
ప్రధాని మోదీ మరో సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ‍్మెల్యేలు అందరూ తమ బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాలని మోదీ ఆదేశించారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను జనవరి 1న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సమర్పించాలని సూచించారు. అలాగే బీజేపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లంచాలని ఆదేశించారు.
ఈ నెల 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ‍్యంలో పారదర్శకంగా ఉండేందుకు బీజేపీ చట్టసభ సభ్యులు బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని మోదీ ఆదేశించారు.