ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డ్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ 584వ సెంట్రల్ బోర్డ్ సమావేశం సందర్భంగా ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆకస్మిక అవసరాలకుగాను (ద్రవ్య, ఫైనాన్షియల్ సంబంధ స్థిరత్వం, రుణ, నిర్వహణా సంబంధ వ్యయాలకు) తన మొత్తం బ్యాలెన్స్ షీట్‌లో 5.5 శాతం కంటెన్జెన్సీ రిస్క్ బఫర్ (సీఆర్‌బీ)ను కొనసాగించాలని కూడా ఆర్‌బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించిందని ప్రకటన తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు, కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు, వస్తున్న ఫలితాలు తత్సంబంధ అంశాలపై బోర్డ్ చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. – ప్రస్తుతం ఆర్‌బీఐ ఆర్థిక సంవత్సరం జూలై–జూన్. 2021–22 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్–మార్చికి మారుతుంది. ఈ మార్పునకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 9 నెలలను ఫైనాన్షియల్ ఇయర్‌గా పాటిస్తోంది.
ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై దృష్టి: 6వ తేదీ ఆర్‌బీఐ పాలసీ నిర్ణయానికి అనుగుణంగా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై బోర్డ్ చర్చించడం శుక్రవారం సమావేశంలోని మరో ముఖ్యాంశం. అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, సేవల పటిష్టత లక్ష్యంగా ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేషన్ హబ్)ను ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ఈ నెల 6 పాలసీ ప్రకటన సందర్భంగా నిర్ణయించింది. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. గత ఆర్థిక సంవత్సరం నిర్వహించిన వివిధ కార్యకలాపాలపైనా బ్యాంక్ చర్చించింది. 2019–20 ఆర్‌బీఐ అకౌంట్స్‌ను, వార్షిక నివేదికను ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment