జన్‌ధన్‌లోకి రూ. 65 వేల కోట్లు..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 30 కోట్ల జనధన ఖాతాల్లో రూ.65వేల కోట్లు జమ అయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన్‌ధన్ యోజన పథకం ద్వారా దేశంలో ఇప్పటి వరకూ సుమారు 30కోట్ల కుటుంబాలకు పైగా జనధన అకౌంట్లను తెరిచారని ప్రధాని తెలిపారు. రేపటి(ఆగస్టు 28)తో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 30 కోట్ల జనధన ఖాతాల్లో రూ.65వేల కోట్లు జమ అయ్యాయని ప్రధాని వెల్లడించారు.
దేశంలోని ప్రముఖ బ్యాంకులన్నీ ఇప్పటికే సర్వే నిర్వహించి జనధన ద్వారా సాధారణ పౌరుడు లబ్ధి పొందుతున్నారని తెలిపాయన్నారు. ఈ పథకం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఓ చర్చనీయ అంశంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అంతే కాకుండా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాలు కూడా ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు. వీటి వల్ల పేదప్రజలకు తమ జీవితాలపై భరోసా ఏర్పడుతుందని ప్రధాని వెల్లడించారు.