సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ధన ప్రవాహాన్ని నిలువరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బ్యాంకుల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) డేగ కన్నేసింది. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు లావాదేవీల సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు అందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల సమాచారాన్ని అన్ని బ్యాంకులు వెంటనే ఐటీ శాఖకు అందజేయాలని సూచించింది.
ఒక్క రోజులో రూ.10 లక్షలు అంత కన్నా ఎక్కువ ఉపసంహరణ, డిపాజిట్లు, నెలరోజుల్లో రూ. 50 లక్షలకు పైగా ఉపసంహరణ, డిపాజిట్లపై రోజువారీ నివేదికలను ఐటీ శాఖకు అందజేయాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలవారీగా బ్యాంకులన్నీ ఈ నివేదికలు పంపాలని స్పష్టం చేసింది. రూ. 2,000 కన్నా ఎక్కువగా డిజిటల్ బదిలీల సమాచారాన్ని కూడా ఐటీ శాఖకు పంపాలని తెలిపింది. ఒక ఖాతా నుంచి పలు ఖాతాలకు డిజిటల్ చెల్లింపులు, ఒక మొబైల్ నుంచి పలు మొబైల్ నంబర్లకు నగదు బదీలీల సమాచారాన్ని కూడా ఇవ్వాలని సూచించింది. వీటిపై క్షేత్రస్థాయిలో బ్యాంకుల సిబ్బందికి అవగాహన కల్పిచాలని తెలిపింది. ఎటువంటి అనధికార కార్యకలాపాలకు పాల్పడకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నగదు తరలింపును నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ శాఖలతో కలిపి 105 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం తనిఖీలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment