రక్షణ ‘ఫిక్స్‌డ్‌’.. రాబడి కాదు! | Investments in fixed deposits cannot be treated as financial assets | Sakshi
Sakshi News home page

రక్షణ ‘ఫిక్స్‌డ్‌’.. రాబడి కాదు!

Published Mon, Oct 17 2022 12:40 AM | Last Updated on Mon, Oct 17 2022 1:06 PM

Investments in fixed deposits cannot be treated as financial assets - Sakshi

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఎంతో సురక్షితం. ఎక్కువ మంది ఇలానే భావిస్తుంటారు. రాబడి తక్కువే అయినా, భద్రత పాళ్లు ఎక్కువ కదా అన్న భరోసా వారిది. అందుకే ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. గతంలో మాదిరి ఇప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి డిపాజిట్‌ చేయాల్సిన అవసరం కూడా తప్పింది. ఉన్నచోట నుంచే నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ డిపాజిట్‌ చేసుకోవడం, ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకోవడం అందుబాటులోకి వచ్చాయి.

దీంతో ఎఫ్‌డీ మరింత సౌకర్యవంతంగా మారిందని చెప్పుకోవాలి. ఒకవేళ బ్యాంకు సంక్షోభం పాలైనా.. రూ.5 లక్షల వరకు తిరిగి చెల్లించే ఆర్‌బీఐ ‘డిపాజిట్‌ క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌’ ఉంది. కానీ, ఇవన్నీ నాణేనికి అనుకూల ముఖమే. రెండో వైపు తిప్పి చూస్తే.. అసలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రాబడి వస్తుందా..? ద్రవ్యోల్బణం, పన్ను పోను మిగిలేది ఎంత? అసలు ఇది మెరుగైన పెట్టుబడి సాధనమేనా..? ఈ అంశాలన్నీ చర్చించే కథనమే ఇది.

ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) నుంచి తమ పెట్టుబడులను ఇతర సాధనాల వైపు మళ్లిస్తుండడాన్ని పరిశీలించొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో డెట్‌ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్‌ ఫండ్స్‌ వైపు వారు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలను గమనించాలి. ఇలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు దూరంగా వెళ్లడానికి కారణాలను చూస్తే.. ఒకటి వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, రెండోది ఇన్వెస్టర్లలో వివిధ సాధనాలు, వాటిల్లోని రిస్క్, రాబడుల పట్ల పెరుగుతున్న అవగాహనే.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఎన్నో తరాల నుంచి నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉంటూ వస్తోంది. కానీ, టెక్నాలజీ అందుబాటు, పెట్టుబడులకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచుతున్నాయి. దీంతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులతో పోల్చి చూసుకునే వారు పెరుగుతున్నారు. అందుకే ఇతర సాధనాలతో పోలిస్తే నేడు ఎఫ్‌డీలు అంత ఆకర్షణీయమైనవిగా ఇన్వెస్టర్లకు అనిపించడం లేదు.  

నికర రాబడి సున్నా..
ఏ రాబడికి అయినా ముందు చూడాల్సింది ద్రవ్యోల్బణమే. ఇది పోను మిగులు రాబడి ఎంత అన్నదే ఇన్వెస్టర్‌కు ప్రామాణికం అవుతుంది. ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వివిధ కాల వ్యవధుల ఆధారంగా 2.50 శాతం నుంచి గరిష్టంగా 7 శాతం వరకు ఉన్నాయి. కానీ, సెప్టెంబర్‌ నెలకు సంబంధించి వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్‌) 7.3 శాతంగా ఉంది. అంటే ఇంతకుమించి వడ్డీ రేటు ఉంటేనే అసలు రాబడి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. అంతెందుకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

ఇలా చూసినా 7 శాతం వడ్డీనిచ్చే ఎఫ్‌డీపై నికర రాబడి 0.3 శాతమే అవుతుంది. మరింత వివరంగా చూస్తే.. ఏడాది ఎఫ్‌డీపై ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తున్న రేటు 5.65 శాతమే. అంటే ద్రవ్యోల్బణం కంటే ఒక శాతం తక్కువ. కెనరా బ్యాంకు, పీఎన్‌బీ బ్యాంకులు సైతం 5.5 శాతం రేటును ఇస్తున్నాయి. ప్రైవేటు రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులోనూ ఏడాది కాల ఎఫ్‌డీపై రేటు 5.75 శాతానికి మించి లేదు. రెండేళ్ల కాల వ్యవధికి చూసినా.. కెనరా బ్యాంకు 5.60 శాతం, యూనియన్‌ బ్యాంకు 5.45 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు 6.50 శాతం చొప్పున ఆఫర్‌ చేస్తున్నాయి.

మూడేళ్ల ఎఫ్‌డీలపై ఎస్‌బీఐ ఇస్తున్న రేటు 5.60 శాతం. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు 6.50 శాతం, యాక్సిస్‌ బ్యాంకు 5.70 శాతం చొప్పున ఆఫర్‌ చేస్తున్నాయి. ఇక ఐదేళ్ల కాల ఎఫ్‌డీలపై ఎస్‌బీఐలో రేటు 5.65 శాతం ఉంటే, యాక్సిస్‌ బ్యాంకు, కెనరా బ్యాంకులో 5.75 శాతం చొప్పున ఉంది. అంటే ఐదేళ్ల వరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు, ఆర్‌బీఐ అంచనా వేస్తున్న ద్రవ్యోల్బణ రేటు 6.7 శాతం కంటే తక్కువే ఉన్నాయి. అంటే ఈ మేరకు ఎఫ్‌డీపై నష్టపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇక పన్ను పరిధిలో ఉన్న వారికి ఎఫ్‌డీలతో మరింత నష్టమే అని చెప్పుకోవాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే 7 శాతం ఎఫ్‌డీ రేటు రాబడి నుంచి పన్ను చెల్లించగా మిగిలే నికర రాబడి 4.9 శాతమే. ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉండడంతో నికరంగా 2 శాతం నష్టాన్ని ఎఫ్‌డీ రూపంలో తెచ్చుకున్నట్టు అవుతుంది.

రక్షణ ఒక్కటే కాదు..
నిజానికి పెట్టుబడి ఏదైనా రక్షణ పాళ్లు ఎంతన్నది చూడాలి. కానీ, అదే సమయంలో రాబడి కూడా చూడాలి. అసలు రాబడి లేకుండా, రక్షణ ఉన్న సాధనం వల్ల ఒరిగేదేమి ఉంటుంది? ఎఫ్‌డీలు లిక్విడ్‌ సాధనం. అవసరమైనప్పుడు వేగంగా రద్దు చేసుకుని నగదుగా మార్చుకోవచ్చు. స్వల్పకాల అవసరం ఏర్పడితే అదే ఎఫ్‌డీపై రుణం (లోన్‌ ఎగైనెస్ట్‌ డిపాజిట్‌/ఓవర్‌డ్రాఫ్ట్‌) తీసుకోవచ్చు. అదే సమయంలో ఎఫ్‌డీలు ఒక్కటే లిక్విడ్‌ సాధనం అనుకోవడానికి లేదు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా లిక్విడ్‌ సాధనాలే. మూడు రోజుల వ్యవధిలో నగదుగా మార్చుకోవచ్చు. డెట్‌ సాధనా ల్లో ద్రవ్యోల్బణం మించి రాబడి అందుకోవచ్చు. మూడేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణ ప్రభావం పోను మిగిలిన రాబడిపైనే పన్ను పడుతుంది. ఫండ్స్‌లో వైవిధ్యానికి చోటు కల్పించుకోవచ్చు.  

లక్ష్యానికి అనుగుణంగానే..
కాల వ్యవధికి అనుకూలమైన సాధనం ఎంపిక చేసుకోవడం పెట్టుబడికి కీలకం అవుతుంది. వ్యవధి మూడేళ్లకు మించి లేనప్పుడు ఈక్విటీలను ఎంపిక చేసుకోకపోవడమే సరైనది. 3–5 ఏళ్ల కాలానికి హైబ్రిడ్‌ పథకాలు, డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ పథకాలు అనుకూలం. 5–10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ పథకాలు, ఈటీఎఫ్‌లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు, 10 ఏళ్లకు మించిన దీర్ఘకాలం కోసం స్మాల్‌క్యాప్‌ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్లలోపు అయితే రాబడి పెద్దగా లేకపోయినా డెట్‌ సాధనాలకే పరిమితం కావాలి. ఇక అత్యవసర నిధి అయితే ఎఫ్‌డీలు, లిక్విడ్‌ ఫండ్స్, లో డ్యురేషన్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

ప్రత్యామ్నాయాలు
ఎఫ్‌డీలకు ప్రత్యామ్నాయాలు చాలానే ఉన్నాయి. దీనికంటే ముందు ఎఫ్‌డీల్లో పెడుతున్న మొత్తం దేనికి ఉద్దేశించినది? అని ప్రశ్నించుకోవాలి. అత్యవసర నిధి అయితే ఎఫ్‌డీలలో పెట్టుకోవడం సరైనదే అవుతుంది. అత్యవసరం చెప్పి రాదు. ఏ సమయంలో అయినా వెంటనే వెనక్కి తీసుకోవడానికి వెసులుబాటుతో ఉండాలి. ఇక్కడ రాబడి ప్రామాణికం కాదు. కనుక ఎమర్జెన్సీ ఫండ్‌ను ఎఫ్‌డీలలో పెట్టుకోవచ్చు. అలాగే, ఏడాది కాలం కోసం కూడా ఎఫ్‌డీలను పరిశీలించొచ్చు. ఏడాదికి మించిన కాలవ్యవధి కోసం ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు.. భిన్న కాలాలతో కూడిన వైవిధ్యమైన డెట్‌ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, డెట్‌ ఈక్విటీ కలగలిసిన హైబ్రిడ్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌లు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌
ఇవి ఏడాది నుంచి మూడేళ్ల కాల మనీ మార్కెట్, డెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో సగటు వార్షిక రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుందని ఆశించొచ్చు. ఇంతకంటే మెరుగైన రాబడులు, తక్కువ రాబడులకు అవకాశం లేకపోలేదు. ఎంపిక చేసుకునే పథకాల పనితీరు ఆధారంగా రాబడి ఉంటుందని మర్చిపోవద్దు. రెండు నుంచి మూడేళ్ల కాలానికి వీటిని ఎంపిక చేసుకోవచ్చు.  

మీడియం టు లాంగ్‌ డ్యురేషన్‌
నాలుగు నుంచి ఏడేళ్ల కాల వ్యవధి కలిగి సాధనాల్లో పెట్టుబడులు పెడతాయి. వీటిల్లోనూ రాబడులు ఇంచుమించుగా మీడియం డ్యురేషన్‌ ఫండ్స్‌ స్థాయిలోనే ఉంటాయి.  

లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌  
ఏడేళ్లకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. చారిత్రక రాబడులు 6 శాతం నుంచి 18 శాతం మధ్య ఉన్నాయి.  

ఇవి గుర్తు పెట్టుకోవాలి..
డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడి, రాబడికి గ్యారంటీ ఉండదు. దీన్నే క్రెడిట్‌ రిస్క్‌ అంటారు. అంటే ఫండ్స్‌ తీసుకెళ్లి ఇన్వెస్ట్‌ చేయగా, ఆయా పత్రాలకు సంబంధించి తిరిగి చెల్లింపులు జరగకపోవడం. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, అస్థితరల్లో వడ్డీ రేట్ల రిస్క్‌ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లిక్విడిటీ రిస్క్‌ కూడా ఎదురుకావచ్చు. నాణ్యమైన డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే పథకాల్లో లిక్విడిటీ రిస్క్‌ దాదాపుగా ఉండదనే చెప్పుకోవచ్చు. కానీ, రాబడి కోసం రిస్క్‌ తీసుకుని డెట్‌లో పెట్టుబడులు పెట్టడం కంటే.. ఈక్విటీలను ఆశ్రయించడం మెరుగైన మార్గం అవుతుంది. ఎందుకంటే ఎలానూ రిస్క్‌కు సిద్ధ పడ్డాం కనుక, ఈక్విటీల్లో మెరుగైన రాబడిని సొంతం చేసుకోవచ్చు. ఆయా విషయాల్లో నిపుణుల సలహాలను తీసుకొని నడచుకోవడం వల్ల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

కార్పొరేట్‌/ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్లు
కార్పొరేట్, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. వీటిపై 7.5–8.5% మధ్య రాబడులు ఆశించొచ్చు. ఏఏఏ రేటెడ్‌ కలిగిన బాండ్లనే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రాబడి మాటేమో కానీ, పెట్టుబడి కూడా సంక్షోభంలో పడిపోతుంది.  

మీడియం డ్యురేషన్‌ ఫండ్స్‌
ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధితో ఉండే డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఎంపిక చేసుకునే పథకాల ఆధారంగా ఈ విభాగంలో మూడేళ్ల కాలానికి వార్షిక సగటు కనిష్ట రాబడి 3 శాతంగాను, గరిష్ట రాబడి 17 శాతం వరకు ఉంది. కనుక ఎంపిక చేసుకునే పథకం ఇక్కడ ప్రామాణికం అవుతుంది. ఏడు శాతానికి పైనే రాబడి ఆశించొచ్చు.

పీపీఎఫ్‌
అసంఘటిత రంగంలోని వారు, 15–20 ఏళ్ల కాల లక్ష్యాలకు పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో చేసే పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇందులో వచ్చే రాబడులపైనా పన్ను ఉండదు. అన్ని విధాలుగా పన్ను ప్రయో జనం కలిగిన సాధనం. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%గా ఉంది.  

వీపీఎఫ్‌
ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో కింద భవిష్యనిధి స్కీమ్‌ ఉంటుంది. దీనికి అదనంగా స్వచ్ఛంద ప్రావిడెంట్‌ ఫండ్‌ (వీపీఎఫ్‌) పేరుతో అదనపు పెట్టుబడి చేసుకోవచ్చు. పీఎఫ్‌కు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌ పెట్టబడులకూ వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి పీపీఎఫ్‌ బ్యాలన్స్‌పై 8.10 శాతం వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. కాకపోతే వీపీఎఫ్‌లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్‌ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాతే ఉపసంహరించుకోగలరు. ఒకవేళ ఉద్యోగానికి రాజీనామా చేసినా, రిటైర్‌ అయినా అటువంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌తోపాటు వీపీఎఫ్‌ కూడా తీసేసుకోవచ్చు.

డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌
డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌ లేదా బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌తో ఒక సానుకూలత ఉంది. మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్టు డెట్‌ నుంచి ఈక్విటీకి, ఈక్విటీ నుంచి డెట్‌కు పెట్టుబడులను బదలాయిస్తుంటాయి. తద్వారా రిస్క్‌ తగ్గించి, అధిక రాబడులను ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. 9–18 శాతం మధ్య దీర్ఘకాలంలో వార్షిక రాబడులను వీటి నుంచి ఆశించొచ్చు.

హైబ్రిడ్‌ ఫండ్స్‌
ఐదేళ్లు అంతకుమించిన కాలానికి హైబ్రిడ్‌ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్‌ మెరుగైనవి. ద్రవ్యోల్బణం, పన్ను బాధ్యతలు తీసేసి చూసినా.. ఈక్విటీ ఫండ్స్‌లో రాబడి మెరుగ్గానే ఉంటుందని అందుబాటులోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కన్జర్వేటివ్‌ హబ్రిడ్‌ ఫండ్స్, అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ అని రెండు రకాలు ఉన్నాయి. ఈక్విటీల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసేవి అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ పథకాలు. నూరు శాతం ఈక్విటీ రిస్క్‌ వద్దనుకునే వారు, ఈక్విటీ డెట్‌ కలయిక కోరుకునే వారికి ఇవి అనుకూలం. వీటిల్లో వార్షిక రాబడి దీర్ఘకాలంలో 12–18 శాతం మధ్య ఆశించొచ్చు.

వీటికి ఈక్విటీ పథకాలకు మాదిరే పన్ను విధానం వర్తిస్తుంది. లాభాలు స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఈక్విటీలకు 10–25% మధ్య కేటాయింపులు చేస్తాయి. వీటిల్లో రాబడులకు డెట్‌ ఫండ్స్‌ పన్ను విధానం వర్తిస్తుంది. రిస్క్‌ తక్కువ తీసుకునే వారికి ఇవి అనుకూలం. కొంత భాగం ఈక్విటీలకు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో వార్షిక రాబడి 9–12% మధ్య ఉంటుంది. ఇక బ్యాలన్స్‌డ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ అన్నవి ఈక్విటీలు, డెట్‌కు సమానంగా కేటాయింపులు చేస్తుంటాయి.  

లార్జ్‌క్యాప్‌/మిడ్‌క్యాప్‌/స్మాల్‌క్యాప్‌
లార్జ్‌క్యాప్‌ కంపెనీలు ఎలాంటి మార్కెట్‌ పరిస్థితులను అయినా, ఆర్థిక సంక్షోభాలను అయినా తట్టుకోగలవు. ఎందుకంటే ఆయా రంగాల్లో అవి పెద్ద స్థాయికి చేరినవి కనుక.  రిస్క్‌ తక్కువగా ఉండాలని భావించే వారు ఐదేళ్లు అంతకుమించిన కాలానికి లార్జ్‌క్యాప్‌ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. సగటు వార్షిక రాబడులు 12–18 శాతం మధ్య ఉంటాయి. మోస్తరు రిస్క్‌ తీసుకునే వారు మిడ్‌క్యాప్‌ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో రాబడులు 12–22 శాతం మధ్య ఉంటాయి. స్మాల్‌క్యాప్‌ పథకాలను పదేళ్లు అంతకుమించిన కాలానికి, అధిక రిస్క్‌ ఉన్నా ఫర్వాలేదు అధిక రాబడులు కోరుకునే వారు పరిశీలించొచ్చు. వీటిల్లో రాబడులను 18 శాతానికి పైన ఆశించొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement