సాక్షి, హైదరాబాద్:‘తెలంగాణ మిగులు రాష్ట్రం కాదు.. లోటు రాష్ట్రం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,386 కోట్ల రెవెన్యూ మిగులు నమోదు చేసింది. రెవెన్యూ మిగులును రూ.6,778 కోట్లు ఎక్కువ చేసి చూపించింది. అంటే రాష్ట్రం రూ.5,392 కోట్ల రెవెన్యూ లోటులో ఉంది’భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పద్దులు నమోదు చేయటంలోనే ఈ తప్పులు చేసిందని అంశాల వారీగా కాగ్ వేలెత్తి చూపింది. ‘ఉదయ్ పద్దులో రూ.3,750 కోట్లను గ్రాంటుకు బదులు ఈక్విటీగా చూపించింది.
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్‌లై, సీవరేజ్ బోర్డు అప్పుగా తెచ్చుకున్న రూ.1,500 కోట్లు రాబడిలో జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, హడ్కో నుంచి అప్పుగా తెచ్చుకున్న రూ.1,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలో రెవెన్యూ రాబడిగా రాసుకుంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.528 కోట్ల రెవెన్యూ వ్యయం రుణంగా చూపించి ఖర్చు తక్కువ కనబడేలా చేసింది’అని జమా ఖర్చుల పద్దులో ప్రభుత్వం చేసిన గిమ్మిక్కులను కాగ్ బయటపెట్టింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది.
రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అజాయబ్‌సింగ్ ఈ నివేదికలను మీడియాకు విడుదల చేశారు. ఆదాయ వ్యయాల పరిశీలనతో పాటు వివిధ రంగాల వారీగా తమ ఆడిట్‌లో వెల్లడైన అంశాలను పొందుపరిచినట్లు విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు స్థానిక సంస్థలు, ఆర్థిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, సామాన్య, సామాజిక రంగాలపై విడుదల చేసిన నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల నిర్వహణను కాగ్ తూర్పారబట్టింది. రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని వేలెత్తి చూపింది.
హద్దు మీరిన ద్రవ్యలోటు..
ద్రవ్యలోటు ఆందోళనకరంగా పెరిగిపోయిందని కాగ్ స్పష్టం చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం నిర్దేశించిన 3.5 శాతం దాటిపోయిందని గుర్తించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ద్రవ్యలోటు 5.46 శాతంగా ఉందని, ఉదయ్ పథకం కింద విద్యుత్తు సంస్థలకు బదిలీ చేసిన డబ్బును మినహాయిస్తే 4.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. అప్పుగా తెచ్చిన నిధులను రెవెన్యూ రాబడుల్లో జమ చేసి, ద్రవ్య లోటును రూ.2,500 కోట్ల మేరకు తక్కువ చేసి చూపించిందని రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. ఉదయ్ బాండ్ల ద్వారా రూ.8,931 కోట్లు అప్పు తెచ్చుకుంటే, కేవలం రూ.7,500 కోట్లు డిస్కంలకు విడుదల చేసిందని పేర్కొంది. డిస్కంల మిగతా రుణాలకు కొత్త బాండ్లు జారీ చేయాలని ఉదయ్ పథకం నిర్దేశించినప్పటికీ.. వాటిని జారీ చేయలేదని తప్పుబట్టింది.
ఖర్చెక్కువ.. అభివృద్ధి తక్కువ..
రెవెన్యూ రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని కాగ్ వేలెత్తి చూపింది. ‘రాష్ట్రం మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం 69 శాతంగా నమోదైంది. దీంతో మౌలిక వసతులు, ఆస్తుల కల్పనలో పెట్టుబడికి 31 శాతమే మిగిలి ఉంది’అని కాగ్ ప్రస్తావించింది. 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే రూ.6,184 కోట్లు అధికంగా ఖర్చయితే క్రమబద్ధీకరించలేదని తప్పుబట్టింది. బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ ఖర్చులకు పొంతన లేకపోవటంతో కొన్ని శాఖల్లో భారీగా మిగులు, కొన్నింటిలో కేటాయింపులకు మించి ఖర్చులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది.
గ్రాంట్లకు మించి ఖర్చు చేసిన కేసులు తీవ్ర ఉల్లంఘనలేనని, ఇవి శాసనసభ అభీష్టానికి విఘాతం కలిగిస్తాయని, వెంటనే బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. 2016–17లో బడ్జెట్ కేటాయింపులను మించి చేసిన అధిక ఖర్చు రూ.21,161 కోట్లుగా గుర్తించింది. 16 గ్రాంట్లు, మూడు అప్రాప్రియేషన్లలో చేసిన అధిక వ్యయం రాజ్యాంగం ప్రకారం క్రమబద్ధీకరించాలని సూచించింది.
కేటాయింపులే.. ఖర్చుల్లేవు..
ఎస్సీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధుల్లో 60 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 58 శాతం వినియోగించకుండా చట్టాన్ని నిర్లక్ష్యం చేసిందని కాగ్ వెల్లడించింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఐటీడీఏ జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు, రాష్ట్రంలో ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చు కాలేదని గుర్తించింది. రైతులకు వడ్డీ లేని పంట రుణాలకు నిర్దేశించిన రూ.265 కోట్లు ఖర్చు చేయలేదని వెల్లడించింది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులు పాటించకపోవటం, ఆర్థిక నియంత్రణ లోపించిందని పలు ఉదాహరణలను కాగ్ ప్రస్తావించింది.
వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఉన్న నిల్వలకు, లెడ్జర్‌లో ఉన్న నిల్వలకు వ్యత్యాసముంది. 28,087 వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల్లో రూ.19,873 కోట్ల మొత్తం నిల్వ ఉంది. పీడీ ఖాతాల్లో భారీ మొత్తాలు ఉంచి రుణాలపై 7.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న తీరు ప్రభుత్వ నగదు నిర్వహణ, ఆర్థిక నిర్వహణలు సరిగా లేవని స్పష్టంచేస్తోందని కాగ్ అభిప్రాయపడింది. పథకాల అమలుకు డ్రా చేసిన నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలు(యూసీలు) సమర్పించలేదని, కొన్ని శాఖలు నిధులు వినియోగించకుండానే యూసీలు సమర్పించాయని గుర్తించింది.
అప్పుల కుప్పలపై ఆందోళన
ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో 34.74 శాతం పాత అప్పులను తీర్చేందుకే వినియోగిస్తోందని కాగ్ వెల్లడించింది. 2020–22 సంవత్సరాల మధ్య రూ.14,896 కోట్లు, 2022–24 మధ్య రూ.22,280 కోట్ల అప్పును ప్రభుత్వం తీర్చాల్సి ఉందని, ఈ అప్పును తీర్చేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. మరిన్ని అప్పులు చేయకుండా ఉండేందుకు సముచితమైన చెల్లింపుల వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించుకోవాలని సూచించింది. 2017 మార్చి 31 నాటికి ఉన్న రాష్ట్ర అప్పులు పరిశీలిస్తే.. వచ్చే ఏడేళ్లలో 49 శాతం రుణాలు.. అంటే రూ.56,388 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. 2015–16లో పన్నుల రాబడిలో 7.12 శాతం రుణాలు తిరిగి చెల్లించగా, 2016–17లో ఇది 32.16 శాతానికి పెరిగింది. 14వ ఆర్థిక సంఘం ప్రామాణిక రేటు ప్రకారం రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు 8.22 శాతంగా ఉండాలి. కానీ ఇవి 10.40 శాతానికి పెరిగాయని కాగ్ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment