హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి యత్నం
* రైల్లోనే ప్రయాణించిన ముగ్గురు దుండగులు
* రైలు ఆపిన చోట వేచి ఉన్న మరో 20 మంది
* చైన్ లాగి దోపిడీకి యత్నం, కేకలు వేసిన ప్రయాణికులు
* గాలిలోకి కాల్పులు జరిపిన జీఆర్‌పీ పోలీసులు
గుంతకల్లు, న్యూస్‌లైన్: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని కల్లూరు-గార్లదిన్నె మార్గం మధ్యలో శనివారం తెల్లవారుజామున హంపి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. రైల్వే ఎస్పీ ఎస్.జె. జనార్దన్ కథనం మేరకు.. హుబ్లీ నుంచి బెంగళూరు వెళ్లే హంపి ఎక్స్‌ప్రెస్ (నం-16591)లో పక్కా ప్రణాళికతో దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులు ఎస్-2 కోచ్‌లో, మరో ముగ్గురు ఎస్-8 కోచ్‌లో ప్రయాణికుల్లాగా ఎక్కారు.
దోపిడీకి పాల్పడాలనుకున్న చోట మరో 20 మంది మోహరించారు. కల్లూరు-గార్లదిన్నె మార్గంలోని 237/9 కి.మీ వద్దకు చేరుకోగానే ఎస్-2 కోచ్‌లోని దొంగలు చైను లాగి రైలును నిలిపివేశారు. దీంతో ఎస్-5 కోచ్‌లో ఉన్న అనంతపురం జీఆర్‌పీ కానిస్టేబుళ్లు శివప్రసాద్, నరసింహులు అప్రమత్తమై ఎస్-2 కోచ్ వద్దకు చేరుకున్నారు. ముసుగులు ధరించిన దొంగలు ముగ్గురు ఎస్-2 బోగిలోని ప్రయాణికులను బెదిరిస్తుండటాన్ని గుర్తించారు. పోలీసుల రాకను పసిగట్టిన ఆ ముగ్గురూ రైలు నుంచి దూకి ముళ్లపొదల్లోకి పరుగులు తీశారు.
ఇంతలో ఎస్-7 బోగీలో కిటికీల పక్కన కూర్చుని ఉన్న ప్రయాణికులు రత్నమ్మ (గదగ్), చిన్నమ్మ (హుబ్లీ)ల నుంచి నగలు లాక్కోవడానికి ముందుగా అక్కడ వేచివున్న 20 మందితో కూడిన దొంగల ముఠా యత్నించిం ది. బెంబేలెత్తిన ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేయడంతో ఎస్-2 బోగీ వద్ద నుంచి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతూ పరుగెత్తుకుంటూ వ చ్చారు. దీంతో దొంగల ముఠా అక్కడి నుంచి పారిపోయింది. బోగీల ప్రధాన ద్వారాలు మూసి ఉండటంతో కిటికీల పక్కన కూర్చుని ఉన్న ప్రయాణికుల మెడలో గొలుసుల చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. హైవేల్లో దొంగతనాలకు పాల్పడే 20 నుంచి 30 మంది సభ్యులున్న అంతర్ రాష్ర్ట ముఠా పని అయి ఉండొచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. చోరీ జరగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లకు నగదు రివార్డు అందజేస్తున్నట్లు తెలిపారు.