USA Presidential Elections 2024: కమలదే పై చేయి | USA Presidential Elections 2024: ABC News Presidential Debate Full Conversation Between Donald Trump And Kamala Harris | Sakshi
Sakshi News home page

USA Presidential Elections 2024: కమలదే పై చేయి

Published Thu, Sep 12 2024 4:46 AM | Last Updated on Mon, Oct 7 2024 10:37 AM

USA Presidential Elections 2024: ABC News presidential debate between Trump, Harris

డిబేట్లో ట్రంప్‌ బేజారు 

ప్రశ్నలకు నీళ్లు నమిలిన ట్రంప్‌ 

డిబేట్‌ కోసం ప్రత్యర్థులిద్దరూ ఏబీసీ వేదికపైకి రాగానే హారిసే చొరవ తీసుకుని ట్రంప్‌ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. తద్వారా ముందే పైచేయి సాధించారు. డిబేట్‌ చక్కగా సాగాలని ఆమె ఆకాంక్షించగా, ‘హావ్‌ ఫన్‌’ అంటూ ట్రంప్‌ స్పందించారు.

గంటా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన డిబేట్‌ ముగిశాక మాత్రం కరచాలనం వంటివేమీ లేకుండానే ఎవరికి వాళ్లు వేదిక నుంచి నిష్క్రమించారు.

డిబేట్‌ పొడవునా హారిస్‌ పదేపదే ట్రంప్‌ను ఉడికించే వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ ఎత్తిచూపారు. ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్‌ మాట్లాడుతుండగా పదేపదే నవ్వులు, ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు.

ఈ ఎత్తుగడలన్నీ బాగా ఫలించాయి. హారిస్‌ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్‌ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంలో అదుపు తప్పి పదేపదే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు.

ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హారిస్‌ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదేపదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. హారిస్‌ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్‌ చేసిన వివాదాస్పద జాతి వివక్షపూరిత, విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరువు పెట్టారు.

వాషింగ్టన్‌: అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన తొలి, బహుశా ఏకైక ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (59)దే పై చేయి అయింది. ఆమె దూకుడు ముందు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (78) వెలవెలబోయారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలో ఏబీసీ వార్తా సంస్థ వేదికగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షునిపై హారిస్‌ ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. దాదాపుగా ప్రతి అంశంలోనూ ట్రంప్‌ను చిత్తు చేశారు. 

ఆమె పక్కాగా హోం వర్క్‌ చేసి వచి్చన తీరు డిబేట్‌లో అడుగడుగునా కని్పంచింది. తొలుత కాస్త తడబడ్డా డిబేట్‌ సాగుతున్న కొద్దీ హారిస్‌ దూకుడు కనబరిచారు. పదునైన పంచ్‌లతో, టైమ్లీ వన్‌ లైనర్లతో ఎక్కడికక్కడ ట్రంప్‌ను ఇరుకున పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మొదలుకుని విదేశీ విధానం, వలసలు, అబార్షన్ల దాకా ప్రతి అంశం మీదా చర్చను తను కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు. 

పూర్వాశ్రమంలో లాయర్‌ అయిన హారిస్‌ వాదనా పటిమ ముందు ట్రంప్‌ నిలువలేకపోయారు. చాలావరకు ఆమె ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికే పరిమితమయ్యారు. తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్‌ ఓ ఆటాడుకోవడం తెలిసిందే. ట్రంప్‌ పచ్చి అబద్దాలు చెప్పినా బైడెన్‌ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు. పైగా ప్రసంగం మధ్యలో పదేపదే ఆగుతూ, పదాల కోసం తడుముకుంటూ, వయోభారంతో వణుకుతూ అభాసుపాలయ్యారు. 

ఈ దారుణ వైఫల్యంతో చివరికి పోటీ నుంచే బైడెన్‌ తప్పుకోవాల్సి వచి్చంది. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులోకి వచ్చిన హారిస్‌ మాత్రం తాజా డిబేట్లో ట్రంప్‌కు చెమటలు పట్టించారు. ‘‘మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపూ రెండు భిన్నమైన వాదనలు విన్నారు. ఒకటి భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నా వాదన. రెండోది గతం గురించి మాత్రమే మాట్లాడిన, దేశాన్ని వెనక్కే తీసుకెళ్లజూస్తున్న ట్రంప్‌ వాదన’’ అంటూ డిబేట్‌ను అంతే ప్రభావవంతంగా ముగించారు హారిస్‌.

అబార్షన్‌పై హారిస్‌ 
→ ట్రంప్‌ గెలిస్తే అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తెస్తారు. 
→ గర్భధారణలు, అబార్షన్లను ప్రభుత్వం వేయి కళ్లతో గమనిస్తుంటుంది. 
→ అమెరికన్ల శరీరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోరాదన్నదే నా వైఖరి. 
→ ట్రంప్‌ మాత్రం మహిళల శరీరాలపై హక్కులు ప్రభుత్వాలవేనంటున్నారు.

ట్రంప్‌ 
→ అబార్షన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నదే నా విధానం. 
→ అదిప్పటికే అమల్లో ఉంది. కనుక దీనిపై అసలు గొడవ గానీ, భిన్నాభిప్రాయాలు గానీ లేవు. 
→ అంతే తప్ప నేనేమీ అబార్షన్లను నిషేధించబోవడం లేదు. 
→ ఈ విషయంలో హారిస్‌ చెప్పేవన్నీ అబద్ధాలే.

ఎన్నికల ర్యాలీలపై
హారిస్‌ 
→ ట్రంప్‌ ఎన్నికల ర్యాలీలు ఆద్యంతం పరమ బోరుగా సాగుతున్నాయి.
→ జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఆయన ఘోరంగా విపలమవుతున్నారు. 
→ విండ్‌ మిల్లుల వల్ల క్యాన్సర్‌ వస్తుంది వంటి కామెంట్లతో అభాసుపాలవుతున్నారు. 
→ ట్రంప్‌ ప్రసంగం వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.

ట్రంప్‌ 
→ అన్నీ శుద్ధ అబద్ధాలు. బైడెన్‌–హారిస్‌ విధానాలతో అమెరికా అన్ని రంగాల్లోనూ కుదేలవుతోంది. అందుకే అమెరికన్లు పాత రోజులను కోరుకుంటున్నారు.
→ దాంతో నా ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. 
→ వాటికి అమెరికా చరిత్రలోనూ అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. 
→ హారిస్‌ తన ర్యాలీలకు డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు.

ఆర్థిక వ్యవస్థపై
ట్రంప్‌: ఈ విషయంలో నేనేం చేయబోతున్నదీ అందరికీ తెలుసు. నా హయాంలో కరోనా కల్లోలాన్ని తట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గొప్పగా మలిచా. దాన్ని మరోసారి చేసి చూపిస్తా. పన్నులకు భారీగా కోత పెడతా. హారిస్‌ మార్క్సిస్టు. మార్క్సిస్టు తండ్రి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విధానాల్లో ఆమె ఇప్పుడు నా భాషనే మాట్లాడుతున్నారు. కానీ గెలిచారంటే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారు. బైడెన్‌కు, ఆమెకు తేడా లేదు. 

హారిస్‌: నేను బైడెన్‌నూ కాను, ట్రంప్‌ను అంతకన్నా కాను. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తా. ఉత్త మాటలే తప్ప నిజానికి ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ట్రంప్‌ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. తన క్షేమం తప్ప ఆయనకు మీరెవరూ పట్టరు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచి్చన నాకు ఆర్థికంగా దేశానికి ఏం కావాలో బాగా తెలుసు.

వలసలపై
ట్రంప్‌ 
సరిహద్దుల నుంచి లక్షలాది మంది చొరబడుతున్నారంటే వలసల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న హారిసే ప్రధాన కారణం. వాళ్లు మన పెంపుడు జంతువులను కూడా తినేస్తున్నారు. ఈ చొరబాట్లు అమెరికాకు చాలా చేటు చేస్తాయి.

హారిస్‌ 
ట్రంప్‌ వల్లే వలసల బిల్లు బుట్టదాఖలైందని విమర్శించడం మినహా ఈ అంశంపై పెద్దగా ఏమీ మాట్లాడలేదు. వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై అమెరికన్లే పెదవి విరుస్తున్న నేపథ్యంలో వాటిపై వ్యూహాత్మక మౌనం పాటించారు.

యుద్ధాలు, విదేశీ వ్యవహారాలపై... 
ట్రంప్‌ 
→ నేను గెలిస్తే ఉక్రెయిన్‌ యుద్ధానికి ఒక్క రోజులో ముగింపు పలుకుతా. నేను ప్రెసిడెంట్‌గా ఉంటే యుద్ధం జరిగేదే కాదు. 
(ఉక్రెయిన్‌ గెలవాలనుకుంటున్నారా అన్న మోడరేటర్ల ప్రశ్నకు బదులు దాటవేశారు. పైగా యుద్ధానికి మిలియన్ల మంది బలయ్యారని అవాస్తవాలు చెప్పారు) 
→ 2021లో అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సందర్భం. 
→ ఇజ్రాయెల్‌ను హారిస్‌ ద్వేషిస్తారు. హారిస్‌ గెలిస్తే రెండేళ్లలోనే ఇజ్రాయెల్‌ సర్వనాశనం ఖాయం. అరబ్బులన్నా ఆమెకు ద్వేషమే.
హారిస్‌ 
→ అఫ్గాన్‌ నుంచి వైదొలగాలన్న బైడెన్‌ నిర్ణయం నాటి పరిస్థితుల్లో పూర్తిగా సబబే. ట్రంప్‌ తాలిబన్లతో అత్యంత బలహీన ఒప్పందం చేసుకున్నారు.
→ నియంతలంటే ట్రంప్‌కు మహా ఆరాధన.
→ నేను ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తానన్నది పచ్చి అబద్ధం. యూదు రాజ్యాన్ని మొదటినుంచీ సమర్థిస్తున్నా. అక్టోబర్‌ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్‌కు స్వీయరక్షణకు అన్ని హక్కులూ ఉన్నాయి. కానీ అమాయక పాలస్తీనియన్లు భారీ సంఖ్యలో యుద్ధానికి బలవుతున్నారన్నది కూడా వాస్తవమే. కనుక యుద్ధం తక్షణం ఆగాలి. కాల్పుల విరమణ, బందీల విడుదలే అందుకు మార్గం. దానికోసం కృషి చేస్తా.

2020 ఎన్నికల ఫలితాలపై
ట్రంప్‌: వాటిలో నిజమైన విజేతను నేనే. క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడితో నాకు సంబంధం లేదు. 
హారిస్‌: అమెరికా చరిత్రపై చెరగని మచ్చ ఏదన్నా ఉంటే అది కాపిటల్‌ హిల్‌పై దాడే. దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి.  

ట్రంప్‌పై హారిస్‌ పంచ్‌లు 
→ ట్రంప్‌ ఓ బలహీన నాయకుడు. 
తప్పుడు నేత. ఆయన్ను చూసి ప్రపంచ దేశాధినేతలంతా నవ్వుతున్నారు. 
→ అధ్యక్ష పదవికి ట్రంప్‌ కళంకమని ఆయనతో కలిసి పని చేసిన సైనిక ఉన్నతాధికారులే అంటున్నారు. 
→ ట్రంప్‌ అంటేనే అబద్ధాలు, అభూత కల్పనలు. ఈ డిబేట్లో కూడా ఆయన చేసేదదే. 
→ ట్రంప్‌ ఎంతసేపూ తన గురించే మాట్లాడతారు. ప్రజలు ఆయనకు అసలే పట్టరు. దేశానికి కావాల్సింది ప్రజల కోసం పాటుపడే నాయకుడే తప్ప ట్రంప్‌ వంటి స్వార్థపరుడు కాదు. 
→ ఆయన 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. 8.1 కోట్ల మంది ఆయనకు అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికారు (బైడెన్‌కు ఓటేసిన వారి సంఖ్యను ఉటంకిస్తూ). దాన్ని ట్రంప్‌ ఇప్పటికీ అస్సలు జీరి్ణంచుకోలేకపోతున్నారు.

హారిస్‌కే 63 శాతం మంది ఓటు 
→ డిబేట్‌లో ట్రంప్‌ను హారిస్‌ చిత్తు చేశారని సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ నిర్వహించిన ఫ్లాష్‌ పోల్‌లో 63 శాతం మంది పేర్కొన్నారు! 
→ ట్రంప్‌కు బాగా అనుకూలమని పేరున్న ఫాక్స్‌ న్యూస్‌ కూడా డిబేట్‌ విజేత హారిసేనని అంగీకరించడం విశేషం. 
→ చర్చకు వేదికైన ఏబీసీ న్యూస్‌ అభ్యర్థులిద్దరి వ్యాఖ్యలు, ప్రకటనలను లైవ్‌లో అప్పటికప్పుడు ఫ్యాక్ట్‌ చెక్‌ చేసింది.

ట్రంప్‌ చెప్పిన వాటిలో చాలావరకు అవాస్తవాలేనని తేలడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement