అభివృద్ధి పట్టాలెక్కేనా? | Pattalekkena development? | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పట్టాలెక్కేనా?

Published Tue, Feb 24 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

Pattalekkena development?

గుంతకల్లు : రైల్వే బడ్జెట్ వస్తోందంటే ప్రజల్లో ఆశలు చిగురిస్తాయి. తమ ప్రాంతానికేవైనా కొత్త ప్రాజెక్టులు, కొత్త రైళ్లు వస్తాయనే ఆశతో జనం ఎదురు చూడటం పరిపాటి. గుంతకల్లు రైల్వే డివిజన్‌కు 20 ఏళ్లుగా గ్రహణం పట్టుకుంది. ఏ రైల్వే మంత్రి వచ్చినా గుంతకల్లు రైల్వే డివిజన్‌కు ఒరగబెట్టింది శూన్యమే. రాయలసీమ వాసి అయిన కర్నూలు పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాషరెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఒక్క రైలు మినహా సాధించింది శూన్యం. రైల్వే బడ్టెట్‌ను ఈనెల 26న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మన జిల్లా ఎంపీలు ఘనంగానే ప్రతిపాదనలు పంపారు. కొత్త రైళ్లతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి నిధులు సాధిస్తామని ఢిల్లీకి బయలుదేరారు.
 
ఎంపీలు పంపిన ప్రతిపాదనలు ఇవే..
పుట్టపుర్తి నుంచి షిర్డీకి కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరు చేయాలి
చెన్నై నుంచి హైదరాబాద్ మధ్య పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైలు
గుంతకల్లు- హైదరాబాద్ మధ్య పగటిపూట ఎక్స్‌ప్రెస్ రైలు
 
సికింద్రాబాద్ నుంచి కర్నూలు టౌన్ మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలును డోన్, పెండేకల్లు మీదుగా గుంతకల్లు వరకు పొడగించాలి.
 
అనంతపురం మీదుగా రాజస్థాన్ వైపు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేషన్‌లో ఆగడం లేదు. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
గుంతకల్లులో వంద విద్యుత్ లోకో ఇంజన్ల సామర్ధ్యం గల షెడ్డును ఏర్పాటు చేసేందుకు 2008 సంవత్సరంలో అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా నిధుల లేమితో ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. రూ. 140 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గంలో విద్యుత్ రైళ్లు పూర్తి స్థాయిలో నడుస్తాయి. దీనిని 2012 మార్చి31కి పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు 2008లో రూ. కోటి, 2009లో రూ.2.48 లక్షలు, 2010లో రూ. 79.30 కోట్లు, 2011లో కోటి, 2012లో రూ. 3.33 కోట్లు, 2013లో రూ. 8 కోట్లు, 2014లో రూ.3 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇప్పటివరకు రూ. 6 కోట్లు రూపాయలు విలువైన పని మాత్రమే చేయగలిగారు.
 
పామిడి మండలం కల్లూరు వద్ద పెన్నా నదిపై బ్రిడ్జిని నిర్మించాలని 2009లో రైల్వేబోర్డుకు నివేదించారు. రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఆచరణ రూపం దాల్చలేదు..
 
అరకొర నిధుల కేటాయింపుతో సా..గుతున్న రైలు మార్గాలు
 గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని నంద్యాల-ఎర్రగుంట్ల స్టేషన్ల మధ్య 126 కి.మీల నూతన రైలు మార్గపు పనులకు 1996-97 రైల్వే బడ్జెట్‌లో రూ.883 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రూ.751 కోట్లు ఖర్చు చేయగా 30 కి.మీల రైలు మార్గపు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనికి నిధులు విడుదల చేయాల్సి ఉంది.
 
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని మునీరాబాద్- మహబూబ్‌నగర్‌ల మధ్య 246 కి.మీల నూతన రైలు మార్గ నిర్మాణానికి రూ.1290 కోట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు రూ.339.79 కోట్లు ఖర్చు చేశారు. 55 కి.మీల రైలు మార్గం పెండింగ్‌లో ఉన్నందున నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు.
 
కడప-బెంగుళూరు రైలు మార్గంలో 255.4 కి.మీల నిర్మాణానికి రూ. 2050 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. సర్వేలు, భూ సేకరణ రూపంలో రూ.199.79 కోట్లు ఖర్చు చేశారు. కానీ పనులు ప్రారంభించలేదు.
 
ఓబుళవారిపల్లి-కృష్ణపట్నం మధ్య 113 కి.మీల రైలు మార్గానికి రూ.930 కోట్లు అంచనాలు రూపొందించగా ఒక్క పైసా నిధులు విడుదల కాలేదు. ఈ మార్గపు నిధులను మరొక పనికి మళ్లించినట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.
   
మంత్రాలయం-కర్నూలు మధ్య 99 కిలో మీటర్ల రైలు మార్గానికి రూ. 200 కోట్లతో అంచనాలు తయారు చేశారు. 2012 రైల్వే బడ్జెట్‌లో కేవలం రూ.2 కోట్లు విడుదల చేసి సర్వేలు కానిచ్చారు. తరువాతి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు మరవడంతో పనులు అటకెక్కాయి.
 
పొద్దుటూరు-కంభం మధ్య 142 కి.మీల రైలు మార్గం నిర్మాణానికి రూ. 280.8 కోట్లుతో అంచనాలు తయారు చేసి పంపగా కేవలం రూ.10 లక్షలు మాత్రమే రైల్వేబోర్డు మంజూరు చేసింది.
 
నంచర్ల-మద్దికెర మధ్య 9 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన 7 కి.మీల బైపాస్ రైలు మార్గం పూర్తయితే హైదరాబాద్ నుంచి కర్నూలు, డోన్, పెండేకల్లు మీదుగా ముంబై వెళ్లే ప్రయాణీకులకు అనుసంధానం ఏర్పడుతుంది. తద్వారా రైళ్ల సమయపాలన కూడా ఆదా అవుతుంది.
 
రాయలసీమలో వెనుకబడిన అనంతపురం, కర్నూలు జిల్లాలను దృష్టిలో ఉంచుకొని నాటి రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాషరెడ్డి కర్నూలులో రైలు బోగీల మరమ్మతు కర్మగారాన్ని రూ.110 కోట్లతో మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టుకు  నిధులు కేటాయించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement