రూ.21,46,735 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ | Rs 21,46,735 Crores Union Budget | Sakshi
Sakshi News home page

రూ.21,46,735 కోట్లతో కేంద్ర బడ్జెట్‌

Published Thu, Feb 9 2017 4:09 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

రూ.21,46,735 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ - Sakshi

రూ.21,46,735 కోట్లతో కేంద్ర బడ్జెట్‌

జాతీయం
నగదు రూప లావాదేవీలపై కేంద్రం కొరడా రూ.3 లక్షలు లేదా అంతకుమించిన లావాదేవీలను నగదు రూపంలో చేస్తే అంతే మొత్తాన్ని (100 శాతం) జరిమానాగా విధించనున్నారు. ఈ నిబంధన ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్‌ అధియా ఫిబ్రవరి 5న తెలిపారు. నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించిన నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో చేర్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంగా తెలిపారు.

ఎంపీ, మాజీ మంత్రి అహ్మద్‌ మృతి
పార్లమెంట్‌ సభ్యుడు, మాజీ మంత్రి ఇ.అహ్మద్‌ (78) ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలోని మరణించారు. పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. కేరళకు చెందిన ఐయూఎంఎల్‌ నేత.. అహ్మద్‌ యూపీఏ ప్రభుత్వంలో వివిధ శాఖల సహాయ మంత్రిగా, గల్ఫ్‌ దేశాల్లో భారత అనధికార రాయబారిగా సేవలందించారు.

అంతర్జాతీయం
అమెరికా ప్రతినిధుల సభలో హెచ్‌–1బీ సంస్కరణ బిల్లు భారత్‌ సహా విదేశాల నుంచి అమెరికాకు వచ్చే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే హెచ్‌–1బీ వీసా (వేతన) సంస్కరణల బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో జనవరి 31న ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో హెచ్‌–1బీ వీసాదారులు కనీస వేతనాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేశారు. దీంతో వీసాదారుల కనీస వేతనం ఒక్కసారిగా 60 వేల డాలర్ల నుంచి 1.3 లక్షల డాలర్లకు పెరిగింది. ఫలితంగా అమెరికన్‌ ఉద్యోగుల స్థానంలో విదేశీ ఉద్యోగులను పెట్టుకునేందుకు హెచ్‌–1బీ కార్యక్రమాన్ని వాడుకోవడం కంపెనీలకు కష్టతరమవుతుంది. ద హైస్కిల్డ్‌ ఇంటెగ్రిటీ అండ్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌–2017 అనే ఈ చట్టాన్ని కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు జో లాఫ్‌గ్రెన్‌ ప్రవేశపెట్టారు.

∙అమెరికా విదేశాంగ మంత్రిగా టిల్లెర్సన్‌
అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ప్రముఖ వ్యాపారవేత్త, ఎక్సాన్‌ మొబైల్‌ మాజీ సీఈవో టిల్లెర్సన్‌ ఫిబ్రవరి 2న బాధ్యతలు చేపట్టారు. ఆయన నియామకానికి సెనేట్‌ ఆమోదం తెలిపింది.

వార్తల్లో వ్యక్తులు
అనిష్‌కపూర్‌కు ఇజ్రాయెల్‌ జెనిసిస్‌ అవార్డు భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్‌ శిల్పి, సిరియన్‌ శరణార్థుల హక్కుల కోసం పోరాడిన అనిష్‌ కపూర్‌కు ఇజ్రాయెల్‌ జెనిసిస్‌ అవార్డు లభించింది. ఈ అవార్డు కింద ఆయనకు ఒక మిలియన్‌ డాలర్లు (రూ.6.71 కోట్లు) లభించనున్నాయి. శరణార్థుల పట్ల ప్రభుత్వాల దుర్మార్గ పూరిత విధానాలపై గళమెత్తినందుకు ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

∙ఉగ్రవాదుల జాబితా నుంచి హెక్మత్యార్‌ పేరు తొలగింపు
ఆఫ్గనిస్తాన్‌ మాజీ ప్రధాని, మిలిటరీ కమాండర్‌ గుల్బుద్దీన్‌ హెక్మత్యార్‌ పేరును ఉగ్రవాదుల జాబితా నుంచి ఐరాస భద్రతామండలి ఫిబ్రవరి 5న తొలగించింది. సీజ్‌ చేసిన ఆయన ఆస్తులను విడుదల చేయడంతోపాటు ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
∙శక్తిమంతమైన క్షిపణిని పరీక్షించిన చైనా
ఒకేసారి పది అణ్వాయుధాలను ప్రయోగించే క్షిపణిని చైనా ఫిబ్రవరి 2న పరీక్షించింది. డాంగ్‌ఫెంగ్‌–5సీ పేరుతో ఈ  క్షిపణి పరీక్షను చేపట్టింది. దీన్ని పది వేర్వేరు లక్ష్యాలపై ఏకకాలంలో ప్రయోగించవచ్చు. షానిక్స్‌ ప్రావిన్స్‌లోని ది టెయూన్‌ స్పేస్‌ లాంచ్‌ప్యాడ్‌పై నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగా.. ఇది డమ్మీ వార్‌హెడ్‌లను పశ్చిమ చైనాలోని నిర్దేశిత లక్ష్యాలపై పడేసింది.

ఆర్థికం
కేంద్ర బడ్జెట్‌ 2017–18 కేంద్ర బడ్జెట్‌ 2017–18ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించారు. ఈసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు.

ముఖ్యాంశాలు:
 పథకాల వ్యయం: రూ.9,45,078 కోట్లు
 ఇతర వ్యయం: రూ.12,01,657 కోట్లు
 మొత్తం వ్యయం: మొత్తం రూ.21,46,735 కోట్లు
 2017–18 సంవత్సరానికి రెవెన్యూ లోటు 1.9 శాతం

ప్రాధాన్యత: 2017–18 బడ్జెట్‌ను ట్రాన్స్‌ఫార్మ్, ఎనరై్జస్‌ అండ్‌ క్లీన్‌ ఇండియా (టీఈసీ) అజెండాతో ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఈ అజెండాలోప్రధానంగా పది భావనలను నిర్దేశించారు. వాటిలో రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో రెండింతలు చేయడం, గ్రామీణ జనాభాకు ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, నైపుణ్యాలు, ఉద్యోగాల ద్వారా యువతకు తోడ్పడటం, సామాజిక భద్రతను పటిష్టం చేయడం, ఆరోగ్య రక్షణ, సుస్థిరత పెంపొందించడం, పారదర్శకత ద్వారా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం, ప్రజల భాగస్వామ్యం ద్వారా సమర్థవంతమైన ప్రభుత్వం సేవల అందించడం వంటి అంశాలు ఉన్నాయి.

కేటాయింపులు, నిర్ణయాలు:
 మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,96,135 కోట్లు.
 దేశవ్యాప్తంగా 250 ఎలక్ట్రానిక్‌ వస్తూత్పత్తి కేంద్రాల ఏర్పాటు కోసం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూర్చనున్నారు.
 20,000 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు.
 ముద్రా రుణాల కోసం రూ.2.44 లక్షల కోట్లు.
 రక్షణ రంగానికి రూ.2.74 లక్షల కోట్లు.
 వెనుకబడిన కులాలకు రూ.52,393 కోట్లు.
 మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి రూ.48,000 కోట్లు.
 600 జిల్లాల్లో ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి
  కేంద్రాల ఏర్పాటు.
 వ్యవసాయ రుణాలకు రూ.10 లక్షల కోట్లు.
 డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించే పరికరాలపై పన్ను మినహాయింపు.
 బీమ్‌ యాప్‌ ప్రోత్సాహానికి రెండు కొత్త పథకాలు.
 భారత్‌ నెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కోసం రూ.10,000 కోట్లు.
 రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు:  2017–18 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల్లో మూలధన, అభివృద్ధి వ్యయాన్ని రూ.1,31,000 కోట్లుగా (గత బడ్జెట్‌లో కంటే రూ.10 వేల కోట్లు అదనం) ప్రతిపాదించారు. ఇందులో రూ.55 వేల కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి సమకూరుస్తుంది. 2016–17లో ఇచ్చిన బడ్జెట్‌ మద్దతు కంటే ఇది రూ.10 వేల కోట్లు ఎక్కువ. 2020 నాటికి బ్రాడ్‌గేజ్‌ మార్గాల్లో గేట్లు ఏర్పాటు చేస్తారు. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే రైలు టిక్కెట్లపై సేవా పన్నును రద్దు చేశారు. 25 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించేందుకు 2017–18 బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. దేశీయ అవసరాలకు అనుగుణంగా నూతన మెట్రో రైలు విధానాన్ని ప్రవేశపెడతారు.

 2016–17 ఆర్థిక సర్వే
ఆర్థిక సర్వే 2016–17ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ జనవరి 31న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నోట్ల రద్దు ప్రభావం వల్ల 2016–17లో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని సర్వే అంచనా వేసింది. అయితే వృద్ధిరేటు 2017–18లో తిరిగి పుంజుకుని 6.75–7.5 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. వస్తు, సేవల పన్ను అమలు, డీమానిటైజేషన్‌తోపాటు నిర్మాణాత్మక సంస్కరణల వల్ల స్థూల దేశీయోత్పత్తి  (జీడీపీ) వృద్ధిరేటు 8–10 శాతానికి పెరుగుతుందని తెలిపింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (నల్లధనాన్ని వెల్లడించే పథకం) వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగ వృద్ధిరేటు 4.1 శాతానికి పెరగనుంది. ఇది గతేడాది 1.2 శాతంగా ఉంది. పారిశ్రామిక రంగ వృద్ధిరేటు 7.4 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 2016–17లో సేవల రంగంలో 8.9 శాతం వృద్ధి నమోదవుతుందని తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement