రాష్ట్రానికి రూ.25,675 కోట్లు
కేంద్రం నుంచి వాటాగా, ఇతర కేటాయింపుల కింద రాష్ట్రానికి నిధులు
సాక్షి, హైదరాబాద్: గత బడ్జెట్‌తో పోలిస్తే తాజా కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి పెద్దగా దక్కినవేమీ లేదు. రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, 14వ ఆర్థిక సంఘం గ్రాంట్లు తప్ప ప్రత్యేకంగా రాష్ట్ర ప్రస్తావనేదీ కని పించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.25,675 కోట్లు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనాలు సిద్ధం చేసుకుంటోంది.
వసూళ్ల పెంపుతో..: కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 42 శాతాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.6.74 లక్షల కోట్ల మేర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దామాషా ప్రకారం అందులో 2.437% అంటే రూ.16,505 కోట్లు తెలంగాణకు రానున్నాయి. వాస్తవానికి గతేడాది బడ్జెట్‌లో పేర్కొన్న లెక్కన తెలంగాణకు పన్నుల వాటా రూ.13,900 కోట్లుగా లెక్కిం చారు. అయితే పన్నుల వసూళ్లు పెరగడంతో మరో రూ.900 కోట్లు అదనంగా వచ్చాయి.
మార్పులేని కేంద్ర పథకాల నిధులు
గతేడాదితో పోలిస్తే కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపుల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. రాష్ట్రంలోని కేంద్ర పథకాలకు గత బడ్జెట్‌లో కేంద్రం రూ.6,000 కోట్లు కేటాయించింది. తాజా బడ్జెట్‌లో రూ.6,694 కోట్లు కేటాయించింది. దీంతో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదని ఆర్థిక శాఖ విశ్లేషించుకుంటోంది.
స్థానిక సంస్థలకు రూ.1,718 కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రాష్ట్రం లోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 1,718 కోట్లు గ్రాంట్ల రూపంలో విడుదల చేస్తుంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మేరకు ఈ నిధుల కేటాయింపు తప్పనిసరి కావటంతో ఇందులో మార్పేమీ లేదు. జాతీయ విపత్తు నిధి నుంచి రూ.302 కోట్లు కేటాయించింది. అందులో రూ.30 కోట్లు రాష్ట్రం తమ వాటాగా జమ చేయాల్సి ఉంటుంది. వెను కబడిన జిల్లాలకు రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.450 కోట్ల గ్రాంటు ఈ ఏడాదీ ప్రత్యేక సాయం (స్పెషల్ అసిస్టెన్స్) కోటాలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
సవరణలతో రూ.900 కోట్లు అదనం
గత బడ్జెట్‌కు చేసిన సవరణల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణకు అదనంగా రూ.900 కోట్ల వరకు నిధులు రానున్నాయి. 2016–17 బడ్జెట్‌లో రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను రూ.5.70 లక్షల కోట్లు పేర్కొన్న కేంద్రం... అంచనాలకు మించి పన్నుల రాబడి పెరగటంతో వాటాను రూ.6.08 లక్షల కోట్లకు సవరించింది. ఈ మేరకు రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా పెరిగింది.