- సృజనాత్మక పరిశోధనలకు ప్రాధాన్యమిస్తామన్న కేంద్రం
- పరిశ్రమలతో లింకేజీపై కసరత్తు చేయాలని యూనివర్సిటీలకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి యూనివర్సిటీ కూడా ఓ స్టార్టప్, ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు సిద్ధం కావాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది. యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టాలని సూచిం చింది. పారిశ్రామిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా, ఉత్తమ ఉత్పత్తులకు తోడ్పడేలా పరిశోధనలు చేపట్టాలని స్పష్టం చేసింది.
ఇందుకోసం పరిశ్రమలతో యూనివర్సిటీలను అనుసంధానం చేయడం (లింకేజీ) వంటి చర్యలు చేపట్టాలని.. అలాంటి యూనివర్సిటీలకు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులు ఇస్తామని తెలిపింది. రూసాలోని ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్, మేనేజ్‌మెంట్ మానిటరింగ్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్’ కింద ఒక్కో రాష్ట్రానికి రూ.120 కోట్లు ఇస్తామని పేర్కొంది. కానీ ఈ కేటగిరీ కింద మన రాష్ట్రం నుంచి రూసాకు ఒక్క ప్రతిపాదన కూడా అందలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఆ దిశగా కృషి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
అన్ని వర్సిటీలకు ఆదేశాలు
ఈనెల 21న ఢిల్లీలో రూసా నేషనల్ మిషన్ డైరెక్టర్ (ఎన్‌ఎండీ) సమావేశం జరిగింది. దానికి రాష్ట్రం నుంచి కళాశాల విద్య కమిషనర్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అధికారులు స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్ కింద తమ ప్రతిపాదనలు అందజేశారు కూడా. అయితే తెలంగాణ నుంచి కూడా అలాంటి ప్రతిపాదనలను అందజేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విజయ్‌కుమార్ వెల్లడించారు. పరిశోధనలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా వర్సిటీలకు కొత్త రూపు రావడంతోపాటు, పరిశ్రమలతో లింకేజీతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ దిశగా కృషి చేయాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రూసా కింద ప్రతి రాష్ట్రంలో 8 నుంచి 10 ప్రాజెక్టులను ఈనెల 28లోగా ప్రారంభించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని ఎన్‌ఎండీ స్పష్టం చేసింది. ఇక రూసా నిధులు ఇవ్వాలంటే యూనివర్సిటీలు, కాలేజీలకు న్యాక్ ఎ లేదా బి అక్రిడిటేషన్ ఉండాలి. దీంతో న్యాక్ అక్రిడిటేషన్ పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలను ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది.
ప్రతి యూనివర్సిటీ ఓ స్టార్టప్ హబ్!
Published Wed, Sep 28 2016 2:54 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
Advertisement