స్త్రీలోక సంచారం | Womens empowerment: Arundhati Bhattacharya to be SWIFT India Chairman | Sakshi
Sakshi News home page

 స్త్రీలోక సంచారం

Published Thu, Dec 13 2018 12:03 AM | Last Updated on Thu, Dec 13 2018 12:03 AM

Womens empowerment: Arundhati Bhattacharya to be SWIFT India Chairman - Sakshi

చెన్నైలోని అంబూర్‌లో హనీఫా జారా అనే ఏళ్ల బాలిక తన తండ్రి మరుగుదొడ్డి కట్టించడం లేదని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ‘‘మా నాన్నగారు రెండేళ్ల క్రితమే ఇంట్లో టాయ్‌లెట్‌ కట్టిస్తానని నాకు మాట ఇచ్చారు. ఇప్పటికీ కట్టించలేదు. నేను పెద్దదాన్ని అవుతున్నాను. ఆరు బయటికి వెళ్లాలంటే సిగ్గుగా ఉంటోంది’’ అని హనీఫా తన ఫిర్యాదులో రాసింది. ప్రస్తుతం ఆ బాలిక రెండో తరగతి చదువుతోంది. ఎల్‌.కె.జి.లో ఉన్నప్పుడు క్లాస్‌ ఫస్ట్‌ వస్తే టాయ్‌లెట్‌ కట్టిస్తానని తన తండ్రి మాట ఇచ్చి మోసం చేశాడని, మాట తప్పినందుకు ఆయన్ని అరెస్ట్‌ చెయ్యడం గానీ, టాయ్‌లెట్‌ కట్టిస్తానని లిఖితపూర్వకమైన హామీ ఇప్పించడం గానీ చెయ్యాలని హనీఫా పోలీసులకు కోరింది. అంబూర్‌ ఆల్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చెయ్యడం కోసం వెళ్లినప్పుడు హనీఫా తనతోపాటు స్కూల్లోను, ఆటల్లోనూ తనకు వచ్చిన 20 పతకాలను, సర్టిఫికెట్‌లను తన ప్రతిభకు రుజువుగా తీసుకెళ్లింది. హనీఫా సంకల్పబలానికి ముగ్ధురాలైన ఎస్సై ఎ.వలమర్తి పారిశుద్ధ్య అధికారులతో మాట్లాడి టాయ్‌లెట్‌ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హనీఫా తండ్రి ఎసానుల్లా (31)కి సోమవారం మధ్యాహ్నం 3.30కి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్‌ రావడంతో ఆందోళనగా బయల్దేరి వెళ్లాడు. విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఇది ఊపిరి పీల్చుకునే విషయం కాదని ఎస్సై అతడిని సున్నితంగా మందలించారు. ఇదిలా ఉంటే ఈ వార్త తెలియగానే అంబూరు మున్సిపాలిటీ హనీఫాను ‘స్వచ్ఛ భారత్‌’ స్కీమ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది! 

‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’గా ప్రఖ్యాతి చెందిన కాంస్య విగ్రహాన్ని న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌ నుంచి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజి భవనం ఆవరణకు తరలించారు. స్త్రీ సాధికారతకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని ‘స్టేట్‌ స్ట్రీట్‌ గ్లోబర్‌ అడ్వైజర్స్‌’ సంస్థ 2017 మార్చి 7న మహిళా దినోత్సవానికి ముందు రోజు వాల్‌స్ట్రీట్‌లో ‘చార్జింగ్‌ బుల్‌’ విగ్రహానికి అభిముఖంగా ఆ బుల్‌ని సవాల్‌ చేస్తున్నట్లుగా ప్రతిష్టించింది. స్టాక్‌ మార్కెట్‌లో మహిళా భాగస్వామికి, నాయకత్వానికి సూచికగా ఉంచిన ఈ విగ్రహం కింద ఫలకంపై ‘‘స్త్రీల నాయకత్వపు శక్తిని తెలుసుకోండి. తనేమిటో చూపించగలదు’’ అని రాసి ఉంటుంది. విగ్రహాన్ని అక్కడ ఉంచేందుకు మొదట 30 రోజుల వ్యవధిని మాత్రమే అనుమతి ఇచ్చిన నగరపాలక సంస్థ, ఆ తర్వాత ఆ ‘ఫియర్‌లెస్‌ గర్ల్‌’కు విశేష ఆదరణ లభించడంతో ప్రముఖుల అభ్యర్థనపై వ్యవధి గడువును పెంచుతూ వచ్చింది. అది కూడా ముగియడంతో చివరికి అక్కడి నుంచి తొలగించి, స్టాక్‌ ఎక్చ్సేంజి భవనం దగ్గరికి చేర్చారు. విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలో బాలిక పాదాల జాడల్ని మాత్రం అలాగే ఉంచుతున్నారు. 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య ‘స్విఫ్ట్‌ ఇండియా’ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ‘సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలీకమ్యూనికేషన్స్‌’ (స్విఫ్ట్‌)కు ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ఎం.వి.నాయర్‌ ఐదేళ్ల పదవీకాలం పూర్తి కావస్తుండడంతో అరుంధతిని బోర్డ్‌ చైర్మన్‌గా ఎంపిక చేసుకున్నట్లు స్విఫ్ట్‌ ఇండియా సీఈవో కిరణ్‌ శెట్టి తెలిపారు. 62 ఏళ్ల అరుంధతి ఎస్‌.బి.ఐ. తొలి మహిళా చైర్మన్‌గా గుర్తింపు పొందారు. 2016 ఫోర్బ్స్‌ ‘100 మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఉమన్‌ ఇన్‌ ది వరల్డ్‌’జాబితాలో 25వ స్థానంలో నిలిచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement