పెనుకొండ, న్యూస్‌లైన్ : అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. కంకర రవాణాలో అక్రమాలకు పాల్పడుతూ లక్షల్లో స్వాహా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రైల్వే శాఖలో పీడబ్ల్యూ విభాగం అత్యంత కీలకమైనది. దీని నేతృత్వంలో చాలా పనులు జరుగుతుంటాయి. పనులను పర్యవేక్షించడం ఈ విభాగంలోని సిబ్బంది బాధ్యత. అయితే బాధ్యతల్ని విస్మరించిన కొందరు సిబ్బంది అక్రమాలకు తెరలేపారు. రైల్వేలో దెబ్బతిన్న, బలహీనంగా ఉన్న లైన్లకు, కొత్త లైన్లకు కంకర తోలడానికి సంబంధించి రెండేళ్ల క్రితం సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు టెండర్లు పిలువగా.. పెనుకొండకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు.
మొదటి విడతగా 33 వేల క్యూబిక్ మీటర్లు, రెండో విడతగా 50 వేల క్యూబిక్ మీటర్ల కంకర సరఫరా చేయడానికి టెండర్లు పిలిచారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కంకర సరఫరా చేయడం ప్రారంభించారు. ఇందుకోసం కాంట్రాక్టర్‌కు క్యూబిక్ మీటర్‌కు రూ.800 రైల్వే శాఖ చెల్లిస్తుంది. అన్ని పన్నులు పోను కాంట్రాక్టర్‌కు రూ.650 మేరకు దక్కుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట గౌరిబిదనూరు వద్ద కంకర డంప్ చేయాలని రైల్వే అధికారులు భావించినా కాలుష్యం సమస్యగా మారుతుందని పెనుకొండ సమీపంలోని మక్కాజిపల్లి కేంద్రంగా డంపింగ్ ప్రారంభించారు. ఇక్కడ నిల్వ ఉంచిన కంకరను మండీలుగా విభజించి దానికి కొలతలు తీసిన తర్వాత అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు.
ఇలా కొలతలు తీసిన కంకరను రైలు వ్యాగిన్లలో నిర్ధేశిత ప్రాంతాలకు తరలించి ట్రాక్ పక్కన వదలాలి. ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్లు కమ్మక్కయ్యి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొలతలు వేసిన కంకరను రైలు పెట్టెల్లోకి నింపే ముందు ఒకరిద్దరు కాంట్రాక్టర్లు తమ సహాయకుల ద్వారా టిప్పర్లలో కంకరను పక్కకు తరలిస్తున్నారు. పక్కకు తరలించిన కంకరను తిరిగి కొత్త కంకరగా చూపుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం రైల్వే శాఖలోని కొందరు అధికారులకు తెలిసినా.. ఉన్నతాధికారులకు అక్రమాల్లో వాటాలు ఉండడంతో మిన్నకుండిపోతున్నట్లు తెలిసింది.
శుక్రవారం మక్కాజిపల్లి రైల్వేస్టేషన్ ఆవరణలో కొలతలు తీసిన కంకరను టిప్పర్ల ద్వారా బయటకు మళ్లించారని తెలియడంతో ‘న్యూస్‌లైన్’ అక్కడికెళ్లి పరిశీలించింది. పాత వేరుశనగ మిల్లు వద్ద పెద్ద ఎత్తున కంకర నిల్వలు కన్పించాయి. మండీలుగా ఉన్న ప్రాంతానికి అతి సమీపంలోనే ఈ కంకర నిల్వలు ఉంచడం పలు సందేహాలకు తావిస్తోంది. కంకర తరలింపు సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కంకర పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది.
నిఘా ఉంటుంది
కాంట్రాక్టర్లు ఒక సారి కంకర తోలి కొలతలు తీసిన తర్వాత దాన్ని కావాల్సిన ప్రాంతానికి తరలించే వరకు నిఘా వుంటుంది. బెంగళూరు, హిందూపురం రైల్వే అధికారులు తరచూ పరిశీలన జరుపుతారు. మేం నిల్వ చేసిన కంకర ఎంత? తరలించిన కంకర ఎంత? నిల్వ వున్న కంకర ఎంత? అన్న లెక్కలు ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఎప్పటికపుడు పరిశీలిస్తారు. కంకరను బోగీల ద్వారా తరలించే సమయంలో మా సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు.
- సుందరయ్య, సీనియర్ సెక్షన్
ఇంజనీర్, పెనుకొండ
ఆ కంకర మాదే
మక్కాజిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పాత వేరుశెనగ మిల్లు వద్ద నిల్వ వుంచిన కంకర మాదే. అధికారులు రైల్వేస్టేషన్ సమీపంలో నిర్ధేశించిన ప్రాంతంలో కంకర నిల్వ వుంచడానికి స్థలం లేదని చెప్పడంతో పాత మిల్లు వద్ద నిల్వ ఉంచాం. కర్ణాటక ప్రాంతం నుంచి తీసుకువచ్చిన కంకర అత్యవసరంగా దించాల్సి రావడంతో అక్కడే అన్‌లోడ్ చేశాం.
- సవితమ్మ, కాంట్రాక్టర్, పెనుకొండ
గులక గుటకాయ స్వాహా!
Published Sat, Feb 22 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement