![100,000 organic eggs stolen from one US grocer as bird flu drives up prices](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/EGG.jpg.webp?itok=7a-tgtNa)
పాత తెలుగు సినిమాల్లో కామెడీ దొంగలుంటారు. వాళ్ల పని ఊళ్లో కోళ్లు పట్టడమే. ఎత్తుకొచ్చిన, కొట్టుకొచ్చిన కోళ్లను చక్కగా వండుకు తినే వాళ్లు కొందరైతే వాటిని ఎంతకో కొంతకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వాళ్లు ఇంకొదరు. అలాంటి దొంగలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో పడ్డారు. అయితే వాళ్లు దొంగకోళ్లు పట్టేవాళ్లు కాదు. కోడిగుడ్లు కొట్టేసేవాళ్లు.
పెరుగుతున్న కోడి గుడ్డు ధరను సొమ్ము చేసుకునేందుకు కొందరు ఈ ‘గుడ్ల గుటకాయస్వాహ’పథకానికి వ్యూహ రచన చేశారు. అనుకున్నదే తడవుగా ఒకే దెబ్బకు 1,00,000కుపైగా గుడ్లను కొట్టేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్‌క్యాసెల్ నగరంలో పీట్ అండ్ గ్యారీస్ ఆర్గానిక్స్ ఎల్‌ఎల్‌సీ సంస్థకు చెందిన లారీ నుంచి దొంగలు ఈ గుడ్లను దొంగతనం చేశారు. వీటి విలువ దాదాపు రూ.35 లక్షలు.
కొండెక్కుతున్న గుడ్డు ధర
ఎవరైనా కోళ్లను దొంగతనం చేస్తారు. వీళ్లేంటి కోడిగుడ్ల వెంట పడ్డారని అనుమానం రావొచ్చు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి బర్డ్‌ఫ్లూ. రెండోది పెరుగుతున్న గుడ్ల ధర. అమెరికాలో గత రెండేళ్లుగా పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ ప్రభావం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. గత దశాబ్దకాలంలో ఇంతటి విస్తృత స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి.
గతనెల లూసియానాలో మనుషులకు సైతం ప్రాణాంతకరమైన స్థాయి వేరియంట్ బర్డ్‌ఫ్లూను కనుగొన్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు ప్రతి నెలా లక్షలాది కోళ్లను చంపేస్తున్నారు. ఈ దొంగలు నిజంగానే కోళ్లను కొట్టేసి అమ్మినా జనం ‘బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లు’అని భావించి ఎవరూ కొనక పోవచ్చు. బర్డ్‌ఫ్లూ భయంతో జనం చికెన్‌లాంటి పక్షి మాంసం వాడకం తగ్గించి చాలా మటుకు గుడ్లను తింటున్నారని తెలుస్తోంది. ఇందుకు పెరుగుతున్న కోడి గుడ్ల ధరలే ప్రబల తార్కాణం.
మొత్తంగా చూస్తే కోడి గుడ్డు ధర రెట్టింపు అయినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తే దొంగలను గుడ్ల చోరీకి ఉసిగొల్పింది. దుకాణాల్లో పంపిణీ కోసం లారీలో సిద్ధంగా ఉంచిన గుడ్లను శనివారం రాత్రి ఆగంతకులు ఎత్తుకెళ్లిపోయారని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదుచేసి గుడ్ల దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు.
అయితే దొంగలు ఈపాటికి గుడ్లను ఇష్టమొచ్చిన అధిక రేటుకు అమ్ముకుని మరో గుడ్ల షాపుపై రెక్కీ నిర్వహిస్తూ ఉంటారని కొందరు నెటిజన్లు సరదా వ్యాఖ్యల పోస్ట్‌లు పెట్టారు. గుడ్ల కొరత ఏర్పడటంతో గుడ్లతో చేసే వంటకాల ధరలూ రెస్టారెంట్లు, హోటళ్లలో పెరుగుతున్నాయి. అమెరికాలో 25 రాష్ట్రాల్లో దాదాపు 2,000 చోట్ల వ్యాపారం చేస్తున్న ప్రఖ్యాత వేఫుల్ హౌస్ రెస్టారెంట్ తమ గుడ్ల వంటకాల ధరను కాస్తంత పెంచింది. ‘‘మార్కెట్లో గుడ్లు దొరకట్లేవు. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటున్నాం. అందుకే ఎక్కువ ధరకు అమ్ముతున్నాం’’అని రెస్టారెంట్ తాపీగా చెబుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment