
విశాఖపట్నంలో మాట్లాడుతున్న జిల్లాల పునర్విభజన కమిటీ చైర్మన్ విజయకుమార్ చిత్రంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, సి.హరికిరణ్, ఎ.సూర్యకుమారి, శ్రీకేష్ లాఠకర్
సాక్షి, విశాఖపట్నం: పునర్విభజనకు సంబంధించి నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను పూర్తిచేశామని జిల్లాల పునర్విభజన కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. మార్చి 3న ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేసి అదే రోజు మొత్తం నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విశాఖ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరితో కలిపి నాలుగు జిల్లాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఆయన పరిశీలించారు. ఈ జిల్లాల కలెక్టర్లతో పాటు రాష్ట్ర సర్వే, సెటిల్‌మెంట్ అండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్ధ్ జైన్‌తో కలిసి వాటిని స్క్రూటినీ చేశారు. అనంతరం విజయకుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం మేరకే జిల్లాల విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతోందని స్పష్టంచేశారు.
ఈ ప్రక్రియ తర్వాత రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో సగటున 18 నుంచి 20 లక్షల జనాభా ఉంటుందన్నారు. దీంతో పరిపాలన సౌలభ్యం కలగడంతోపాటు మారుమూల గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలపై చర్చించామని ఆయన చెప్పారు. వీటి నుంచి మొత్తం 4,590 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే 4,000 వచ్చాయన్నారు. విజయనగరం 40, విశాఖపట్నం 250, తూర్పు గోదావరి జిల్లా నుంచి 300 అభ్యంతరాలు వచ్చాయని విజయకుమార్ చెప్పారు. ఇక కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో 90 శాతం కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటుచేసేలా చర్యలు చేపడుతున్నామని.. అవిలేని చోట ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు.
నాలుగు జిల్లాల్లో ప్రధాన అభ్యంతరాలివే..
ఇక ఈ 4 జిల్లాల్లో గుర్తించిన ప్రధాన అభ్యంతరాలను విజయకుమార్ వివరించారు. అవేమిటంటే..
► తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాకుండా రాజమండ్రి జిల్లాలోనే చేర్చాలి.
► అమలాపురం జిల్లాలో ఉండే మండపేట, జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలాన్ని రాజమండ్రిలోనే కొనసాగించాలి.
► అలాగే, విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలి.
► పార్వతీపురం పేరును జిల్లాగా ఉంచాలి.
► పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలి.
► అనకాపల్లి జిల్లాకు నర్సీపట్నం కేంద్రం చేయాలి.
ఈ కార్యక్రమంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు డాక్టర్ మల్లికార్జున, సి. హరికిరణ్, ఎ. సూర్యకుమారి, శ్రీకేష్ లాఠకర్‌లు పాల్గొన్నారు.
జనగణనకు ఇబ్బంది ఉండదు
2020–21లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా జరగలేదని విజయకుమార్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ నెలాఖరు నాటికి జిల్లా సరిహద్దులను మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చని చెప్పారని.. కానీ, అంతకన్నా ముందే ఏప్రిల్ 2 నాటికే ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తికానుందన్నారు. కాబట్టి జనగణనకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నారు.