'సీఎంగారు రక్షించండి.. వేధిస్తున్నారు'
ఆగ్రా: నజియా అనే ఆ అమ్మాయి గొప్ప సాహసికురాలుగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది కిడ్నాపర్ల చెర నుంచి ఓ ఆరేళ్ల బాబును రక్షించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేతుల మీదుగా ఆగస్టులో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి అవార్డును అందుకుంది. కానీ, అలాంటి బాలిక ఇప్పుడు మాత్రం అదే ముఖ్యమంత్రికి 'తనను రక్షించండి' అంటూ వరుసగా ట్వీట్లు చేసింది. గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ల ఆకృత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని ఆమె సీఎం అఖిలేశ్ కు విజ్ఞప్తి చేసింది.
ఆగ్రాలోని మంటోలా ఏరియాలో ఓ గ్యాంబ్లింగ్ బ్యాచ్ మట్కా గ్యాంబ్లింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా ఫిర్యాదుచేసినప్పటి నుంచి వారి వేధింపులు మొదలయ్యాయి. పోలీసులు, గ్యాంబ్లర్స్ కలిసి తనను వేధిస్తున్నారని, తనకు అపఖ్యాతి తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని సీఎంకు ట్వీట్ ద్వారా తెలిపింది. తనను ఈ వేధింపుల నుంచి రక్షించాలని సీఎంను వేడుకుంది.
అలాగే, ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారని, అతడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడంతో అతడి వల్ల తమ కుటుంబానికి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 'ఇలాగే తన పోరాటం కొనసాగించమని ముఖ్యమంత్రి నా భుజం తట్టి చెప్పారు. ఎప్పుడు నా గొంతు విప్పినా నా జీవితాన్ని ఓ సమస్యల సుడిగుండంలా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఫిర్యాదు చేసినవారిని కాకుండా పోలీసులు నన్ను పిలిచి విచారిస్తున్నారు. నేను జూలైలో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు' అని ఆ బాలిక నేరుగా సీఎం అఖిలేశ్కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేసింది.