుత్ లోకో ఇంజన్ల సామర్ధ్యం గల షెడ్డును ఏర్పాటు చేసేందుకు 2008 సంవత్సరంలో అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా నిధుల లేమితో ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. రూ. 140 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గంలో విద్యుత్ రైళ్లు పూర్తి స్థాయిలో నడుస్తాయి. దీనిని 2012 మార్చి31కి పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు 2008లో రూ. కోటి, 2009లో రూ.2.48 లక్షలు, 2010లో రూ. 79.30 కోట్లు, 2011లో కోటి, 2012లో రూ. 3.33 కోట్లు, 2013లో రూ. 8 కోట్లు, 2014లో రూ.3 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇప్పటివరకు రూ. 6 కోట్లు రూపాయలు విలువైన పని మాత్రమే చేయగలిగారు. పామిడి మండలం కల్లూరు వద్ద పెన్నా నదిపై బ్రిడ్జిని నిర్మించాలని 2009లో రైల్వేబోర్డుకు నివేదించారు. రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఆచరణ రూపం దాల్చలేదు.. అరకొర నిధుల కేటాయింపుతో సా..గుతున్న రైలు మార్గాలు గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని నంద్యాల-ఎర్రగుంట్ల స్టేషన్ల మధ్య 126 కి.మీల నూతన రైలు మార్గపు పనులకు 1996-97 రైల్వే బడ్జెట్లో రూ.883 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రూ.751 కోట్లు ఖర్చు చేయగా 30 కి.మీల రైలు మార్గపు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనికి నిధులు విడుదల చేయాల్సి ఉంది. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని మునీరాబాద్- మహబూబ్‌నగర్‌ల మధ్య 246 కి.మీల నూతన రైలు మార్గ నిర్మాణానికి రూ.1290 కోట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు రూ.339.79 కోట్లు ఖర్చు చేశారు. 55 కి.మీల రైలు మార్గం పెండింగ్‌లో ఉన్నందున నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. కడప-బెంగుళూరు రైలు మార్గంలో 255.4 కి.మీల నిర్మాణానికి రూ. 2050 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. సర్వేలు, భూ సేకరణ రూపంలో రూ.199.79 కోట్లు ఖర్చు చేశారు. కానీ పనులు ప్రారంభించలేదు. ఓబుళవారిపల్లి-కృష్ణపట్నం మధ్య 113 కి.మీల రైలు మార్గానికి రూ.930 కోట్లు అంచనాలు రూపొందించగా ఒక్క పైసా నిధులు విడుదల కాలేదు. ఈ మార్గపు నిధులను మరొక పనికి మళ్లించినట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రాలయం-కర్నూలు మధ్య 99 కిలో మీటర్ల రైలు మార్గానికి రూ. 200 కోట్లతో అంచనాలు తయారు చేశారు. 2012 రైల్వే బడ్జెట్లో కేవలం రూ.2 కోట్లు విడుదల చేసి సర్వేలు కానిచ్చారు. తరువాతి బడ్జెట్లో నిధుల కేటాయింపు మరవడంతో పనులు అటకెక్కాయి. పొద్దుటూరు-కంభం మధ్య 142 కి.మీల రైలు మార్గం నిర్మాణానికి రూ. 280.8 కోట్లుతో అంచనాలు తయారు చేసి పంపగా కేవలం రూ.10 లక్షలు మాత్రమే రైల్వేబోర్డు మంజూరు చేసింది. నంచర్ల-మద్దికెర మధ్య 9 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన 7 కి.మీల బైపాస్ రైలు మార్గం పూర్తయితే హైదరాబాద్ నుంచి కర్నూలు, డోన్, పెండేకల్లు మీదుగా ముంబై వెళ్లే ప్రయాణీకులకు అనుసంధానం ఏర్పడుతుంది. తద్వారా రైళ్ల సమయపాలన కూడా ఆదా అవుతుంది. రాయలసీమలో వెనుకబడిన అనంతపురం, కర్నూలు జిల్లాలను దృష్టిలో ఉంచుకొని నాటి రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాషరెడ్డి కర్నూలులో రైలు బోగీల మరమ్మతు కర్మగారాన్ని రూ.110 కోట్లతో మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి. -
హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి యత్నం
* రైల్లోనే ప్రయాణించిన ముగ్గురు దుండగులు * రైలు ఆపిన చోట వేచి ఉన్న మరో 20 మంది * చైన్ లాగి దోపిడీకి యత్నం, కేకలు వేసిన ప్రయాణికులు * గాలిలోకి కాల్పులు జరిపిన జీఆర్పీ పోలీసులు గుంతకల్లు, న్యూస్‌లైన్: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని కల్లూరు-గార్లదిన్నె మార్గం మధ్యలో శనివారం తెల్లవారుజామున హంపి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. రైల్వే ఎస్పీ ఎస్.జె. జనార్దన్ కథనం మేరకు.. హుబ్లీ నుంచి బెంగళూరు వెళ్లే హంపి ఎక్స్‌ప్రెస్ (నం-16591)లో పక్కా ప్రణాళికతో దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులు ఎస్-2 కోచ్‌లో, మరో ముగ్గురు ఎస్-8 కోచ్‌లో ప్రయాణికుల్లాగా ఎక్కారు. దోపిడీకి పాల్పడాలనుకున్న చోట మరో 20 మంది మోహరించారు. కల్లూరు-గార్లదిన్నె మార్గంలోని 237/9 కి.మీ వద్దకు చేరుకోగానే ఎస్-2 కోచ్‌లోని దొంగలు చైను లాగి రైలును నిలిపివేశారు. దీంతో ఎస్-5 కోచ్‌లో ఉన్న అనంతపురం జీఆర్పీ కానిస్టేబుళ్లు శివప్రసాద్, నరసింహులు అప్రమత్తమై ఎస్-2 కోచ్ వద్దకు చేరుకున్నారు. ముసుగులు ధరించిన దొంగలు ముగ్గురు ఎస్-2 బోగిలోని ప్రయాణికులను బెదిరిస్తుండటాన్ని గుర్తించారు. పోలీసుల రాకను పసిగట్టిన ఆ ముగ్గురూ రైలు నుంచి దూకి ముళ్లపొదల్లోకి పరుగులు తీశారు. ఇంతలో ఎస్-7 బోగీలో కిటికీల పక్కన కూర్చుని ఉన్న ప్రయాణికులు రత్నమ్మ (గదగ్), చిన్నమ్మ (హుబ్లీ)ల నుంచి నగలు లాక్కోవడానికి ముందుగా అక్కడ వేచివున్న 20 మందితో కూడిన దొంగల ముఠా యత్నించిం ది. బెంబేలెత్తిన ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేయడంతో ఎస్-2 బోగీ వద్ద నుంచి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతూ పరుగెత్తుకుంటూ వ చ్చారు. దీంతో దొంగల ముఠా అక్కడి నుంచి పారిపోయింది. బోగీల ప్రధాన ద్వారాలు మూసి ఉండటంతో కిటికీల పక్కన కూర్చుని ఉన్న ప్రయాణికుల మెడలో గొలుసుల చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. హైవేల్లో దొంగతనాలకు పాల్పడే 20 నుంచి 30 మంది సభ్యులున్న అంతర్ రాష్ర్ట ముఠా పని అయి ఉండొచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. చోరీ జరగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లకు నగదు రివార్డు అందజేస్తున్నట్లు తెలిపారు. -
రింగ్ రింగా..
గుంతకల్లు, న్యూస్‌లైన్ : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో దాదాపు రూ.23 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్లు ఎప్పటిలాగే సిండికేట్ అయ్యారు. కొన్ని పనులకు సంబంధించి మాత్రమే పోటాపోటీగా షెడ్యూళ్లు దాఖలు చేశారు. గుంతకల్లు రైల్వే డీజిల్‌షెడ్డులో రెండు పనులను రూ.13,25,904తో, ఇంజనీరింగ్ బ్రాంచి పరిధిలో తొమ్మిది పనులను రూ.22 కోట్ల 37లక్షల 52 వేల 499తో, ఎలక్ట్రికల్ విభాగంలో ఒక పనిని రూ.56,33,382తో చేపట్టడానికి టెండర్లు పిలిచారు. సోమవారం స్థానిక డీఆర్ఎం కార్యాలయంలోని టెండరు కమిషనరేట్‌లో ప్రక్రియ చేపట్టారు. భారీ మొత్తంతో కూడిన పనులను దక్కించుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఒక రోజు ముందుగానే గుంతకల్లుకు చేరుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. పోటీ లేకుండా షెడ్యూళ్లు దాఖలు చేయడానికి మార్గం సుగమం చేసుకున్నారు. చిన్నాచితక పనుల విషయంలో మాత్రం పోటీ పడి షెడ్యూళ్లు దాఖలు చేశారు. ప్రధానంగా నంద్యాల - గుంతకల్లు సెక్షన్‌లోని రంగాపురం కంకర డిపోనకు 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల బెలాస్ట్ సరఫరా కోసం రూ.9,06,48,450తో పిలిచిన టెండర్‌ను దక్కించుకోవడానికి ఆ ప్రాంత నాయకులు రంగంలోకి దిగారు. ఈ పనికి డమ్మీ షెడ్యూల్‌తో కలిపి కేవలం రెండు మాత్రమే దాఖలైనట్లు సమాచారం. గుంతకల్లులోని శాంతినగర్, సౌత్ కాలనీలలో 96 సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి, రన్నింగ్ రూమ్ రిపేర్ల కోసం, రైల్వే ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చే అటెండర్ల కోసం డార్మెటరీ నిర్మాణానికి రూ.2,13,31,392 కేటాయించారు. గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలోని కమర్షియల్, జనరల్, ఆపరేటింగ్, సెక్యూరిటీ, ఎలక్ట్రికల్, పర్సనల్ బ్రాంచి కార్యాలయాల రిపేర్ల కోసం, మెకానికల్, ఎస్‌అండ్‌టీ కార్యాలయాల అభివృద్ధి కోసం, ఆర్పీఎఫ్ డాగ్ టన్నెల్ భవన నిర్మాణానికి రూ.1,17,57,920 కేటాయించారు. రేణిగుంటలో డ్రైనేజీ, సీవెర్లైన్ల నిర్మాణం, తిరుపతి-గూడూరు సెక్షన్‌లోని మామండూరు రైల్వేస్టేషన్‌లోనూ, వెంకటగిరి-వెండూడు, శ్రీకాళహస్తి-ఏర్పేడు రైల్వేస్టేషన్ల మధ్య డ్రైయినేజీల నిర్మాణానికి రూ.1,59,51,771 కేటాయించారు. ఇవి ముఖ్యమైన పనులు కావడంతో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి షెడ్యూళ్లు దాఖలు చేసినట్లు సమాచారం.