ఖాతాల వివరాలివ్వండి
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మోదీ ఆదేశాలు
న్యూఢిల్లీ: నోట్లరద్దు విషయం కొందరు బీజేపీ నేతలకు ముందే తెలుసన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో.. ప్రధాని మోదీ పార్టీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. ప్రజాజీవితంలో ఉంటున్న వారు జవాబుదారీగా ఉండాలని అందుకే బీజేపీ ప్రజాప్రతినిధులంతా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు తమ బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అందజేయాలని సూచించారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలనుద్దేశించి మాట్లాడుతూ.. ఈ స్టేట్‌మెంట్లన్నీ జనవరి 1 వరకు షాకు చేరాలన్నారు. ‘విపక్షాల ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవే. దేశంలో నల్లధనం పెరుగుదలను సహించేది లేదు’అని తేల్చి చెప్పారు.
నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చేందుకే ఆదాయపన్ను చట్టంలో సవరణలు తీసుకువస్తున్నారన్న విమర్శలను ఖండించారు. ‘లూటీ ధనం ప్రజల వద్దకు చేరాలి. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి’ అని స్పష్టంచేశారు. దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నంలో డిజిటల్, మొబైల్ ఎకానమీని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.అమిత్ షా మాట్లాడుతూ.. నగదు రహిత లావాదేవీలు జరిగేలా ఎంపీలు వారి నియోజకవర్గాల్లోని పంచాయతీలు, మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల్లో వ్యాపారులను ప్రోత్సహించాలన్నారు. విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ మొబైల్, ఇంటర్నెట్ ద్వారా డబ్బుల లావాదేవీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నల్లధనంపై చేస్తున్న పోరులో.. ఐటీ చట్టంలో సవరణలు భాగమని మంత్రి అనంతకుమార్‌అన్నారు. నల్లధనం నుంచి పన్ను ద్వారా సేకరించిన డబ్బును ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వాడతామన్నారు.
అవినీతిపై ప్రజానిర్ణయం.. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. ప్రజలు అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా ఉన్నారని.. దేశ సర్వతోముఖాభివృద్ధిని కోరుకుంటున్నారని స్పష్టమైందని మోదీ ట్వీట్ చేశారు. ‘అది ఈశాన్యరాష్ట్రాలైనా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఎన్నికలైనా.. బీజేపీ తన మార్కును చూపించింది. అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తాచాటింద’న్నారు.
8కి ముందునాటి వివరాలూ ఇవ్వండి: కాంగ్రెస్
బీజేపీ ప్రజాప్రతినిధులు నవంబర్ 8 తర్వాత బ్యాంకు లావాదేవీల వివరాలివ్వాలంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ విమర్శించింది. నవంబర్ 8కి ముందు జరిపిన లావాదేవీల వివరాలూ ఇవ్వాలంది. ‘నవంబర్ 8కి ముందు వివరాలివ్వమని ఆయన చెప్పి ఉంటే వారికి సమస్యలొచ్చేవి’ అని సిబల్ ఎద్దేవా చేశారు. ‘ఆరెస్సెస్ శాఖలకు ఏ చెక్కుల ద్వారా చెల్లింపులు జరిగారుు? నవంబర్ 8కి ముందు ఎంపీలు డిపాజిట్ చేసిన సొమ్మెంత? ఇవన్నీ చెబితే.. నోట్లరద్దుపై ప్రధాని చిత్తశుద్ధిపై మాకు అనుమానాలుండవు’అని సిబల్ ప్రశ్నించారు. బీజేపీ, ఆరెస్సెస్ చేసిన భూలావాదేవీల వివరాలనూ వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా, మోదీ తన బ్యాంకు ఖాతాల వివరాలను బయటపెట్టాలని తృణమూల్ చీఫ్ మమత డిమాండ్ చేశారు. ప్రధాని ప్రజల రాజ్యాంగ హక్కులను ప్రధాని కాలరాస్తున్నారని.. హిట్లర్, తుగ్లక్‌లను మించిపోయారని విమర్శించారు.