ఇంటి దొంగల పనేనా!
భూపాలపల్లి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ)లో ఘరానా చోరీ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. రెండు శాఖల్లో దొంగతనం జరగడం కలకలం రేపింది.. ఒక బ్యాంకు తాళాలు తీసి ఉన్నా.. మరో బ్యాంకు తాళాలు వేసిఉన్నా భారీగా నగలు, నగదు ఆపహరణకు గురయ్యూరుు.. చోరీ జరిగిన విధానాన్ని చూస్తే ఇంటి దొంగల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నారు.
భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్ : పట్టణంలోని ఏపీజీవీబీ భూపాలపల్లి, ఆజంనగర్ బ్రాంచీల చోరీ ఇంటిదొంగల పనేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లి బ్రాంచి ప్రధాన రహదారిపై ఉండగా ఆజంనగర్ బ్రాం చీని ఆరు రోజుల క్రితమే కారల్‌మార్క్స్ కాలనీలోని ఎస్‌బీఐ బ్యాంకు పైఅంతస్తులోకి మార్చారు. శనివారం ఒంటిపూట పనిదినం కావడంతో రెండు బ్రాంచీల అధికారులు మధ్యాహ్నమే పని ముగించుకుని ఇళ్లకు వెళ్లారు. రోజువారీ విధుల్లో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు రెండు బ్రాంచీ ల మేనేజర్లు మూర్తి, శ్రీనివాస్‌లు ఉద్యోగులతో కలిసి బ్యాంకులకు వెళ్లారు. భూపాలపల్లి బ్రాంచి షెట్టర్ తాళం అప్పటికే తీసి ఉంది.
అనుమానం వచ్చిన అధికారులు స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లారు. తాళం తీసి ఉండగా, లాకర్‌లోని నగదు, బం గారం, వెండి అపహరణకు గురైనట్లు గుర్తించారు. మరో వైపు ఆజంనగర్ బ్రాంచీ అధికారులు బ్యాంకు వద్దకు వెళ్లి ప్రధాన ద్వారం తాళం తీసి లోపలికి వెళ్లారు. స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి తాళం తీసి లాకర్‌ను తెరిచిచూడగా అందులోని నగదు, బం గారం దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. చోరీల విషయా న్ని రెండు బ్రాంచీల అధికారులు స్థానిక పోలీసులకు తెలిపారు. ఈ మేరకు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, ములుగు డీఎస్పీ కటకం మురళీధర్... క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో సంఘటన స్థలాల వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు.
ఆజంనగర్ బ్రాంచీ కిందనే ఎస్‌బీఐ ఉన్నప్పటికీ ఒకే సంస్థకు చెందిన రెండు బ్రాంచీల్లో చోరీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బ్రాంచిలో షెట్టర్ తాళాలు తీసి ఉండడం, మరోచోట వేసి ఉండడమే కాక సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలారం మోగకుండా, ఆనవాళ్లు దొరకకుండా దొంగలు జాగ్రత్తపడడం వెనుక ఇంటి దొంగలు ఉన్నారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. బ్యాంకు లాకర్ తాళాలు 3 సెట్లు ఉంటాయని, అవి మేనేజర్, హెడ్ క్యాషియర్, అకౌంటెంట్ వద్ద ఉంటాయని సమాచారం.
అధికారులు అజాగ్రత్తగా ఉన్న సమయంలో సిబ్బందిలో ఎవరైనా ఆ తాళాల మాదిరిగానే మరో సెట్‌ను తయారు చేయించి చోరీకి పాల్పడ్డారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం భూపాలపల్లి బ్రాంచీలో పని చేసే ఒక తాత్కాలిక ఉద్యోగి విధులకు హాజరు కాలేదు. అతనికి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్విచ్చాఫ్ వచ్చింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఆందోళనలో ఖాతాదారులు
భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీబీ బ్రాంచీల్లో చోరీ జరిగినట్లుగా తెలియడంతో ఖాతాదారులు భారీ ఎత్తున బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. భూపాలపల్లి బ్రాంచి మేనేజర్ మూర్తి బ్యాంకు నుంచి బయటకు రావడంతో అతడిని ఖాతాదారులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తాకట్టు పెట్టిన బంగారం సంగతేంటని, వ్యక్తిగత లాకర్ల విషయమేంటని ప్రశ్నించారు. ఇందుకు మేనేజర్ స్పందిస్తూ వ్యక్తిగత లాకర్ల ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్యాంకు లాకర్‌లోని డబ్బు, నగలు మాత్రమే చోరీకి గురయ్యాయని బదులిచ్చారు.
కాగా, ఏపీజీవీబీ భూపాలపల్లి బ్రాంచిలో రూ.4,37,67,000 విలువైన 16 కిలోల 22 తులాల బంగారం, రూ.17, 40,000 నగదు చోరీకి గురైనట్లు పోలీసులు తేల్చారు. ఆజంనగర్ బ్రాంచిలో రూ.4,86,00,000 విలువైన 18 కిలోల బంగారం, రూ.3,76,100 నగదు అపహరణకు గురైనట్లు వెల్లడించారు. రెండు బ్యాంకుల్లో కలిపి నగదు, బంగారం కలిపి రూ.9,44,83,100 విలువ ఉంటాయని వివరించారు.