తెలంగాణకు రెవెన్యూ మిగులు 8,000 కోట్లు
-
సీమాంధ్రకు 14 వేల కోట్ల లోటు
-
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల సడలింపునకు ఆర్థిక శాఖ లేఖ
-
రెవెన్యూ లోటు లేకపోతేనే కేంద్ర నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెవెన్యూ మిగులుతో ఏర్పాటవుతోంది. రాష్ట్ర విభజన సమయం సమీపిస్తున్నందున ఆర్థిక శాఖ రెండు రాష్ట్రాల ఆదాయం, అప్పులను లెక్కకట్టే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (సమైక్య రాష్ర్టం) ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉంది.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ఆర్ధిక క్రమశిక్షణ కోసం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం తీసుకువచ్చారు. ఆ మేరకు అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించడంతో పాటు రెవెన్యూ లోటు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ద్రవ్య లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి మించకుండా చూశారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలోని నిబంధనలను పాటిస్తేనే, రెవెన్యూ లోటు లేకపోతేనే గ్రాంట్ల రూపంలో కేంద్ర నిధులు ప్రభుత్వాలకు వస్తాయి. ప్రస్తుత సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ మిగుల్లోనే ఉంది. ద్రవ్య లోటు మూడు శాతం లోపే ఉంది. అరుుతే ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14 వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడనుంది.
ఈ రాష్ట్రంలో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం రూ.8 వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉండనుంది. రాజధాని ఇక్కడే ఉండడం, తద్వారా ఆదాయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విభజనానంతరం కూడా ఇక్కడ మిగులే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే తెలంగాణకు కేంద్ర గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధులు వచ్చేవిధంగా రెండు ఆర్ధిక సంవత్సరాల పాటు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించాలని ఆర్ధిక శాఖ ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతానికి రెవెన్యూ మిగులు ఉన్నప్పటికీ మిగతా అంశాల్లో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు అమలు చేయడం కష్టసాధ్యమవుతుందని ఆర్థిక శాఖ భావించింది.