భారీగా ఎగిసిన ఆ డిపాజిట్లు ఢమాల్!
భారీగా ఎగిసిన ఆ డిపాజిట్లు ఢమాల్!
Published Thu, Dec 22 2016 8:56 AM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దుతో జన్ ధన్ ఖాతాల్లోకి వరదలా వచ్చి చేరిన డిపాజిట్లు ఒక్కసారిగా ఢమాల్ అన్నాయి. రూ.75 వేల కోట్ల మార్కుకు చేరువలో ఎగిసిన ఈ డిపాజిట్లు ఇటీవల తగ్గడం ప్రారంభమయ్యాయి. తుది గడువు దగ్గపడుతుండటంతో పాటు జన్ ధన్ అకౌంట్లకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకొస్తున్న నిబంధనలు, హెచ్చరికలతో ఈ ఖాతాలోకి నగదు వెల్లువ తగ్గినట్టు తెలుస్తోంది. పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన వెంటనే సామాన్యుల జన్ ధన్ అకౌంట్లోకి భారీగా రద్దైన నోట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరాయి.
నవంబర్ 9న రూ.45,636 కోట్లగా ఉన్న ఈ అకౌంట్లో డిపాజిట్లు నవంబర్ 23 వరకు రూ.72,843 కోట్లకు ఎగిశాయి. తాజా గణాంకాల ప్రకారం ఈ అకౌంట్లలో డిపాజిట్లు నెమ్మదించాయని తెలిసింది. రూ.74,609 కోట్లు మాత్రమే డిపాజిట్ అయినట్టు గణాంకాలు పేర్కొన్నారు. అంతేకాక ట్రెండ్ కూడా రివర్స్ అయిందట. ఈ అకౌంట్ల నుంచి నగదును బయటికి వచ్చేస్తున్నట్టు వెల్లడవుతోంది.
ఈ అకౌంట్లు దుర్వినియోగానికి వాడకుండా ఉండేందుకు జన్ ధన్ అకౌంట్ హోల్డర్స్ వివరాలను తమకు అందించాలని మొదటి సారి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సైతం బ్యాంకులను ఆదేశించింది. ఈ అకౌంట్లలో రూ.50వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తున్న వారి దగ్గర కేవైసీ తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాక ఈ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఇతరాత్ర ప్రయోజనాలను వారు కోల్పోయే అవకాశముందని వార్తలు వినిపించడంతో అకౌంట్లలో డిపాజిట్ తగ్గడం ప్రారంభమైంది. పన్ను పరిమితుల కంటే తక్కువగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని జన్ ధన్ అకౌంట్లోని లెక్కలో చూపని రూ.1.64 కోట్ల డిపాజిట్ అయినట్టు ఐటీ శాఖ గుర్తించింది.
దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ జన్ ధన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో జీరో బ్యాలెన్స్తో దేశంలోని ప్రతిఒక్కరూ బ్యాంకు అకౌంట్లను ప్రారంభించుకునే సదుపాయం కల్పించారు. కానీ బ్లాక్ మనీపై పోరాటంగా పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగానే, ఒక్క రూపాయి కూడా లేని ఈ అకౌంట్లోకి భారీ మొత్తంలో నగదు వచ్చి చేరింది. సామాన్యుల ఈ ఖాతాలను అడ్డం పెట్టుకుని, బడాబాబులందరూ తమ నల్లధనాన్ని ఈ ఖాతాల్లోకి డిపాజిట్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement