తెలంగాణకు నిరాశే | Disappointment to Telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు నిరాశే

Published Tue, Mar 1 2016 3:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

తెలంగాణకు నిరాశే - Sakshi

తెలంగాణకు నిరాశే

♦ కేంద్రం నుంచి వచ్చేది రూ.25 వేల కోట్లే!
♦ కేంద్ర బడ్జెట్ ప్రభావంపై  ప్రాథమిక అంచనా
♦ పథకాలకు నిధుల వాటాపై తొలగిన గందరగోళం
 
 సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వాన్ని నిరాశపరిచింది. ఏటేటా ఇచ్చే పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులు తప్ప ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవేమీ బడ్జెట్‌లో లేవు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.25 వేల కోట్లు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాలు వేసుకుంది. కేంద్రం రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల వాటా (42 శాతం) ద్వారా రాష్ట్రానికి రూ.13,900 కోట్లు సమకూరుతాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల (స్టేట్ ప్లాన్)కు కేటాయించిన నిధుల్లో రూ.5,900 కోట్లు కేటాయించే అవకాశముంది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన స్థానిక సంస్థల గ్రాంట్ల రూపంలో రూ.2,500 కోట్లు రాష్ట్రానికి విడుదలవుతాయి. వీటితో పాటు జాతీయ విపత్తు నిధి నుంచి వచ్చే నిధులు, ఇతరత్రా గ్రాంట్లు మరో రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్లు వచ్చే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.

 నిరుటి నిధుల్లో కోత
 రాష్ట్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.12,828 కోట్లు, కేంద్రం నుంచి రూ.12,400 కోట్లు గ్రాంట్లు వస్తాయని అంచనా వేసుకుంది. కానీ కేంద్రం తాజాగా సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.12,335 కోట్లే విడుదలవనున్నాయి. దాదాపు రూ.493 కోట్ల మేర కోత పడింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు విడుదల చేసే నిధుల్లోనూ రూ.84 కోట్లు కోత పెట్టింది. మొత్తంగా రూ.587 కోట్ల గండి పడ్డట్లయింది.

 ఆరు పథకాలకు పూర్తిగా కేంద్ర నిధులు
 కేంద్ర ప్రభుత్వ పథకాల పునర్వ్యవస్థీకరణతో గతేడాది కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల భాగస్వామ్యంలో నెలకొన్న గందరగోళం ఈసారి తొలగిపోయింది. అత్యంత కీలకమైన ఆరు పథకాలకు కేంద్రమే నూటికి నూరు శాతం నిధులు కేటాయించనుంది. ఉపాధి హామీ పథకం, జాతీయ సామాజిక భద్రత పథకం, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి,  బీసీలు, నిరాదరణకు గురైన వర్గాల అభివృద్ధి, మైనారిటీల అభివృద్ధి పథకాలు ఇందులో ఉన్నాయి. కోర్ పథకాల జాబితాలో ఉన్న మరో 19 పథకాలకు కేంద్రం 60 శాతం నిధులు వెచ్చిస్తుంది. మిగతా 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఆప్షనల్ స్కీములుగా పరిగణించే మూడో కేటగిరీలో మూడు పథకాలున్నాయి. వీటిని రాష్ట్రాలు తమకు అవసరమనుకుంటే 50 శాతం నిధులు భరిస్తే.. మిగతా సగం కేంద్రం మంజూరు చేస్తుంది. పథకాల్లో వాటాలపై స్పష్టత ఇవ్వటంతో ఈసారి బడ్జెట్ అంచనాలను పక్కాగా వేసుకునేందుకు వీలవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
 బీబీనగర్ ఎయిమ్స్‌కు మొండిచేయి
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పడానికి గతంలోనే అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం మొండిచేయి చూపించింది. గత ఏడాది మాదిరిగానే 2016-17 బడ్జెట్‌లోనూ దానికి నిధులు కేటాయించలేదు. స్వయంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఎయిమ్స్‌కు పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో ఎయిమ్స్ నిర్మాణానికి రూ. 820 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్రం కేంద్రానికి గత ఏడాదే విన్నవించింది. 2015-16 బడ్జెట్‌కు ముందు సకాలంలో చెక్‌లిస్ట్ వివరాలు పంపడంలో ఆలస్యం వల్ల అప్పట్లో నిధులు కేటాయించలేదన్న చర్చ జరిగింది. కానీ ఇప్పుడన్నీ సరిగానే ఉన్నా ఎందుకు కేటాయించలేదో అంతుబట్టడంలేదు. ఈ మధ్య రాష్ట్రం కేంద్రంపై పూర్తిస్థాయిలో ఒత్తిడి తేలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎయిమ్స్ అవకాశాలు సన్నగిల్లడంతో ఇక నిమ్స్ సేవలపైనే ఆధారపడాల్సి రానుంది. బీబీనగర్ నిమ్స్ అందుబాటులోకి వస్తే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
 
 కిడ్నీ బాధితులకు ఊరట
 సాక్షి, హైదరాబాద్: డయాలసిస్ పరికరాల ధరలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవడంతో కిడ్నీ బాధితులకు కాసింత ఊరట లభించింది. దీనివల్ల అటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ డయాలసిస్ కేంద్రాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధుమేహం జబ్బు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉండడంతో ఎక్కువ మంది మూత్ర పిండాల జబ్బుల బారిన పడుతున్నారు. తాజా అంచనాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో డయాలసిస్ చేయించుకుంటున్న బాధితుల సంఖ్య 5 లక్షల పైనే ఉన్నట్టు అంచనా. ఒక్క హైదరాబాద్‌లోనే 70 వేల మంది డయాలసిస్ బాధితులు ఉన్నారు.
 
 త్వరలో కొత్త జాతీయరహదారులు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో కొత్త జాతీయ రహదారులు రూపుదిద్దుకోనున్నాయి. ఇటీవలే కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 1800 కి.మీ. నిడివి గల కొత్త జాతీయ రహదారుల్లో కనీసం సగం వరకు రోడ్లకు నిధులు అందే అవకాశం కనిపిస్తోంది. సోమవారం కేంద్ర బడ్జెట్‌లో చూపిన గణాంకాలు ఈ దిశలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. దాదాపు రూ.55 వేల కోట్లతో దేశవ్యాప్తంగా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చనున్నట్టు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. కేంద్రం ఇటీవల మంజూరు చేసిన రోడ్లకు దాదాపు రూ.13 వేల కోట్లు అవసరమవుతాయి. అన్నీ ఈసారే ఇవ్వటం సాధ్యం కానందున.. అందులో సగం నిధులపై రాష్ట్రప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.
 
 పశువులకు ఆరోగ్య గుర్తింపు కార్డులు
 సాక్షి, హైదరాబాద్: పశువులకు ఆరోగ్య గుర్తింపు కార్డులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయిం చింది. అందుకోసం బడ్జెట్లో రూ.850 కోట్లు కేటాయించింది. దీని ప్రకారం తెలంగాణకు దాదాపు రూ. 30 కోట్లు వచ్చే అవకాశం ఉంది. పశుధన్ సంజీవని పథకం కింద ఇచ్చే కార్డుల ద్వారా రాష్ట్రంలో పశువుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు.

 పంటల బీమాకు గతం కంటే అధిక నిధులు
 పంటల బీమా పథకాలకు గతంలో కంటే ఈ బడ్జెట్లో కేంద్రం అధిక నిధులు కేటాయించింది. తక్కువ ప్రీమియంతో అధిక బీమా సొమ్ము పొందేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రూ. 5,500 కోట్లు కేటాయించింది. దీని ప్రకారం రాష్ట్రంలో సుమారు 35 లక్షల మందికిపైగా రైతులు ప్రయోజనం పొందుతారు. ప్రధానమంత్రి సించాయి యోజన పథకం కింద రాష్ట్రంలో దాదాపు 3 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. పరంపరాగత్ కిసాన్ యోజన పథకం కింద వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో సుమారు 25 వేల ఎకరాల్లో వ్యవ సాయాన్ని సేంద్రీయ సాగులోకి మార్చాలని కేంద్రం యోచిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement