Teacher exams
-
వారణాసి రైలు ఉలిక్కిపడింది
ఉత్తరప్రదేశ్ గాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్ మంగళవారం (ఫిబ్రవరి 2) రాత్రి వారణాసి రైలెక్కింది. ఫిబ్రవరి 3– బుధవారం మధ్యాహ్నం వారణాసిలో ఆమెకు టీచర్ సర్టిఫికెట్ ఎగ్జామ్ ఉంది. లెక్కప్రకారం అయితే రైలు వారణాసికి ఉదయం తొమ్మిదికి చేరుకోవాలి. కాని తెల్లారి పొగమంచు కమ్ముకుంది. వారణాసికి రెండు గంటల దూరంలోని ‘మౌ’ అనే ఊరిలో రైలు ఆగిపోయింది. నాజియా ఎగ్జామ్ తప్పిపోయేలా ఉంది. కాని అప్పుడొక చిత్రం జరిగింది. నాజియా ఎగ్జామ్ రాసింది. భారతీయ రైల్వేలు ప్రయాణికుల పక్షాన ఉన్నాయని ఈ ఉదంతం చెబుతోంది. ప్రతి తమ్ముడికి ఒక అక్క ఉంటే బాగుంటుంది నిజమే కాని ప్రతి అక్కకు కూడా ఒక తమ్ముడు ఉంటే బాగుంటుందని ఇది చదివితే అర్థమవుతుంది. ‘ఏం చేయన్రా తమ్ముడూ... ఎగ్జామ్ మిస్ అయ్యేలా ఉంది’ అని అక్క ఆందోళన చెందితే తమ్ముడు రంగంలోకి దిగాడు. అతడు చేసిన పని ఫలితం ఇచ్చింది. అక్కకు గండం గట్టెక్కింది కూడా. పొగమంచులో భవిష్యత్తు ఉత్తర ప్రదేశ్‌లో ఘాజీపూర్‌కు చెందిన నాజియా తబస్సుమ్ వారణాసిలో బుధవారం (ఫిబ్రవరి 3) మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష రాయాలి. టీచర్ సర్టిఫికెట్ ఎగ్జామ్ అది. అంటే టీచరు కావాలనే నాజియా తబస్సుమ్ కల నెరవేరాలంటే ఆ ఎగ్జామ్ రాయకతప్పదు. అందుకే ఆమె ఘాజీపూర్‌లో మంగళవారం రాత్రి వారణాసి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. దాదాపు 10 గంటల ప్రయాణం. రైలు మరుసటి రోజు ఉదయం 9.30 గం. లోపు చేరుకున్నా ఎగ్జామ్ రాయడానికి మధ్యలో రెండు గంటల టైమ్ ఉంటుంది. కొంచెం లేటైనా పర్వాలేదనుకుని రైలు ఎక్కింది తబస్సుమ్. కాని పొగమంచులో రైలు ప్రయాణం నత్త నడకన సాగింది. వారణాసికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మౌ’ అనే జంక్షన్లో ట్రైను పూర్తిగా ఆగిపోయింది. అక్కడి నుంచి మామూలు రోజుల్లో ప్రయాణం దాదాపు 2 గంటలు. పొగమంచు వల్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టేలా ఉందని రైల్వే అధికారులు, ప్రయాణికులు కూడా నిర్థారణకొచ్చేశారు. కాని ట్రైన్లో ఉన్న నాజియాకు పరీక్ష ఎలాగైనా రాయాలన్న పట్టుదల. ఏం చేయాలి? ఏం చేద్దాం తమ్ముడూ..? అక్కకు తోడుగా ట్రైన్లో ఉన్న ఆమె తమ్ముడు అన్వర్ జమాల్ పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని గ్రహించాడు. వెంటనే ‘రైల్వేసేవ’ ట్విటర్ అకౌంట్లో పరిస్థితి వివరించాడు. అక్క హాల్ టికెట్, ట్రైన్ నంబర్ పెట్టి ‘సాయం చేయండి’ అని కోరాడు. నిజానికి అది చిగురంత ఆశతో చేసిన పనే. కాని ఆ పని ఫలితం ఇచ్చింది. అన్వర్ జమాల్ ట్వీట్‌కు రైల్వేశాఖ తక్షణమే స్పందించింది. రంగంలో దిగిన రైల్వేశాఖ వారణాసిలో ఉన్న రైల్వే అధికారులు వెంటనే రంగంలో దిగారు. ట్రైన్ ఎక్కడ ఉందో ఆరా తీశారు. ‘మౌ’ జంక్షన్లో ఉన్న ట్రైను వారణాసికి చేరాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయని గ్రహించారు. వారణాసి ఎక్స్‌ప్రెస్ ‘మౌ’ నుంచి వారణాసి చేరే మధ్యలో 4 స్టాపుల్లో ఆగాలి. ఆ స్టేషన్లలో దిగాల్సిన ప్రయాణికులకు ఇబ్బంది రాకూండా ఉండేందుకు ఆ నాలుగు స్టేషన్లలో రైలు ఆపడానికే నిశ్చయించుకున్నారు. కాని మౌ వారణాసిల మధ్య సింగిల్ లైన్లో ఇంకో ట్రైన్ ఏదీ లేకుండా చూసుకున్నారు. స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ ఖాళీ లేకపోతే ఈ ట్రైనును లూప్లైన్లో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. అన్ని స్టేషన్ల నుంచి సిగ్నల్ సకాలంలో అందేలా శ్రద్ధ పెట్టారు. ట్రైను డ్రైవర్‌కు, గార్డ్‌కు సమాచారం అందించారు. ట్రైను చకచక కదిలింది. మధ్యలోని నాలుగు స్టేషన్లలో ఆగి వెంటనే బయలుదేరి నాజియాను వారణాసి చేర్చింది. ‘అందరికీ కృతజ్ఞతలు. మేము సమయానికి చేరుకున్నాం’ అని అన్వర్ జమాల్ సంతోషంగా ట్వీట్ చేశాడు. నాజియా ఎగ్జామ్ రాసింది. రేపు ఆమె టీచర్ అయితే అందరూ ఆమెను రైలు టీచరమ్మ అని పిలుచుకున్నా ఆశ్చర్యం లేదు. అలా ఆమె ప్రయాణం అందరికీ గుర్తుండిపోయింది. – సాక్షి ఫ్యామిలీ -
టీచర్లకు ‘పరీక్ష’
→ ఎగ్జామినేషన్ బోర్డు రద్దుతో అదనపు బాధ్యతలు → 1 నుంచి 10 వరకు టీచర్లే పరీక్షలు నిర్వహించాలి → ప్రశ్నాపత్రం తయారుచేయాలి → జిరాక్సుల భారం ఉపాధ్యాయులపైనే ! → 15 నుంచి అర్ధసంవత్సరం పరీక్షలు → ఆందోళనలో ఉపాధ్యాయులు సాక్షి, విజయవాడ : జిల్లాలో ఉపాధ్యాయులకు పరీక్షా కాలం ప్రారంభమైంది. ఇప్పటివరకు విద్యార్థులకు పాఠాలు బోధించడం, పరీక్షలకు సిద్ధంచేయడం మాత్రమే ఉపాధ్యాయుల విధి. తాజాగా బాధ్యతలు పెరిగాయి. పరీక్షల నిర్వహణతోపాటు ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత కూడా టీచర్లదేనని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టీచర్లలో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పనిభారం పెరగడంతోపాటు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పెరగనున్న పని ఒత్తిడి ఇప్పటివరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పరీక్షలు నిర్వహించే కామన్ ఎగ్జామినేషన్ బోర్డును ప్రభుత్వం రద్దుచేసింది. విద్యాబోధన నుంచి పరీక్షల నిర్వహణ వరకు అన్ని బాధ్యతలు సంబంధిత విభాగాల ఉపాధ్యాయులవేనని ప్రకటించింది. పరీక్షాపత్రాల తయారీ భారం కూడా వారే భరించాల్సి ఉంది. కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ఉన్నప్పుడు ప్రశ్నాపత్రాల సిద్ధంచేయడంతోపాటు పరీక్ష షెడ్యూల్‌ను కూడా నిర్ణయించేది. ఇందుకోసం ప్రతి విద్యార్థి స్కూల్ ఫీజులో రూ.30 చొప్పున బోర్డుకు చెల్లించేవారు. ఈ విధంగా ఏటా జిల్లాలో రూ.45 లక్షలు బోర్డుకు ఇచ్చేవారు. విభజన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఇతర కారణాలతో కామన్ ఎగ్జామినేషన్ బోర్డును గత నెలలో రద్దుచేశారు. అయితే కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ల నుంచి రూ.45లక్షల ఫీజులు వసూలు చేసింది. ఈ విద్యాసంవ్సరంలో త్రైమాసిక పరీక్షలను నిర్వహించింది. అనంతరం బోర్డును రద్దు చేయడంతో ఆ తర్వాత చేపట్టాల్సిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్కూళ్ల నుంచి వసూలు చేసిన ఫీజులను తరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ఫీజులను స్కూళ్లకు తిరిగి చెల్లించే ప్రక్రియ మొదలుపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు రాజీవ్ విద్యామిషన్ ఒక్కొక్కరికి రూ.2.50 చెల్లించేది. బోర్డు రద్దుతో రాజీవ్ విద్యామిషన్ నుంచి ఆ నిధులు కూడా నిలిచిపోయాయి. ముంచుకొస్తున్న పరీక్షలు జిల్లాలో 425 హైసూళ్లలో 8,714 మంది, 2,148 ఎలిమెంటరీ సూళ్లలో 7,750 మంది, 521 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 5,498 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అన్ని స్కూళ్లలో సుమారు 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అంచనా. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు వారికి అర్ధ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో టీచర్లలో ఆందోళన మొదలైంది. టీచర్లు స్వయంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసి జిరాక్సు కాపీలు తీయించి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి నిధుల విషయమై స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతానికి ఉపాధ్యాయులే ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.