Startup Hub
-
CM YS Jagan Davos Tour: ‘యూనికార్న్’ విశాఖ
సాక్షి, అమరావతి: నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖను యూనికార్న్ స్టార్టప్ (సుమారు రూ.7,700 కోట్ల విలువ చేరుకున్నవి) హబ్‌గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు నాలుగో రోజు సమావేశాల సందర్భంగా యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈవోలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. షిండ్లర్ శిక్షణ కేంద్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి షిండ్లర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ఖండ్పూర్ తదితరులు ఆన్లైన్ షాపింగ్ సంస్థ మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రేయ, ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ బైజూస్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుష్మిత్ సర్కార్, ఇండియాలో క్రిప్టో కరెన్సీ లాంటి సేవలు అందిస్తున్న కాయిన్‌స్విచ్ కుబేర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో ఆశిష్ సింఘాల్, పర్యాటక బుకింగ్ పోర్టల్ ఈజ్‌మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌పిట్టి, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు.. సతీష్ జయకుమార్, ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ కొర్సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్‌తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమై రాష్ట్రంలో స్టార్టప్స్ కంపెనీల ఏర్పాటు, అభివృద్ధిపై చర్చించారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన స్విట్జర్లాండ్‌లోని ప్రవాసాంధ్రులు విశాఖకు స్వాగతం.. విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, మీ అందరికీ నగరం ఆహ్వానం పలుకుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. వనరులు సమకూర్చడం, విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం వారితో చర్చించారు. బైజూస్ ఫౌండర్ అండ్ సీఈవో రవీంద్రన్తో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంతో కలసి పనిచేస్తాం ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పి బైజూస్ పాఠ్యప్రణాళికను రాష్ట్ర విద్యార్థులకు అందిస్తామని బైజూస్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుష్మిత్ సర్కార్ వెల్లడించారు. రాష్ట్ర విద్యారంగానికి తోడ్పాటు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే, రికార్డులను భద్రపరచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై కాయిన్‌స్విచ్ క్యూబర్ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ సింఘాల్‌తో సీఎం జగన్ చర్చించారు. సర్వే రికార్డులు నిక్షిప్తం చేయడంపై సహకారం అందిస్తామని సింఘాల్ తెలిపారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి చేయూత అందించి పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేలా సహకారం అందిస్తామని ఈజ్‌మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి సీఎంతో సమావేశం సందర్భంగా పేర్కొన్నారు. -
విశాఖ నగరంపై స్టార్టప్ కంపెనీల దృష్టి, భారీగా పెట్టుబడులు
సాక్షి, అమరావతి: నూతన టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖపట్నం వేదిక కానుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ) కేంద్రాలు విశాఖలో సిద్ధమయ్యాయి. స్టీల్ ప్లాంట్‌లో ఒకటి.. ఏయూలో మరొకటి దేశ పారిశ్రామిక రంగంలో ఆటోమేషన్‌ను పెంచే విధంగా ఇండస్ట్రీ–4 టెక్నాలజీకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా విశాఖ స్టీల్‌లో కల్పతరువు పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రూపుదిద్దుకుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు స్టీల్ ప్లాంట్ రూ.10 కోట్లు కేటాయించగా కేంద్రం రూ.30 కోట్లను మంజూరు చేసింది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్న ఇండస్ట్రీ–4 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను జనవరిలో కేంద్రమంత్రుల ద్వారా ప్రారంభించేలా ఎస్టీపీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి మరో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్ నెలకొల్పింది. ఆంధ్రా యూనివర్సిటీలో సుమారు 3,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్, 3–డీ ప్రింటర్స్, పీసీబీ ప్రొటోటైప్ మెషీన్స్, సోల్డరింగ్ స్టేషన్లు, హైఎండ్ ఆసిలోస్కోప్స్‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నారు. నాస్కామ్ ఏర్పాటు చేసిన సీవోఈని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. నగరంపై స్టార్టప్ కంపెనీల దృష్టి విశాఖపట్నంలో పలు భారీ పరిశ్రమలు ఉన్నందున నాలుగో తరం పారిశ్రామిక ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రెండు సీవోఈలు సిద్ధం కావడంతో స్టార్టప్ కంపెనీలు నగరానికి క్యూ కడతాయని ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. పరిశ్రమల్లో ఆటోమేషన్‌ను పెంచేందుకు బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఈ రంగంలో కృషి చేస్తున్న అన్ని స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు విశాఖకు రానున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) అంచనా వేస్తోంది. విశాఖలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన రంగాల్లో టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన అప్లికేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు నాస్కామ్ తెలిపింది. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి విద్య, వైద్యం, సంక్షేమ శాఖల్లో ఐవోటీ, ఏఐ టెక్నాలజీని వినియోగించే విధంగా నాస్కామ్ పలు అప్లికేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే మార్క్‌ఫెడ్‌తో కలసి డిజిటల్ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఐటీ హబ్‌గా విశాఖ... హైఎండ్ టెక్నాలజీ వినియోగంలో విశాఖను ఒక హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఎస్టీపీఐ, నాస్కామ్లతో పాటు పలు సంస్థలు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటి ద్వారా నూతన టెక్నాలజీలో మరిన్ని ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుంది. - మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఏడాదిలో స్టార్టప్స్ రెట్టింపు కీలకమైన రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు కావడం ద్వారా విశాఖ నగరం స్టార్టప్ హబ్‌గా మారనుంది. తెలంగాణలో టీ–హబ్ మాదిరిగా ఇండస్ట్రీ–4 సీవోఈకి భారీ డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 100 వరకు స్టార్టప్‌లు ఉండగా ఏడాది వ్యవధిలో రెండు రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. – శ్రీధర్, ప్రెసిడెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఏపీ(ఐటాప్) -
టి–హబ్‌లో రక్షణ రంగ స్టార్టప్‌ల వర్క్‌షాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగ స్టార్టప్ సంస్థలకు సంబంధించిన వర్క్‌షాప్‌కు హైదరాబాద్‌లోని టి–హబ్ వేదిక కానుంది. డిసెంబర్ 16, 17 తారీఖుల్లో (సోమ, మంగళ) రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌ను.. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ (న్యూఢిల్లీ) కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత్, అమెరికా రక్షణ రంగ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడనుంది. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి స్టార్టప్ సంస్థలు వినూత్న ఆవిష్కరణలు ఇందులో ప్రదర్శించనున్నాయి. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు ఈ వర్క్‌షాపులో పాల్గోనున్నారు. -
ప్రతి యూనివర్సిటీ ఓ స్టార్టప్ హబ్!
-
ప్రతి యూనివర్సిటీ ఓ స్టార్టప్ హబ్!
- సృజనాత్మక పరిశోధనలకు ప్రాధాన్యమిస్తామన్న కేంద్రం - పరిశ్రమలతో లింకేజీపై కసరత్తు చేయాలని యూనివర్సిటీలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి యూనివర్సిటీ కూడా ఓ స్టార్టప్, ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు సిద్ధం కావాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది. యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టాలని సూచిం చింది. పారిశ్రామిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా, ఉత్తమ ఉత్పత్తులకు తోడ్పడేలా పరిశోధనలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం పరిశ్రమలతో యూనివర్సిటీలను అనుసంధానం చేయడం (లింకేజీ) వంటి చర్యలు చేపట్టాలని.. అలాంటి యూనివర్సిటీలకు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులు ఇస్తామని తెలిపింది. రూసాలోని ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, మేనేజ్మెంట్ మానిటరింగ్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్’ కింద ఒక్కో రాష్ట్రానికి రూ.120 కోట్లు ఇస్తామని పేర్కొంది. కానీ ఈ కేటగిరీ కింద మన రాష్ట్రం నుంచి రూసాకు ఒక్క ప్రతిపాదన కూడా అందలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఆ దిశగా కృషి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అన్ని వర్సిటీలకు ఆదేశాలు ఈనెల 21న ఢిల్లీలో రూసా నేషనల్ మిషన్ డైరెక్టర్ (ఎన్ఎండీ) సమావేశం జరిగింది. దానికి రాష్ట్రం నుంచి కళాశాల విద్య కమిషనర్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అధికారులు స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్ కింద తమ ప్రతిపాదనలు అందజేశారు కూడా. అయితే తెలంగాణ నుంచి కూడా అలాంటి ప్రతిపాదనలను అందజేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విజయ్‌కుమార్ వెల్లడించారు. పరిశోధనలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా వర్సిటీలకు కొత్త రూపు రావడంతోపాటు, పరిశ్రమలతో లింకేజీతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ దిశగా కృషి చేయాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రూసా కింద ప్రతి రాష్ట్రంలో 8 నుంచి 10 ప్రాజెక్టులను ఈనెల 28లోగా ప్రారంభించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని ఎన్ఎండీ స్పష్టం చేసింది. ఇక రూసా నిధులు ఇవ్వాలంటే యూనివర్సిటీలు, కాలేజీలకు న్యాక్ ఎ లేదా బి అక్రిడిటేషన్ ఉండాలి. దీంతో న్యాక్ అక్రిడిటేషన్ పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలను ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది.