నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది.. | 'Negligent' driving by Railway officers could have caused school bus accident | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..

Published Fri, Jul 25 2014 2:30 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది.. - Sakshi

నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..

* గేటు ఏర్పాటుపై పట్టించుకోని రైల్వే అధికారులు  
* అప్రమత్తంగా లేని బస్సు డ్రైవర్

 
సాక్షి, హైదరాబాద్:  దశాబ్దాలుగా ప్రజలు మొత్తుకుంటున్నా రైల్వే శాఖ మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్ద గేటు ఏర్పాటు చేయలేదు.. కాపలాదారులను నియమించలేదు.. గేటు లేదు సరికదా ట్రాక్ కనిపించకుండా ఓ గార్డు రూం కట్టి వదిలేశారు..!
 కాపలాదారు లేని లెవల్ క్రాసింగ్స్ వద్ద వాహనాల డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ పాఠశాల బస్సు డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తతతో వ్యవహరించలేదు.
 ...వెరసి ఈ రెండు నిర్లక్ష్యాలు ఏకంగా 16 మంది చిన్నారుల ప్రాణాలను కబళించాయి. గది కట్టారు... గేటు వదిలేశారు..
 రైల్వే శాఖ నిర్లక్ష్యానికి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట వద్ద చోటు చేసుకున్న దుర్ఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మాసాయిపేట వద్ద ప్రమాదం జరిగిన ప్రాంతంమీదుగా ఉన్న రైల్వే లైన్‌ను సరిగ్గా 14 ఏళ్లక్రితం బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. దీంతో ఇటువైపు రైళ్ల రాకపోకలు పెరిగాయి. మీటర్‌గేజ్‌గా ఉన్నప్పుడే లెవల్‌క్రాసింగ్ వద్ద గేటుకోసం గట్టిగా డిమాండ్ చేసిన ప్రజలు బ్రాడ్‌గేజ్‌గా మారాక మరింత గా పోరాటం చేశారు. అయినా రైల్వేశాఖ పట్టించుకోలేదు. నిధులు లేవంటూ గేటు ఏర్పాటు చేయలేదు. చివరకు స్థానికుల ఆందోళన తీవ్రతరమవడంతో మూడేళ్లక్రితం గేటును మంజూరు చేసి కాపలా సిబ్బందికోసం విశాలమైన గది నిర్మించారు.
 
 రెండే ళ్లక్రితం గేటు అమర్చి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీంతో సమస్య పరిష్కారమైందని ప్రజలు సంతోషించారు. కానీ మరుసటిరోజే ఆ గేటును తొలగించి తీసుకెళ్లిపోయారు. మధ్యలో రెండుసార్లు ఆ గదికి మరమ్మతులు చేసి రంగులేసిన రైల్వే అధికారులు ఇప్పటివరకు గేటును పెట్టలేదు. విచిత్రమేంటంటే ఆ గది పేరుతో ఇప్పటివరకు దాదాపు రూ.25 లక్షలు ఖర్చు చేశారు. నిజానికి సాధారణ గేటు ఏర్పాటుకయ్యే వ్యయమే రూ.20 లక్షలు. కాగా ఇక్కడ గేటు ఏర్పాటు చేసి గేట్‌మెన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సాక్షి గతంలో పలు సందర్భాల్లో సూచించింది. అయినా అధికారులు పట్టించుకోలేదు.
 
 రైలు కనపడకుండా అడ్డుగా మారిన గది..
 గేటు లేకుండా దిష్టిబొమ్మలా మిగిలిన ఆ గది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ట్రాక్ దాటేందుకొచ్చే వాహనదారులు దగ్గరికొచ్చాక.. రైలు ఇంజిన్ సరిగ్గా ఎంతదూరంలో ఉందో కనిపించకుండా ఆ గది అడ్డుగా మారింది. ఇంజిన్ కాస్త దూరంగానే ఉండిఉంటుందన్న భావనతో కొందరు వాహనదారులు వేగంగా వాహనాన్ని పట్టాలెక్కించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ గది కట్టకముందు అడపాదడపా జరిగే ప్రమాదాలు.. ఆ తర్వాత తరచూ జరుగుతున్నాయి. గది నిర్మాణం తర్వాత దాదాపు 25కుపైగా ప్రమాదాలు జరిగాయన్నది స్థానికుల కథనం. అందులో ఈ స్కూలు బస్సు దుర్ఘటన అతిపెద్దది. ఒకవేళ గేటు ఏర్పాటు చేయటంలో మరింత జాప్యం జరిగేపక్షంలో వెంటనే ఆ గదిని కూల్చేయాలని వారు అధికారులను కోరుతుండటం గమనార్హం.
 
 రెగ్యులర్ డ్రైవర్ రాకపోవడంతో...

 పిల్లల పాలిట మృత్యుశకటంగా మారిన పాఠశాల బస్సు(ఎ.పి.23ఎక్స్ 5349)ను కేవలం స్కూలుబస్సుగా వాడతామంటూ పాఠశాల యాజమాన్యం 2012లో దాని రిజిస్ట్రేషన్ సమయంలో రవాణా అధికారులకు తెలిపింది. ఈ బస్సుకు రెగ్యులర్ డ్రైవర్‌గా కె.ఎల్లం(40) వ్యవహరిస్తున్నాడు. అయితే బుధవారం ఉదయం అతను రాకపోవటంతో భిక్షపతి అనే మరో డ్రైవర్‌ను యాజమాన్యం పిలిపించింది. ఇతనికి ఆ మార్గం కొత్త. సాధారణంగా ఆ బస్సు రైల్వేట్రాక్‌కు ఈవల ఉన్న వెంకటాయపల్లి, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, దాతరపల్లి, కిష్టాయపల్లి గ్రామాల విద్యార్థులను ఎక్కించుకుని ట్రాక్ ఆవల ఉన్న మాసాయిపేట వెళ్లి మరికొందర్ని ఎక్కించుకుని తూప్రాన్‌కు వెళుతుంది. ఈ క్రమంలో శ్రీనివాసనగర్ స్టేషన్ వైపున్న గేటు ఉండే లెవల్‌క్రాసింగ్ గుండా మాసాయిపేటకు వెళ్లి తిరుగుప్రయాణంలో ఈ గేటులేని క్రాసింగ్ ద్వారా వస్తుంది. అయితే కొత్త డ్రైవర్ భిక్షపతికి అవగాహనలేక గేటు లేని క్రాసింగ్ గుండా వెళ్లే ప్రయత్నం చేశాడు.
 
  శ్రీనివాసనగర్ స్టేషన్‌నుంచి వస్తున్న రైలును గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. ఆ సమయంలో అతను సెల్‌ఫోన్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుండటంతో రైలు కూతను వినలేదన్నది స్థానికుల కథనం. ప్రమాదాన్ని నిమిషం ముందే విద్యార్థులు గమనించి, పెద్దగా అరుస్తూ హెచ్చరించినప్పటికీ డ్రైవర్ జాగ్రత్త పడలేదని ప్రత్యక్ష సాక్షి మురళీకృష్ణ ‘సాక్షి’ వివరించారు. కాగా బస్సు ట్రాక్‌కు దగ్గరగా రావడం గమనించిన రైలు లోకోపైలట్ సత్యనారాయణ వెంటనే బ్రేక్ వేశాడు. అది అక్కడ్నుంచీ సరిగ్గా 534 మీటర్ల దూరం వెళ్లి నిలిచింది. ఈలోపే బస్సును ఢీకొనటం, దాన్ని ఈడ్చుకుంటూ దాదాపు 35 మీటర్ల దూరం వరకు వెళ్లటం రెప్పపాటులో జరిగిపోయాయి. రైళ్లకు సడన్‌బ్రేకు వేయటం సాధ్యం కాదు. అలా వేస్తే బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలు తప్పి భారీ ప్రమాదానికి కారణమవుతుంది. రైల్వే వ్యవస్థలో సడన్ బ్రేక్ అంటే... బ్రేకు వేసిన 600 మీటర్ల దూరంలో రైలు నిలిచిపోయేలా చేయటం. ఇక్కడా ఆ ‘సడన్ బ్రేకే’ వేశారు.
 
 పాడు రైలు... టైమ్‌కొచ్చినా బాగుండు!
 మృత్యువు దరిచేరేవేళ అన్ని కారణాలను మోసుకొస్తుందంటారు. మాసాయిపేట రైల్వే లెవల్‌క్రాసింగ్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఇదే కనిపిస్తుంది. స్కూలు బస్సును ఢీకొన్న నాందేడ్-కాచిగూడ ప్యాసింజర్ రైలు వాస్తవానికి ఉదయం నాలుగున్నరకే ఆ ప్రాంతంమీదుగా వెళ్లాల్సి ఉంది. కానీ దాని జత రైలు రావటంలో జాప్యం ఫలితంగా ఈ రైలు మంగళవారం రాత్రి నాందేడ్‌లో రాత్రి 11.30కు బదులుగా తెల్లవారుజాము 3.30కి బయల్దేరింది. ఫలితంగా.. సరిగ్గా స్కూలు బస్సు పట్టాలెక్కిన సమయానికి మృత్యురూపంలో దూసుకొచ్చింది.
 
 తండావాసులు డబ్బులు పోగుచేసి కడితే.. తీసుకుని చేతులెత్తేసిన రైల్వేశాఖ!
 సాక్షి, హైదరాబాద్: నిధులు లేకనే లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్లు పెట్టలేకపోతున్నామని, రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ)లు నిర్మించలేకపోతున్నామని రైల్వే శాఖ చెబుతోంది. మరి స్థానికులు డబ్బులు పోగుచేసి రైల్వే అధికారుల చేతిలో పెట్టిన తర్వాత కూడా పనిచేయకపోతే దాన్నేమనాలి? మాసాయిపేట లెవల్ క్రాసింగ్ దాటి మేడ్చల్ వైపు ముందుకెళ్తే వచ్చే చిన్న తండా కూచారం. ఆ తండా ప్రజలు రోడ్డువైపు రావాలంటే ట్రాక్ దాటాల్సిందే.
 
 దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని ఆ తండావాసులు ఎన్నోమార్లు ఆందోళనలు చేశారు. అయితే అక్కడ ఆర్‌యూబీ నిర్మాణానికి రూ.1.30 కోట్లు అవసరమవుతాయని, నిధులు లేకనే నిర్మించలేకపోతున్నామని అధికారులు చెప్పారు. దీంతో తండావాసులు ఇంటికి కొంతచొప్పున చందాలు పోగుచేసి రూ.80 వేలు సమకూర్చుకుని చెక్కురూపంలో రైల్వే అధికారులకు అందజేశారు. అంతే.. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఆర్‌యూబీ కట్టనేలేదు. దాంతోపాటు తండావాసులిచ్చిన ఆ నిధుల జాడా లేకుండా పోయింది..!  
 
 ఆటోలో వెళ్లిన అన్న.. బస్సులో చితికిన తమ్ముడు
 ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వీరేశం, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు భగవాన్ పదో తరగతి, చిన్న బాబు విష్ణువర్థన్ 7వ తరగతి చదువుతున్నాడు. భగవాన్‌కు ప్రత్యేక తరగతులు ఉండడంతో ఆటోలో స్కూల్‌కు వెళ్లాడు. బస్సులో వెళ్లిన భగవాన్ తమ్ముడు విష్ణు మాత్రం మృత్యు శకటానికి బలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement