Jan Dhan accounts
-
3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి
హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు లక్షలకుపైగా జన్‌ధన్ ఖాతాల్లో కేంద్ర సాయం కింద జమ చేసిన నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ) వెనక్కి తీసుకుంది. పొరపాటు వల్ల అనర్హుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడంతో టీజీబీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మూడు లక్షలపైగా అకౌంట్ల నుంచి రూ. 16 కోట్ల నగదును తిరిగి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్డౌన్ వేళ పేద మహిళలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) కింద కేంద్రం మూడు నెలల పాటు రూ. 500 చొప్పున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీజీబీ అధికారులు ఏప్రిల్ మొదటివారంలో జన్‌ధన్ అకౌంట్లలో మొదటి నెల నగదును జమ చేశారు. అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో 9 లక్షలకు పైగా జన్‌ధన్ ఖాతాలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాదాపు 5.5 లక్షల మంది మాత్రమే రూ. 500 సాయం పొందడానికి అర్హుత కలిగి ఉన్నాయి. ఆ తర్వాత తప్పిదాన్ని గుర్తించిన బ్యాంక్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. దాదాపు మూడు లక్షలకు పైగా అకౌంట్ల నుంచి రూ. 16 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే ఇప్పటికే లక్ష మందికి పైగా అనర్హులు కూడా ఈ డబ్బును విత్ డ్రా చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసేందుకు బ్యాంక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ పొరపాటు ఎక్కడ జరిగిందనే దానిపై అంతర్గత విచారణ కూడా చేపట్టారు. ‘నిబంధనల ప్రకారం 2014 ఆగస్టు 1 తర్వాత తెరిచిన జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. కానీ పొరపాటు వల్ల అన్ని జీరో అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఈ తప్పిదాన్ని గుర్తించి రూ. 16 కోట్లు వెనక్కి తీసుకున్నాం’ అని టీజీబీ జనరల్ మేనేజర్ మహేష్ తెలిపారు. చదవండి : అన్నపూర్ణ మన తెలంగాణ : కేసీఆర్ కేసుల్లో దాపరికం లేదు: ఈటల -
జన్‌ధన్‌లోకి రూ. 65 వేల కోట్లు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 30 కోట్ల జనధన ఖాతాల్లో రూ.65వేల కోట్లు జమ అయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన్‌ధన్ యోజన పథకం ద్వారా దేశంలో ఇప్పటి వరకూ సుమారు 30కోట్ల కుటుంబాలకు పైగా జనధన అకౌంట్లను తెరిచారని ప్రధాని తెలిపారు. రేపటి(ఆగస్టు 28)తో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 30 కోట్ల జనధన ఖాతాల్లో రూ.65వేల కోట్లు జమ అయ్యాయని ప్రధాని వెల్లడించారు. దేశంలోని ప్రముఖ బ్యాంకులన్నీ ఇప్పటికే సర్వే నిర్వహించి జనధన ద్వారా సాధారణ పౌరుడు లబ్ధి పొందుతున్నారని తెలిపాయన్నారు. ఈ పథకం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఓ చర్చనీయ అంశంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అంతే కాకుండా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాలు కూడా ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు. వీటి వల్ల పేదప్రజలకు తమ జీవితాలపై భరోసా ఏర్పడుతుందని ప్రధాని వెల్లడించారు. -
ట్రెండ్ రివర్స్: ఆ ఖాతాల్లోకి వెయ్యి కోట్లు
జన్‌ధన్ అకౌంట్లలో నెలకొన్న విత్ డ్రాయల్ ట్రెండ్ రివర్స్ అయింది. ఈ ఖాతాల్లోకి దాదాపు వెయ్యి కోట్ల మేర డిపాజిట్లు వచ్చి పడి ఏప్రిల్ 5తో ముగిసిన వారానికి ఖాతాల్లో నగదు రూ.63,971.38 కోట్లగా నమోదైంది. ప్రధాన్ మంత్రి జన్‌ధన్ యోజన కింద ప్రారంభించబడిన ఈ అకౌంట్లలో మార్చి నెలలో నికర బ్యాలెన్స్ రూ.62,972.42 కోట్లగా ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ డేటాలో వెల్లడైంది. పెద్ద నోట్ల రద్దుతో డిసెంబర్ 7 వరకు ఈ అకౌంట్లలో డిపాజిట్లు రికార్డుస్థాయిల్లో నమోదయ్యాయి. అప్పడు రూ.74,610 కోట్లు వచ్చిచేరాయి. అనంతరం జన్‌ధన్ ఖాతాలపై కూడా అధికారులు తనిఖీలు విస్తృతంగా జరుపగా.. డిపాజిట్లు కొంతమేర క్షీణించాయి. ఈ బ్యాంకు అకౌంట్లను దుర్వినియోగానికి వాడితే, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రబుత్వం హెచ్చరించింది. ఈ అకౌంట్లలో నగదు డిపాజిట్ పరిమితిని కూడా రూ.50వేలుగానే నిర్దేశించింది. రద్దయిన పెద్ద నోట్లను జీరో అకౌంట్ ఖాతాల్లో జమచేసి, పన్నుల నుంచి తప్పించుకుంటున్నారని విచారణ సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ హెచ్చరికలతో ఆ అకౌంట్లలో డబ్బు భారీగా విత్ డ్రా కూడా అయింది. ప్రస్తుతం విత్ డ్రాయల్ ట్రెండ్ రివర్స్ అయి, మళ్లీ డిపాజిట్లు పెరిగాయి. -
జన్‌ధన్ భారమిది.. భరించాల్సిందే!
♦ జరిమానాల కొరడాపై ఎస్బీఐ స్పష్టీకరణ ♦ పునరాలోచనకు కేంద్రం నుంచి ఎటువంటి సూచనా అందలేదు.. ♦ వస్తే పరిశీలిస్తామని వెల్లడి ♦ జన్‌ధన్ అకౌంట్లపై భారం ఉండబోదని హామీ ముంబై: అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే జరిమానాలు విధించాలన్న నిర్ణయాన్ని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పూర్తిగా సమర్థించుకుంది. జన్‌ధన్ అకౌంట్ల నిర్వహణకు సంబంధించి బ్యాంక్‌పై భారం పెరిగిపోతోందని, ఈ నేపథ్యంలో జరిమానాల విధింపు తప్పదని స్పష్టం చేసింది. అయితే జన్‌ధన్ అకౌంట్లకు సంబంధించి మాత్రం ఇటువంటి పెనాల్టీలు ఉండబోవని వివరణ ఇచ్చింది. జరిమానాల విధింపు అంశాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నుంచి ఎటువంటి సూచనలూ తనకు ఇంకా అందలేదనీ, వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే పెనాల్టీ విధింపు పునఃప్రారంభ నిర్ణయంసహా, ఇతర కొన్ని బ్యాంకింగ్ సేవలపై సైతం చార్జీలను గత వారం ఎస్బీఐ సవరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని కూడా బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీలుసహా పలువురి నుంచి ఆయా నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఒక మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఈ సందర్భంగా తాజా చార్జీల అంశాన్ని ప్రస్తావించారు. ఆమె దీని గురించి మాట్లాడిన అంశాలను సంక్షిప్తంగా చూస్తే... తప్పలేదు... అందరికీ బ్యాంకింగ్ అకౌంట్లు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) అనండి లేదా జన్‌ధన్ అకౌంట్లు అనండి... ఇలాంటి 11 కోట్ల అకౌంట్లతో మాపై భారీ భారం ఉంది. ఈ అకౌంట్లను నిర్వహించడానికి మాకు కొన్ని చార్జీలు అవసరం. ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి మేము ఎన్నో మార్గాలను అన్వేషించాం. చివరకు చార్జీలను విధించక తప్పదన్న నిర్ణయానికి వచ్చాం. మా దగ్గరే అతి తక్కువ... అన్ని బ్యాంకులూ అకౌంట్ హోల్డర్లు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని నిర్దేశిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఎస్బీఐ మాత్రమే అతితక్కువ కనీస బ్యాలెన్స్‌ను అమలు చేస్తోంది. ఇక మా విశ్లేషణలో తేలిందేమిటంటే– మా బ్యాంకులోని అకౌంట్లలో అధికం నెలవారీగా రూ.5,000కుపైగా కనీస బ్యాలెన్స్‌ను కలిగి ఉన్నాయి. జరిమానాలకు సంబంధించి ఆయా అకౌంట్ హోల్డర్లు ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. ప్రతి దశలోనూ వ్యయమే... నగదు ముద్రణ నుంచి రవాణా, లెక్కింపు, భద్రతను కల్పించడం వరకూ ఇలా ప్రతిదశలోనూ వ్యయమవుతుంటుంది. ఏటీఎంల ఏర్పాటూ వ్యయంతో కూడినదే. కనుక మేము చార్జీలు విధించడం సమంజమేనని భావిస్తున్నాం. ప్రత్యామ్నాయాలు తప్పవు... కస్టమరు తప్పనిసరిగా తమ లావాదేవీలకు ప్రత్యామ్నాయ మార్గాలవైపు వెళ్లాలి. మొబైల్, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి. నిజానికి ఒక గృహస్తుడు నెలకు నాలుగుసార్లకన్నా ఎక్కువగా ఏటీఎంను వినియోగించాల్సిన అవసరం ఉంటుందని మేము భావించడం లేదు. ఇలాంటి అవసరం వ్యాపార వేత్తలకే ఉంటుంది. ఇలాంటి వారు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. చిన్న పరిశ్రమలకు భారీ రుణాలు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1.6 లక్షల కోట్ల రుణాలను బ్యాంక్ ఇప్పటివరకూ అందజేసింది. ఈ ఒక్క ఏడాదే రూ.10,000 కోట్ల రుణ మంజూరు చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,000 కోట్ల ముంద్రా రుణాలను ఇవ్వాలన్నది లక్ష్యం. రిటైల్ రంగానికి ప్రాధాన్యత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో దాదాపు 55 శాతం రిటైల్ విభాగం వాటా ఉంది. రిటైల్ వైపు మొగ్గుచూపడం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పెద్ద పరిశ్రమల తమ అవసరాలకు చిన్న పరిశ్రమలపై ఆధారపడే విషయం గమనార్హం. ఇక్కడ పెద్ద సంస్థలతో పాటు చిన్న సంస్థలకు రుణ అవసరాలు ఎంతో ఉంటాయి. ఎడాపెడా చార్జీల మోత... కొత్త ఖాతాదారులను రాబట్టుకునేందుకు వీలుగా నెలవారీ కనీస నగదు నిల్వల(ఎంఏబీ) వైఫల్యంపై చార్జీలు విధించడాన్ని 2012లో నిలిపివేశామని, వాటిని ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రవేశపెడుతున్నామని ఎస్బీఐ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఎంఏబీలో విఫలమైతే సేవింగ్స్ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీతోపాటు సేవా రుసుము విధింపు ఉంటుంది. కనిష్టంగా రూ.20,సేవా రుసుము విధిస్తారు. ఇక కరెంట్ ఖాతాదారులకు ఈ జరిమానా గరిష్టంగా రూ.500గా ఉంటుంది. దీంతోపాటు బ్యాంకు శాఖల్లో నెలకు మూడు నగదు డిపాజిట్లు మించినా కూడా చార్జీల వడ్డింపు తప్పదు. -
ఆ ఖాతాల నుండి భారీగా విత్ డ్రాయల్స్
-
రెండు వారాల్లో రూ.3,285కోట్లు డ్రా చేశారు
-
రెండు వారాల్లో రూ.3,285కోట్లు డ్రా చేశారు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వారానికి రూ.24వేలు కూడా డ్రా చేసుకోలేని పరిస్థితి. అలాంటిది కేవలం రెండు వారాల్లోనే దాదాపు రూ.3,285కోట్లను డ్రా చేసి ఐటీ అధికారులను అవాక్కయ్యేలా చేశారు. అది కూడా జన్ ధన్ ఖాతాలో నుంచి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత జన్ ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ అయిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ 14నాటికి జన్ ధన్ ఖాతాల్లో మొత్తం రూ.74,610కోట్లు ఉండగా అవికాస్తం పద్నాలుగు రోజులు గడిచిన తర్వాత రూ.71,037కోట్లకు తగ్గినట్లు ఆర్థికశాఖ సేకరించిన సమాచారం ప్రకారం తెలిసింది. మొత్తం రూ.3,285కోట్లను రెండు వారాల్లో డ్రా చేయడం గతంలో ఉన్న పరిస్థితుల కంటే ఇదే తొలిసారి అని ఆర్ధికశాఖ అధికారులు చెబుతున్నారు. -
వారి ఖాతాల్లో అవాక్కయ్యేన్ని కోట్లు
న్యూఢిల్లీ: ఎప్పుడు అరకొర మాత్రమే డబ్బు నిల్వ ఉండే జన్ ధన్ ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నివ్వెరపోయేంత డబ్బు జమైంది. కేవలం 45 రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.87వేల కోట్లకు ఆ ఖతాలు చేరినట్లు తేలింది. సాధారణంగా జన్ ధన్ ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు కంటే ముందున్న డబ్బుకంటే ఇది రెండింతలకంటే అదనం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు చెప్పారు. అంతేకాకుండా, చిన్నమొత్తాల్లో అంటే రూ.30 వేల నుంచి రూ.50వేల డబ్బును దాదాపు 4.86లక్షల ఖాతాల్లో జమచేయగా అది రూ.2,000కోట్లు అయినట్లు ఐటీ శాఖ అధికారుల వద్ద వివరాలు ఉన్నాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 23 మధ్య కాలంలో మొత్తం రూ.41,523కోట్ల మొత్తాన్ని 48లక్షల ఖాతాల్లో జమచేసినట్లు తెలిసింది. అంతకుముందు నవంబర్ 9నాటికి జన్‌ధన్ ఖాతాల్లో రూ.45,637 కోట్లు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం. 'జన్ ధన్ ఖాతాల్లో అంతకుముందున్న సొమ్ముకు రెట్టింపు జమ చేసినట్లు తెలిసింది. దీని వివరాలన్ని క్రోడికరించి ఖాతా కలిగిన వారు తప్ప మిగితా వారు జమ చేసినట్లు గుర్తిస్తే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం' అని కేంద్రంలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తొలి రెండు వారాల్లో జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు అమాంతం పెరిగాయని, ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయని పేర్కొన్నారు. -
భారీగా ఎగిసిన ఆ డిపాజిట్లు ఢమాల్!
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దుతో జన్ ధన్ ఖాతాల్లోకి వరదలా వచ్చి చేరిన డిపాజిట్లు ఒక్కసారిగా ఢమాల్ అన్నాయి. రూ.75 వేల కోట్ల మార్కుకు చేరువలో ఎగిసిన ఈ డిపాజిట్లు ఇటీవల తగ్గడం ప్రారంభమయ్యాయి. తుది గడువు దగ్గపడుతుండటంతో పాటు జన్ ధన్ అకౌంట్లకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకొస్తున్న నిబంధనలు, హెచ్చరికలతో ఈ ఖాతాలోకి నగదు వెల్లువ తగ్గినట్టు తెలుస్తోంది. పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన వెంటనే సామాన్యుల జన్ ధన్ అకౌంట్లోకి భారీగా రద్దైన నోట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరాయి. నవంబర్ 9న రూ.45,636 కోట్లగా ఉన్న ఈ అకౌంట్లో డిపాజిట్లు నవంబర్ 23 వరకు రూ.72,843 కోట్లకు ఎగిశాయి. తాజా గణాంకాల ప్రకారం ఈ అకౌంట్లలో డిపాజిట్లు నెమ్మదించాయని తెలిసింది. రూ.74,609 కోట్లు మాత్రమే డిపాజిట్ అయినట్టు గణాంకాలు పేర్కొన్నారు. అంతేకాక ట్రెండ్ కూడా రివర్స్ అయిందట. ఈ అకౌంట్ల నుంచి నగదును బయటికి వచ్చేస్తున్నట్టు వెల్లడవుతోంది. ఈ అకౌంట్లు దుర్వినియోగానికి వాడకుండా ఉండేందుకు జన్ ధన్ అకౌంట్ హోల్డర్స్ వివరాలను తమకు అందించాలని మొదటి సారి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సైతం బ్యాంకులను ఆదేశించింది. ఈ అకౌంట్లలో రూ.50వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తున్న వారి దగ్గర కేవైసీ తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాక ఈ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఇతరాత్ర ప్రయోజనాలను వారు కోల్పోయే అవకాశముందని వార్తలు వినిపించడంతో అకౌంట్లలో డిపాజిట్ తగ్గడం ప్రారంభమైంది. పన్ను పరిమితుల కంటే తక్కువగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని జన్ ధన్ అకౌంట్లోని లెక్కలో చూపని రూ.1.64 కోట్ల డిపాజిట్ అయినట్టు ఐటీ శాఖ గుర్తించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ జన్ ధన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో జీరో బ్యాలెన్స్‌తో దేశంలోని ప్రతిఒక్కరూ బ్యాంకు అకౌంట్లను ప్రారంభించుకునే సదుపాయం కల్పించారు. కానీ బ్లాక్ మనీపై పోరాటంగా పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగానే, ఒక్క రూపాయి కూడా లేని ఈ అకౌంట్లోకి భారీ మొత్తంలో నగదు వచ్చి చేరింది. సామాన్యుల ఈ ఖాతాలను అడ్డం పెట్టుకుని, బడాబాబులందరూ తమ నల్లధనాన్ని ఈ ఖాతాల్లోకి డిపాజిట్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
జన్‌ధన్ విత్‌డ్రా పై ఆర్బీఐ మార్గదర్శకాలు
-
ఆ ఖాతాల్లో 21 వేల కోట్లు
న్యూఢిల్లీ: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రధానమంత్రి జన ధన యోజన (జేడీవై) అకౌంట్లు కాసులతో కళకళలాడుతున్నాయి. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్ 8 తర్వాత ఏకంగా 21వేల కోట్లు జన ధన అకౌంట్లలో జమ అయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని జనధన అకౌంట్లలో ఎక్కువగా నగదు జమ అయినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అయితే జన ధన అకౌంట్లను అక్రమ పద్దతుల్లో వినియోగించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నవంబర్ 8 నుంచి భారీగా నగదు డిపాజిట్ చేస్తున్న అనుమానాస్పద ఖాతాలపై నిఘా పెట్టిన ఐటీ ఇప్పటికే చాలా ఖాతాలు గుర్తించింది. ఆ సొమ్ము అక్రమమని తేలితే బినామీ చట్టం ప్రయోగిస్తామని, స్థిర, చరాస్తులు రెండిటికీ ఈ చట్టం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఆస్తుల స్వాధీనంతో పాటు డిపాజిట్ చేసిన వ్యక్తి, అందుకు అనుమతించిన వారిపై చర్యలు తీసుకునేందుకు బినామీ చట్టం అధికారం కల్పిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో పేదవారు కూడా బ్యాంకుల మాధ్యమంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2014 ఆగస్టులో జన ధన యోజన పథకం ప్రారంభమైంది. మినిమం బ్యాలెన్స్‌ల బాదరబందీ లేకుండా ఉచితంగానే ఈ ఖాతాను తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన వారికి లావాదేవీల నిర్వహణను బట్టి దాదాపు రూ. 5 వేల దాకా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, బీమా కవరేజీ మొదలైనవి కల్పించడం ఈ పథకం ప్రత్యేకత. జేడీవై కింద ఇప్పటి వరకు 24 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. -
2 ఫొటోలతో జన ధన ఖాతా తెరవొచ్చు
న్యూఢిల్లీ: కేవలం సంతకంతో కూడిన 2 ఫొటోగ్రాఫ్‌లు సమర్పించి ఎవరైనా జన ధన అకౌంట్లను ప్రారంభించవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అధికారికంగా ఎటువంటి పత్రాలు లేదా ఆధార్ నంబర్లు లేని వారికి ఈ వెసులుబాటు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని ప్రకటన తెలిపింది. ఆగస్టు 26న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థిక మంత్రిత్వశాఖ తాజా అధికారిక ప్రకటన జారీ చేసింది. అయితే ఈ తరహా అకౌంట్లను ‘స్మాల్ అకౌంట్లుగా పిలుస్తారు. 12 నెలలు మాత్రమే ఇవి అమల్లో ఉంటాయి. ఈ అకౌంట్ ప్రారంభించిన 12 నెలలలోపు అధికారిక పత్రాలను సంబంధిత అకౌంట్ హోల్డర్ సమర్పించాల్సి ఉంటుంది. స్మాల్ అకౌంట్లకు కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. బ్యాలెన్స్ ఎప్పుడూ రూ.50,000 దాటకూడదు. మొత్తం క్రెడిట్ ఒక ఏడాదిలో రూ. లక్ష దాటకూడదు. ఒక నెలలో నగదు ఉపసంహరణ రూ.10,000కు మించి ఉండకూడదు. ఇప్పటికే అకౌంట్‌ను కలిగిఉన్న ఒక వ్యక్తి ప్రధానమంత్రి జన ధన యోజన కింద ప్రయోజనాలను పొందడానికి మరో బ్యాంక్ అకౌంట్ పొందాల్సిన అవసరం లేదని కూడా ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికే అకౌంట్‌ను కలిగిఉన్న వారు ఈ ప్రయోజనాలు పొందడానికి తమ అకౌంట్ కలిగి ఉన్న బ్రాంచ్‌లో ఒక దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది. అకౌంట్లు తెరవడానికి సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉండడం లేదని కొన్ని ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాన వార్తా పత్రికల్లో దరఖాస్తులతో కూడిన ప్రకటనలు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ దరఖాస్తులు తీసుకువచ్చి సైతం ఎవరైనా అకౌంట్లను ప్రారంభించవచ్చని తెలిపింది. ఠీఠీఠీ.జజ్చీఛిజ్చీట్ఛటఠిజీఛ్ఛిట.జౌఠి.జీ వెబ్సైట్ ద్వారా కూడా అకౌంట్ ఓపెనింగ్ డాక్యుమెంటును పొందవచ్చని వెల్లడించింది. కాగా, జన ధన యోజన కింద ఇప్పటికి 4.18 కోట్ల అకౌంట్లను ప్రారంభించినట్లు పేర్కొంది.