![Telangana Grameena Bank Reclaim PMGKY Amount From Wrong Account - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/29/tgb.jpg.webp?itok=7JJDFFuj)
హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు లక్షలకుపైగా జన్‌ధన్ ఖాతాల్లో కేంద్ర సాయం కింద జమ చేసిన నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ) వెనక్కి తీసుకుంది. పొరపాటు వల్ల అనర్హుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడంతో టీజీబీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మూడు లక్షలపైగా అకౌంట్ల నుంచి రూ. 16 కోట్ల నగదును తిరిగి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్‌డౌన్ వేళ పేద మహిళలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద కేంద్రం మూడు నెలల పాటు రూ. 500 చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీజీబీ అధికారులు ఏప్రిల్ మొదటివారంలో జన్‌ధన్ అకౌంట్లలో మొదటి నెల నగదును జమ చేశారు.
అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో 9 లక్షలకు పైగా జన్‌ధన్ ఖాతాలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది మాత్రమే రూ. 500 సాయం పొందడానికి అర్హుత కలిగి ఉన్నాయి. ఆ తర్వాత తప్పిదాన్ని గుర్తించిన బ్యాంక్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. దాదాపు మూడు లక్షలకు పైగా అకౌంట్ల నుంచి రూ. 16 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే ఇప్పటికే లక్ష మందికి పైగా అనర్హులు కూడా ఈ డబ్బును విత్ డ్రా చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసేందుకు బ్యాంక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ పొరపాటు ఎక్కడ జరిగిందనే దానిపై అంతర్గత విచారణ కూడా చేపట్టారు. ‘నిబంధనల ప్రకారం 2014 ఆగస్టు 1 తర్వాత తెరిచిన జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. కానీ పొరపాటు వల్ల అన్ని జీరో అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఈ తప్పిదాన్ని గుర్తించి రూ. 16 కోట్లు వెనక్కి తీసుకున్నాం’ అని టీజీబీ జనరల్ మేనేజర్ మహేష్ తెలిపారు.
చదవండి : అన్నపూర్ణ మన తెలంగాణ : కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment