అగ్రిగోల్డ్ బాండ్ చూపిస్తున్న బాధితురాలు
సాక్షి, గరుగుబిల్లి (విజయనగరం): బిడ్డల చదువులు.. పిల్లల పెళ్లిళ్లు..తదితర అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఉన్నంతలో రూపాయి, రూపాయి కూడబెట్టి ..కాస్త ఎక్కువ రాబడి వస్తుందన్న ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడి పెట్టిన ఎంతోమంది నిలువునా మునిగిపోయారు. లాభాలు ఇస్తుందనుకున్న ఆ సంస్థ అర్ధంతరంగా బోర్డు తిప్పేయడంతో వేలాదిమంది డిపాజిటర్లు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అపారంగా ఆస్తులున్నా పొదుపరులకు ఆ సంస్థ ఒక్క పైసాకూడా విదల్చలేదు.
ఆదుకుంటామని చెప్పిన గత టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆ సంస్థకు చెందిన విలువైన ఆస్తులను కబళించేందుకు కుయుక్తులు పన్నారే తప్ప... బాధితుల గోడు పట్టించుకోలేదు. చివరకు కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఒక దశలో న్యాయం జరుగుతుందని ఆశించి, నాటి పాలకులు ఏదో చేస్తారనే భ్రమపడిన బాధితులు వారు చెప్పిన విధంగా గత ఏడాది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ వివరాలు అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేయించిన ఎంతోమంది ఏజెంట్లు బాధితుల వేదనలు వింటూ, వారి ఛీత్కారాలు భరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కొంతమంది బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు.
నేనున్నానంటూ...
కష్టాల కడలిలో చిక్కుకుపోయినవారికి గట్టున చేర్చే నావ ఎదురొచ్చినట్లుగా.. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నాంటూ కనిపించారు. రాష్ట్రంలో ప్రజాసంకల్పయాత్ర చేసిన సమయంలో ఆయనకు అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము మోసపోయిన తీరును వివరించారు. వారి ఆవేదనను అర్ధం చేసుకున్న జగన్ మోహన్‌రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే మేలు చేస్తారనిని హమీ ఇచ్చారు. ఈ మేరకు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కోసం రూ.1,150 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా రూ.20వేల లోపు డిపాజిట్లు వేసిన వారందరికీ ప్రభుత్వ పక్షాన చెల్లింపులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
అఖండమైన ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ఆయన పాదయాత్రలోను, ఎన్నికల సమయంలోను ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్లను చెల్లించేందుకు వైఎస్సార్‌సీపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేయలేని పనిని సీఎంగా పదవి చేపట్టిన కొద్ది రోజులలోనే జగన్ మోహన్‌రెడ్డి చేయడంపై బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముప్పతిప్పలు పెట్టారు..
అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం చేయమని కోర్టు చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సరికదా బాధితులను పోలీస్‌స్టేషన్‌లకు, కోర్టులకు రమ్మంటూ ముప్పతిప్పలు పెట్టారు. ఆఖరికి ఎన్నికల సమయంలోనైనా చేస్తారనుకుంటే అగ్రిగోల్డ్ ఆస్తులను కబళించే ప్రయత్నం చేశారే తప్ప బాధితుల గోడు వినలేదు. ఆ సమయంలో పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల వేదన విన్న జగన్‌మోహన్‌రెడ్డి ..ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా రూ.20 వేల లోపు డిపాజిట్లు వేసిన వారందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేయడం అభినందనీయం.
- ఉరిటి రామారావు, వైఎఆర్‌సీపీ మండల కన్వీనర్,గరుగుబిల్లి.
న్యాయం జరగలేదు
పిల్లల చదువులు,పెళ్లిళ్లి కోసం అగ్రిగోల్డ్ సంస్థలో దాచుకొన్న సొమ్ములను తిరిగి ఇప్పించడంలో కోర్టులు కూడా ఏమీ చేయలేకపోయాయి. ఆ సంస్థకున్న ఆస్తులు ఏమయ్యాయో కానీ బాధితులు మాత్రం బాధల్లోనే ఉన్నారు. సీఎం జగన్ రూ.20 వేల లోపున్న డిపాజిట్లను చెల్లిస్తానని చెప్పడం బాగుంది.
– మండల శంకరరావు, ఎంపీటీసీ సభ్యుడు, తోటపల్లి
Comments
Please login to add a commentAdd a comment