Innovation Hub
-
టెక్ మహీంద్రా, పెరల్ ఇన్నోవేషన్ హబ్
ముంబై: టెక్ మహీంద్రా సహకారంతో బెంగుళూరులో మేకర్స్ ల్యాబ్ పేరుతో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పెరల్ అకాడమీ తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెటావర్స్, గేమింగ్ రంగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్ధేశమని క్రియేటివ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన పెరల్ అకాడమీ పేర్కొంది.‘టెక్ మహీంద్రా సంకేతిక నైపుణ్యంతో మా డిజైన్ ఇన్నోవేషన్లను మిళితం చేయడం ద్వారా పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది’ అని అకాడమీ ప్రెసిడెంట్ అదితీ శ్రీవాస్తవ తెలిపారు. అభివృద్ధి చెందిన సాంకేతిక రంగం కొత్త నైపుణ్యాలను, సృజనాత్మక రంగం అనుభవాలను మేకర్స్ ల్యాబ్ అందిస్తుందన్నారు. -
International Womens Day: అవగాహన ఉన్నా వినియోగం కొంతే..
ముంబై: ఆర్థిక సేవలపై మహిళలకు అవగాహన పెరుగుతున్నప్పటికీ వారు వాటిని వినియోగించుకోవడం తక్కువగానే ఉంటోంది. బీమా తదితర సాధనాల గురించి మూడో వంతు మందికి తెలిసినా కూడా డిజిటల్ విధానంలో కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్క శాతం కూడా ఉండటం లేదు. రిజర్వ్ బ్యాంక్‌లో భాగమైన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, డిజిటల్ చెల్లింపుల నెట్వర్క్ పేనియర్‌బై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మహిళల్లో .. ముఖ్యంగా 18–35 ఏళ్ల వారిలో బీమాపై అవగాహన గతేడాది 29 శాతం మేర పెరిగింది. కానీ పాలసీల వినియోగం 1 శాతానికి లోపే ఉంది. మహిళలు ఎక్కువగా జీవిత బీమా, ఆరోగ్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. 5,000 రిటైల్ స్టోర్స్‌లో ఆర్థిక సేవలను వినియోగించుకున్న ఈ వయస్సు గ్రూప్ మహిళలపై నిర్వహించిన సర్వే ద్వారా అధ్యయన నివేదిక రూపొందింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► రిటైల్ స్టోర్స్‌లో మహిళలు ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్, మొబైల్ రీచార్జీలు, బిల్లుల చెల్లింపుల సర్వీసులను వినియోగించుకుంటున్నారు. ఇతర త్రా పాన్ కార్డు దరఖాస్తులు, వినోదం, ప్రయాణాలు, ఈ–కామర్స్ మొదలైన వాటి సంబంధిత లావాదేవీలూ చేస్తున్నారు. ► తమ పిల్లలకు మంచి చదువు ఇవ్వడానికి అత్యధిక శాతం మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు పొదుపే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు 68% మంది తెలిపారు. ఇక అత్యవసర వైద్యం, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కొనుగోలు కోసం పొదుపు చేసుకోవడమూ యవారికి ప్రాధాన్యతాంశాలు. ► నగదు లావాదేవీలను తగ్గించడానికి ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా చాలా మంది మహిళలు నగదు రూపంలో లావాదేవీలు జరపడానికే ప్రాధాన్యమిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 48 శాతం మంది నగదువైపే మొగ్గు చూపారు. నగదు విత్‌డ్రాయల్ సర్వీసుల కోసమే రిటైల్ స్టోర్‌ను సందర్శిస్తామంటూ 78 శాతం మంది తెలిపారు. ► అయితే, అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ వినియోగమూ పెరుగుతోంది. 5–20% మంది మహిళలు దీనిని ఎంచుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం దాదాపు శూన్యమే. ► డిజిటల్ మాధ్యమం వినియోగం.. 18–40 ఏళ్ల గ్రూప్ మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. వారిలో 60%మందికి పైగా మహిళలకు స్మార్ట్ఫోన్లు, వాటి ద్వారా డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉంటోంది. -
డిజిటల్‌గా కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ
న్యూఢిల్లీ: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) జారీని సులభతరం చేసే ప్రక్రియకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి. కేసీసీ తీసుకునేందుకు పేపర్ రూపంలో స్థల రికార్డుల పత్రాలను దాఖలు చేయడం, భౌతికంగా బ్యాంకు శాఖను సందర్శించడం వంటి బాదరబందీ లేకుండా డిజిటల్‌గానే ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపాయి. ఇందుకోసం రెండు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్)తో జట్టు కట్టాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో, ఫెడరల్ బ్యాంక్.. చెన్నైలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించాయి. బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా మొబైల్ హ్యాండ్సెట్ ద్వారా కేసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్లోనే పొలం వెరిఫికేషన్ కూడా జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడీ ఎ మణిమేఖలై తెలిపారు. -
కేంద్రానికి ఆర్బీఐ రూ.57,128 కోట్ల చెక్
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డ్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ 584వ సెంట్రల్ బోర్డ్ సమావేశం సందర్భంగా ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక అవసరాలకుగాను (ద్రవ్య, ఫైనాన్షియల్ సంబంధ స్థిరత్వం, రుణ, నిర్వహణా సంబంధ వ్యయాలకు) తన మొత్తం బ్యాలెన్స్ షీట్లో 5.5 శాతం కంటెన్జెన్సీ రిస్క్ బఫర్ (సీఆర్బీ)ను కొనసాగించాలని కూడా ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించిందని ప్రకటన తెలిపింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు, కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు, వస్తున్న ఫలితాలు తత్సంబంధ అంశాలపై బోర్డ్ చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. – ప్రస్తుతం ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం జూలై–జూన్. 2021–22 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్–మార్చికి మారుతుంది. ఈ మార్పునకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 9 నెలలను ఫైనాన్షియల్ ఇయర్‌గా పాటిస్తోంది. ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై దృష్టి: 6వ తేదీ ఆర్బీఐ పాలసీ నిర్ణయానికి అనుగుణంగా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై బోర్డ్ చర్చించడం శుక్రవారం సమావేశంలోని మరో ముఖ్యాంశం. అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, సేవల పటిష్టత లక్ష్యంగా ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేషన్ హబ్)ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ఈ నెల 6 పాలసీ ప్రకటన సందర్భంగా నిర్ణయించింది. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. గత ఆర్థిక సంవత్సరం నిర్వహించిన వివిధ కార్యకలాపాలపైనా బ్యాంక్ చర్చించింది. 2019–20 ఆర్బీఐ అకౌంట్స్‌ను, వార్షిక నివేదికను ఆమోదించింది. -
హైదరాబాద్‌లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసింది. వైర్లెస్ టెక్నాలజీ అగ్రగామి క్వాల్కామ్ టెక్నాలజీస్ సహకారంతో దీనిని స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న సంస్థల నూతన డిజిటల్ అవసరాలను తీర్చేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని డొమెయిన్ ఆధారిత పరిష్కారాలను ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తారు. ఆరోగ్యం, వాహన, తయారీ, చిల్లర వర్తకం వంటి వివిధ రంగాల్లో 5జీ వినియోగం ద్వారా కొత్త అవకాశాలను కనుగొంటారు. ఈ పరిష్కారాలతో కస్టమర్లు సరికొత్త వ్యాపార పద్ధతులు, విభిన్న ఉత్పత్తులు, విలువ ఆధారిత సేవలతోపాటు వినియోగదార్లకు మెరుగైన అనుభూతి కలిగించేందుకు దోహదం చేస్తుందని టీసీఎస్ తెలిపింది. తద్వారా కంపెనీలకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయని వివరించింది. -
ప్రతి యూనివర్సిటీ ఓ స్టార్టప్ హబ్!
-
ప్రతి యూనివర్సిటీ ఓ స్టార్టప్ హబ్!
- సృజనాత్మక పరిశోధనలకు ప్రాధాన్యమిస్తామన్న కేంద్రం - పరిశ్రమలతో లింకేజీపై కసరత్తు చేయాలని యూనివర్సిటీలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి యూనివర్సిటీ కూడా ఓ స్టార్టప్, ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు సిద్ధం కావాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది. యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టాలని సూచిం చింది. పారిశ్రామిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా, ఉత్తమ ఉత్పత్తులకు తోడ్పడేలా పరిశోధనలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం పరిశ్రమలతో యూనివర్సిటీలను అనుసంధానం చేయడం (లింకేజీ) వంటి చర్యలు చేపట్టాలని.. అలాంటి యూనివర్సిటీలకు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులు ఇస్తామని తెలిపింది. రూసాలోని ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, మేనేజ్మెంట్ మానిటరింగ్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్’ కింద ఒక్కో రాష్ట్రానికి రూ.120 కోట్లు ఇస్తామని పేర్కొంది. కానీ ఈ కేటగిరీ కింద మన రాష్ట్రం నుంచి రూసాకు ఒక్క ప్రతిపాదన కూడా అందలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఆ దిశగా కృషి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అన్ని వర్సిటీలకు ఆదేశాలు ఈనెల 21న ఢిల్లీలో రూసా నేషనల్ మిషన్ డైరెక్టర్ (ఎన్ఎండీ) సమావేశం జరిగింది. దానికి రాష్ట్రం నుంచి కళాశాల విద్య కమిషనర్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అధికారులు స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్ కింద తమ ప్రతిపాదనలు అందజేశారు కూడా. అయితే తెలంగాణ నుంచి కూడా అలాంటి ప్రతిపాదనలను అందజేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విజయ్‌కుమార్ వెల్లడించారు. పరిశోధనలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా వర్సిటీలకు కొత్త రూపు రావడంతోపాటు, పరిశ్రమలతో లింకేజీతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ దిశగా కృషి చేయాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రూసా కింద ప్రతి రాష్ట్రంలో 8 నుంచి 10 ప్రాజెక్టులను ఈనెల 28లోగా ప్రారంభించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని ఎన్ఎండీ స్పష్టం చేసింది. ఇక రూసా నిధులు ఇవ్వాలంటే యూనివర్సిటీలు, కాలేజీలకు న్యాక్ ఎ లేదా బి అక్రిడిటేషన్ ఉండాలి. దీంతో న్యాక్ అక్రిడిటేషన్ పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలను ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది.