జన్‌ధన్‌ భారమిది.. భరించాల్సిందే! | SBI needs minimum account balance penalty to offset Jan Dhan costs, says Arundhati Bhattacharya | Sakshi
Sakshi News home page

జన్‌ధన్‌ భారమిది.. భరించాల్సిందే!

Published Thu, Mar 9 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

జన్‌ధన్‌ భారమిది.. భరించాల్సిందే!

జన్‌ధన్‌ భారమిది.. భరించాల్సిందే!

జరిమానాల కొరడాపై ఎస్‌బీఐ స్పష్టీకరణ
పునరాలోచనకు కేంద్రం నుంచి ఎటువంటి సూచనా అందలేదు..
వస్తే పరిశీలిస్తామని వెల్లడి  
జన్‌ధన్‌ అకౌంట్లపై భారం ఉండబోదని హామీ


ముంబై: అకౌంట్లలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించకపోతే జరిమానాలు విధించాలన్న నిర్ణయాన్ని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పూర్తిగా సమర్థించుకుంది. జన్‌ధన్‌ అకౌంట్ల నిర్వహణకు సంబంధించి బ్యాంక్‌పై భారం పెరిగిపోతోందని, ఈ నేపథ్యంలో జరిమానాల విధింపు తప్పదని స్పష్టం చేసింది. అయితే జన్‌ధన్‌ అకౌంట్లకు సంబంధించి మాత్రం ఇటువంటి పెనాల్టీలు ఉండబోవని వివరణ ఇచ్చింది. జరిమానాల విధింపు అంశాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నుంచి  ఎటువంటి సూచనలూ తనకు ఇంకా అందలేదనీ, వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

కనీస బ్యాలెన్స్‌ నిర్వహించకపోతే పెనాల్టీ విధింపు పునఃప్రారంభ నిర్ణయంసహా, ఇతర కొన్ని బ్యాంకింగ్‌ సేవలపై సైతం చార్జీలను  గత వారం ఎస్‌బీఐ సవరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయని కూడా బ్యాంక్‌ స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీలుసహా పలువురి నుంచి ఆయా నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఒక మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య ఈ సందర్భంగా తాజా చార్జీల అంశాన్ని ప్రస్తావించారు. ఆమె దీని గురించి మాట్లాడిన అంశాలను సంక్షిప్తంగా చూస్తే...

తప్పలేదు...
అందరికీ బ్యాంకింగ్‌ అకౌంట్లు (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) అనండి లేదా జన్‌ధన్‌ అకౌంట్లు అనండి... ఇలాంటి 11 కోట్ల అకౌంట్లతో మాపై భారీ భారం ఉంది. ఈ అకౌంట్లను నిర్వహించడానికి మాకు కొన్ని చార్జీలు అవసరం.  ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి మేము ఎన్నో మార్గాలను అన్వేషించాం. చివరకు చార్జీలను విధించక తప్పదన్న నిర్ణయానికి వచ్చాం.

మా దగ్గరే అతి తక్కువ...
అన్ని బ్యాంకులూ అకౌంట్‌ హోల్డర్లు కనీస బ్యాలెన్స్‌ అవసరాన్ని నిర్దేశిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఎస్‌బీఐ మాత్రమే అతితక్కువ కనీస బ్యాలెన్స్‌ను అమలు చేస్తోంది. ఇక మా విశ్లేషణలో తేలిందేమిటంటే– మా బ్యాంకులోని అకౌంట్లలో అధికం నెలవారీగా  రూ.5,000కుపైగా కనీస బ్యాలెన్స్‌ను కలిగి ఉన్నాయి. జరిమానాలకు సంబంధించి ఆయా అకౌంట్‌ హోల్డర్లు ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు.

ప్రతి దశలోనూ వ్యయమే...
నగదు ముద్రణ నుంచి రవాణా, లెక్కింపు, భద్రతను కల్పించడం వరకూ ఇలా ప్రతిదశలోనూ వ్యయమవుతుంటుంది. ఏటీఎంల ఏర్పాటూ వ్యయంతో కూడినదే. కనుక మేము చార్జీలు విధించడం సమంజమేనని భావిస్తున్నాం.

ప్రత్యామ్నాయాలు తప్పవు...
కస్టమరు తప్పనిసరిగా తమ లావాదేవీలకు ప్రత్యామ్నాయ మార్గాలవైపు వెళ్లాలి. మొబైల్, ఇంటర్నెట్‌ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి. నిజానికి ఒక గృహస్తుడు నెలకు నాలుగుసార్లకన్నా ఎక్కువగా ఏటీఎంను వినియోగించాల్సిన అవసరం ఉంటుందని మేము భావించడం లేదు. ఇలాంటి అవసరం వ్యాపార వేత్తలకే ఉంటుంది. ఇలాంటి వారు మొబైల్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం.

చిన్న పరిశ్రమలకు భారీ రుణాలు
చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1.6 లక్షల కోట్ల రుణాలను బ్యాంక్‌ ఇప్పటివరకూ అందజేసింది. ఈ ఒక్క ఏడాదే రూ.10,000 కోట్ల రుణ మంజూరు చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,000 కోట్ల ముంద్రా రుణాలను ఇవ్వాలన్నది లక్ష్యం.

రిటైల్‌ రంగానికి ప్రాధాన్యత
బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌లో దాదాపు 55 శాతం రిటైల్‌ విభాగం వాటా ఉంది. రిటైల్‌ వైపు మొగ్గుచూపడం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పెద్ద పరిశ్రమల తమ అవసరాలకు చిన్న పరిశ్రమలపై ఆధారపడే విషయం గమనార్హం. ఇక్కడ పెద్ద సంస్థలతో పాటు చిన్న సంస్థలకు రుణ అవసరాలు ఎంతో ఉంటాయి.

ఎడాపెడా చార్జీల మోత...
కొత్త ఖాతాదారులను రాబట్టుకునేందుకు వీలుగా నెలవారీ కనీస నగదు నిల్వల(ఎంఏబీ) వైఫల్యంపై చార్జీలు విధించడాన్ని 2012లో నిలిపివేశామని, వాటిని ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి ప్రవేశపెడుతున్నామని  ఎస్‌బీఐ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఎంఏబీలో విఫలమైతే సేవింగ్స్‌ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీతోపాటు సేవా రుసుము విధింపు ఉంటుంది. కనిష్టంగా రూ.20,సేవా రుసుము విధిస్తారు.  ఇక కరెంట్‌ ఖాతాదారులకు ఈ జరిమానా గరిష్టంగా రూ.500గా ఉంటుంది. దీంతోపాటు బ్యాంకు శాఖల్లో నెలకు మూడు నగదు డిపాజిట్లు మించినా కూడా చార్జీల వడ్డింపు తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement