టీచర్లకు ‘పరీక్ష’
→ ఎగ్జామినేషన్ బోర్డు రద్దుతో అదనపు బాధ్యతలు
→ 1 నుంచి 10 వరకు టీచర్లే పరీక్షలు నిర్వహించాలి
→ ప్రశ్నాపత్రం తయారుచేయాలి
→ జిరాక్సుల భారం ఉపాధ్యాయులపైనే !
→ 15 నుంచి అర్ధసంవత్సరం పరీక్షలు
→ ఆందోళనలో ఉపాధ్యాయులు
సాక్షి, విజయవాడ : జిల్లాలో ఉపాధ్యాయులకు పరీక్షా కాలం ప్రారంభమైంది. ఇప్పటివరకు విద్యార్థులకు పాఠాలు బోధించడం, పరీక్షలకు సిద్ధంచేయడం మాత్రమే ఉపాధ్యాయుల విధి. తాజాగా బాధ్యతలు పెరిగాయి. పరీక్షల నిర్వహణతోపాటు ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత కూడా టీచర్లదేనని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టీచర్లలో ఆందోళన మొదలైంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పనిభారం పెరగడంతోపాటు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పెరగనున్న పని ఒత్తిడి
ఇప్పటివరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పరీక్షలు నిర్వహించే కామన్ ఎగ్జామినేషన్ బోర్డును ప్రభుత్వం రద్దుచేసింది. విద్యాబోధన నుంచి పరీక్షల నిర్వహణ వరకు అన్ని బాధ్యతలు సంబంధిత విభాగాల ఉపాధ్యాయులవేనని ప్రకటించింది. పరీక్షాపత్రాల తయారీ భారం కూడా వారే భరించాల్సి ఉంది. కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ఉన్నప్పుడు ప్రశ్నాపత్రాల సిద్ధంచేయడంతోపాటు పరీక్ష షెడ్యూల్‌ను కూడా నిర్ణయించేది.
ఇందుకోసం ప్రతి విద్యార్థి స్కూల్ ఫీజులో రూ.30 చొప్పున బోర్డుకు చెల్లించేవారు. ఈ విధంగా ఏటా జిల్లాలో రూ.45 లక్షలు బోర్డుకు ఇచ్చేవారు. విభజన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఇతర కారణాలతో కామన్ ఎగ్జామినేషన్ బోర్డును గత నెలలో రద్దుచేశారు. అయితే కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్ల నుంచి రూ.45లక్షల ఫీజులు వసూలు చేసింది.
ఈ విద్యాసంవ్సరంలో త్రైమాసిక పరీక్షలను నిర్వహించింది. అనంతరం బోర్డును రద్దు చేయడంతో ఆ తర్వాత చేపట్టాల్సిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్కూళ్ల నుంచి వసూలు చేసిన ఫీజులను తరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ఫీజులను స్కూళ్లకు తిరిగి చెల్లించే ప్రక్రియ మొదలుపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు రాజీవ్ విద్యామిషన్ ఒక్కొక్కరికి రూ.2.50 చెల్లించేది. బోర్డు రద్దుతో రాజీవ్ విద్యామిషన్ నుంచి ఆ నిధులు కూడా నిలిచిపోయాయి.
ముంచుకొస్తున్న పరీక్షలు
జిల్లాలో 425 హైసూళ్లలో 8,714 మంది, 2,148 ఎలిమెంటరీ సూళ్లలో 7,750 మంది, 521 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 5,498 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అన్ని స్కూళ్లలో సుమారు 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అంచనా. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు వారికి అర్ధ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో టీచర్లలో ఆందోళన మొదలైంది. టీచర్లు స్వయంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసి జిరాక్సు కాపీలు తీయించి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి నిధుల విషయమై స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతానికి ఉపాధ్యాయులే ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.