
ప్రతీకాత్మక చిత్రం
హారిస్‌బర్గ్ : పెన్సిల్వేనియాలో నివాసముండే అమెరికన్ రాబర్ట్ తన ఖాతాలోకి అప్పనంగా భారీ మొత్తం వచ్చిపడటంతో షాక్‌కు గురయ్యాడు. రూ.86 లక్షలు అతని ఖాతాలో జమైన విషయాన్ని భార్య టిఫ్ఫాని విలియమ్స్‌కు చెప్పాడు. ఇంకేముంది ఇద్దరికీ ఎప్పుడూలేని కోరికలు, సౌఖ్యాలు గుర్తొచ్చాయి. 15 రోజుల్లోనే దాదాపు రూ. 70 లక్షలు ఖర్చు చేసి.. అదీఇదీ అని కాకుండా అన్ని కొనేశారు. రెండు ఖరీదైన కార్లు కూడా కొనిపడేశారు. ఈ నేపథ్యంలో ‘టెల్లర్ ఎర్రర్’ కారణంగా పొరపాటుగా డబ్బులు రాబర్ట్ ఖాతాలో జమైనట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు.
వెంటనే రికవరీ కోసం సిబ్బందిని అతని ఇంటికి పంపింది. కానీ, అప్పటికే ఉన్న సొమ్ములన్నీ విచ్చలవడిగా ఖర్చు చేయడంతో ఆ దంపతులు చేతుల్తేశారు. అయితే, అరెస్టు తప్పదని భావించిన టిఫ్ఫాని ఎలాగైనా ఆ మొత్తం కడతామని నమ్మబలికింది. రికవరీ సిబ్బంది కళ్లుగప్పి దంపతులిద్దరూ తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారు. చివరకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిపై దొంగతనం, మోసం కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 18 లక్షల పూచీకత్తుపై కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇదిలాఉండగా.. దూరపు చుట్టానికి కూడా ఆ దంపతులు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడం గమనార్హం.