దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విధింపుకు అవకాశం(ప్రతీకాత్మక చిత్రం)
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లకు కేంద్ర ప్రభుత్వం షాకివ్వబోతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును విధించేందుకు సిద్దమవుతోంది. బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముందుని తెలుస్తోంది. 14 ఏళ్ల క్రితం సెక్యురిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ) పేరుతో ఉన్న ఈ పన్నును అప్పటి ప్రభుత్వం విత్‌డ్రా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పన్నును ఎల్‌టీసీజీ రూపంలో మరోసారి పునఃప్రవేశపెట్టబోతున్నారు. ఏదైనా లిస్టెడ్ కంపెనీ షేర్లు కొని ఏడాది తర్వాత అమ్ముకుంటే వచ్చే లాభాలపై ఇప్పటి వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇక నుంచి వీటిపై పన్ను చెల్లించాలి. ఇదే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను.
అయితే ఈ కాలపరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచుతారని అంచనాలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం స్టాక్‌మార్కెట్‌లో షేర్ల క్రయవిక్రయాలపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగా ఉంది. ఈ తేడాను తొలగించి ఈ బడ్జెట్‌లో దీర్ఘకాలిక లాభాలపై పన్ను విధించబోతున్నారు. ఈ పన్నులో మ్యూచువల్ ఫండ్స్ కలుపాలా? వద్దా? అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ మధ్యతరగతి వర్గాలకు అతి ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా ఉన్న సంగతి తెలిసిందే.
పన్ను విధానాలపై మారిషస్, సింగపూర్ దేశాలతో నరేంద్ర మోదీ ప్రభుత్వం జరిపిన చర్చలు కూడా విజయవంతమైనట్టు తెలిసింది. దీర్ఘకాలిక మూలధన పన్నుపై మార్కెట్ ఇన్వెస్టర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వాల్యుయేషన్ అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ పన్ను విధిస్తుందని తాము నమ్ముతున్నట్టు వారు పేర్కొంటున్నారు. స్టాక్‌మార్కెట్లపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ పన్ను విధింపుతో, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వానికి అవసరమయ్యే వనరులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మధ్యతరగతి వారికి పన్ను ఊరట ఇవ్వడానికి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను సహకరించనుందని తెలుస్తోంది.
దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల పన్నులు, ప్రభుత్వ ట్రెజరీకి మంచి నిధులను సమకూర్చనున్నాయని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ కన్సల్టింగ్ సంస్థ పార్టనర్ హేమల్ మెహతా చెప్పారు. ఒకవేళ ఈసారి బడ్జెట్‌లో కనుక ఇదే జరిగితే స్టాక్ మార్కెట్లు తీవ్ర కుదుపులకు లోనయ్యే అవకాశం ఉంది. దానికి తోడు పెద్దగా రిస్క్ తీసుకోలేని ఇన్వెస్టర్లు, ఈక్విటీ పెట్టుబడులపై పూర్తిగా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లు కూడా ఏమాత్రం బడ్జెట్ జోష్ లేకుండా... నష్టాల్లోనే నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment