మోదీ వచ్చినా మనకేది లాభం?
- బీజేపీ రాష్ట్ర నేతల్లో అసంతృప్తి
- ముఖ్యనేతల తీరుపై పెదవి విరుపు
- మోదీ పర్యటన తమకన్నా
- కేసీఆర్‌కే లబ్ధికలిగించిందన్న భావనలో బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: చేతికి అంది వచ్చిన సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నట్లుగా పార్టీ తీరు ఉందంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో పార్టీకి కలసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీజీపీల సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన మోదీని కలసుకుని మీడియాలో, ఇతరత్రా ప్రచారం పొందడానికి అవకాశమున్నా, ఆ దిశలో ముఖ్యనేతలు ప్రయత్నించకపోవడంపై పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర శాఖ కొత్త కమిటీ ఏర్పడిన నేపథ్యంలో, సమయం తీసుకుని ప్రధానికి కమిటీ సభ్యులను పరిచయం చేయడం, పెద్ద నోట్ల రద్దుపై పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాల నివేదికను మోదీకి సమర్పించేందుకు చొరవ తీసుకోకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
దేశంలో నల్ల ధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్లను రద్దు చేయడంపై జిల్లాల్లో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, ఏవైనా సలహాలు, సూచనలు అందించడం వంటివి చేసి ఉంటే బావుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీ పర్యటనను టీఆర్‌ఎస్ ప్రభుత్వం, అధికార పార్టీ పూర్తిగా తమకు అనుకూలంగా మలచుకోగా, బీజేపీ రాష్ట్ర శాఖ ఎలాంటి లబ్ధి పొందలేకపోయిందని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానిని కలసిన బీజేపీ నాయకులకు సంబంధించి కూడా మీడియాలో తగిన ప్రచారం దక్కక పోవడంపై పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలికే సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుని, పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నించినట్లుగా సీఎం కేసీఆర్ మీడియా ద్వారా, ఇతరత్రా పూర్తి మైలేజీని పొందగలిగారని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
పోరాటాల్లోనూ వెనకడుగేనా?
రాష్ట్రంలో అధికారపార్టీకి వ్యతిరేకంగా పోరాడి వచ్చే ఎన్నికలకల్లా రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ ఎదగలేక పోవడంపై నేతల్లో అంతర్మథనం సాగుతోంది. ఇటు కేసీఆర్ ప్రభుత్వానికి, అటు టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ముఖ్య నాయకులనుంచి మార్గదర్శనం కొరవడుతోందనే అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. పలు అంశాలపై నిరసనలు చేపడుతున్నా అవి మొక్కుబడిగానే మిగిలిపోతున్నాయన్న భావనలో కొందరు నాయకులున్నారు. మరో రెండున్నరేళ్లలోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ప్రాధాన్యతలను మార్చుకుని, కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోలేకపోతే రాష్ట్రంలో నిర్ణాయకశక్తిగా మారడం అటుంచి, జాతీయపార్టీగా తగిన బలాన్ని కూడా నిరూపించుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చునని కొందరు నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.