ఆ ఖాతాల్లో 21 వేల కోట్లు
ఆ ఖాతాల్లో 21 వేల కోట్లు
Published Wed, Nov 23 2016 6:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
న్యూఢిల్లీ: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రధానమంత్రి జన ధన యోజన (జేడీవై) అకౌంట్లు కాసులతో కళకళలాడుతున్నాయి. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్ 8 తర్వాత ఏకంగా 21వేల కోట్లు జన ధన అకౌంట్లలో జమ అయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని జనధన అకౌంట్లలో ఎక్కువగా నగదు జమ అయినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
అయితే జన ధన అకౌంట్లను అక్రమ పద్దతుల్లో వినియోగించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నవంబర్ 8 నుంచి భారీగా నగదు డిపాజిట్ చేస్తున్న అనుమానాస్పద ఖాతాలపై నిఘా పెట్టిన ఐటీ ఇప్పటికే చాలా ఖాతాలు గుర్తించింది. ఆ సొమ్ము అక్రమమని తేలితే బినామీ చట్టం ప్రయోగిస్తామని, స్థిర, చరాస్తులు రెండిటికీ ఈ చట్టం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఆస్తుల స్వాధీనంతో పాటు డిపాజిట్ చేసిన వ్యక్తి, అందుకు అనుమతించిన వారిపై చర్యలు తీసుకునేందుకు బినామీ చట్టం అధికారం కల్పిస్తోంది.
మారుమూల ప్రాంతాల్లో పేదవారు కూడా బ్యాంకుల మాధ్యమంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2014 ఆగస్టులో జన ధన యోజన పథకం ప్రారంభమైంది. మినిమం బ్యాలెన్స్‌ల బాదరబందీ లేకుండా ఉచితంగానే ఈ ఖాతాను తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన వారికి లావాదేవీల నిర్వహణను బట్టి దాదాపు రూ. 5 వేల దాకా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, బీమా కవరేజీ మొదలైనవి కల్పించడం ఈ పథకం ప్రత్యేకత. జేడీవై కింద ఇప్పటి వరకు 24 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు.
Advertisement