కీలకరంగాల్లో వృద్ధిరేటు వేగంగా పడిపోవడం, బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోవడం, రూపాయి విలువ పతనం, నిరుద్యోగిత తారస్థాయికి చేరడం, వస్తుసేవల వినియోగం తగ్గుముఖం పట్టడం, దేశంలో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతుండటం.. ఇవన్నీ దేశ ఆర్థిక జవజీవాలు ప్రమాదంలో పడుతున్నాయని సంకేతిస్తున్నాయి. వినియోగదారుల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లడం అనే ఒకే ఒక కారణంవల్లే దేశ స్థూల ఉత్పత్తికి ఊపిరినిచ్చే కీలకరంగాలు ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా బలహీనతకు లోనవుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి ఎంత బలంగా ఉంటే అంతగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం అన్నది ఏ ప్రభుత్వానికైనా అతిపెద్ద సవాలు. అదే లక్ష్యం కూడా. దీన్ని పక్కనబెట్టి ఆర్థిక మాంద్యానికి అరకొర మందులు ఎన్ని వేసినా ఫలితం శూన్యమే.
తుపాను ముందు ఏర్పడే ప్రశాంతత మాదిరిగా.. తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభానికి ప్రతీకగా దేశ ఆర్థికరంగం నిస్తేజంగా తయారైంది. ఆర్థికరంగం మందగమనం దుష్ఫలితాలు పలు రంగాలలో అనేక రూపాల్లో కనపడుతున్నాయి. కీలకరంగాల్లో వృద్ధిరేటు వేగంగా పడిపోతున్నది. బంగారం ధర అనూహ్యంగా పెరుగుతున్నది. రూపాయి విలువ పతనం చెందుతున్నది. 4 దశాబ్దాల కనిష్టానికి నిరుద్యోగిత చేరింది. అదేవిధంగా, దేశంలో వస్తుసేవల వినియోగం తగ్గింది. విదేశీ ఎగుమతులు మందగించాయి. మౌలిక సదుపాయాల రంగంలో జరిగే ప్రభుత్వ వ్యయంలో క్షీణత నమోదవుతున్నది. ప్రైవేటు పెట్టుబడులు నిరుత్సాహంగా ఉన్నాయి. నిజానికి, దేశంలో ఇప్పటికే మాంద్యం ఏర్పడిందన్న వాదన కూడా విన్పిస్తున్నది.
కొత్త ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలకే ఎసరొస్తున్న దీనావస్థ అందుకు ప్రధాన సంకేతం. ఇవన్నీ తీవ్రమైన ఆర్థిక మందగమనానికి సాక్ష్యాలు. ఆర్థిక మందగమనానికి, మాంద్యానికి తేడా ఉందని.. ప్రస్తుతం దేశంలో ఏర్పడింది ఆర్థిక మందగమనమే తప్ప.. మాంద్యం కాదన్న వాదన కూడా విని పిస్తున్నది. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వరుసగా రెండు త్రైమాసికాలలో వృద్ధిరేటు క్షీణించినపుడు.. ముఖ్యంగా, దేశంలో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నప్పుడు.. దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల ఎవరికైనా ఆందోళన కలగడం సహజం. మందగమనమైతే ఆర్థిక రంగం త్వరితగతిన కోలుకొనే అవకాశం ఉంది. అదే మాంద్యం అయితే.. కోలుకోవడానికి దీర్ఘకాలం పడుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కావడానికి ప్రధాన కారణం.. వినియోగదారుల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లడమే. ఈ ఒక్క కారణంగానే దేశ స్థూల ఉత్పత్తికి ఊపిరినిచ్చే కీలకరంగాలు ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా బలహీనతకు లోనవుతున్నాయి. దేశంలో వాహనరంగం గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది. వాహన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. కొన్ని కంపెనీలైతే తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేశాయి. డీలర్ల వద్ద కార్ల నిల్వ పెరిగిపోయింది. కార్ల తయారీ కంపెనీలు కొన్ని వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా అధిక వేతనాలు అందుకొనే ఉద్యోగులను తొలగించడానికి సిద్ధపడుతున్నాయి. వాహన విక్రయాలు తగ్గడంతో పరికరాల తయారీ పరిశ్రమపైన ప్రభావం పడుతోంది.
ఈ పరిస్థితి మెరుగుపడనట్లయితే.. దాదాపు 3.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న దేశీయ ఆటో మొబైల్ రంగంలో ఏకంగా 10 లక్షల మేర ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందని ‘ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎమ్‌ఏ)’ స్పష్టం చేసింది. స్థిరాస్తి రంగంలోనూ ఇదే పరిస్థితి. చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ధరల్లో పెరుగుదల లేకపోగా క్రయవిక్రయాల లావాదేవీలు మందగించాయి.
250 అనుబంధ పరిశ్రమలకు మూలాధారంగా ఉన్న నిర్మాణ రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా అనేక దుష్ఫ లితాలు కన్పిస్తున్నాయి. ఇటుకలు, సిమెంట్, ఉక్కు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్, తదితర రంగాలు అమ్మకాలు లేక వెలవెలపోతున్నాయి. జీఎస్టీ భారాన్ని తగ్గించాలని, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, రుణ లభ్యత పెంచాలని నిర్మాణ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకొంటున్నాయి. ఐదు రూపాయలకు లభించే బిస్కెట్ ప్యాకెట్లు సైతం ఇంతకుముందులా వేగంగా అమ్ముడు కావడం లేదని తయారీ సంస్థలు పేర్కొంటున్నాయంటే.. ప్రజల కొనుగోలు శక్తి ఏవిధంగా తగ్గిందో అర్థం చేసుకోవచ్చు.
రూపాయి క్షీణత, పెద్దనోట్ల రద్దు
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో రెండేళ్లుగా ఒడిదుడుకులకు లోనవుతున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మరింత సంక్షోభంలో కూరుకొనిపోయింది. ముఖ్యంగా.. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే మార్గాల్లో ఒకటైన ఎగుమతులు పడకేశాయి. 2013–14లో 31,488 కోట్ల డాలర్ల మేర జరిగిన ఎగుమతులు 2017–18 నాటికి 30,331 కోట్ల డాలర్లకు పడిపోయాయి. అయితే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఎగుమతులపై ఆధారపడకపోవడం కొంత మేలైంది.
అయితే, ఆర్థికరంగానికి వెన్నెముకగా నిలిచే ప్రైవేటు పెట్టుబడులను పరిశీలిస్తే 2011 వరకూ సగటున రూ. 25 లక్షల కోట్లుగా నమోదు కాగా, ఆ మొత్తం 2018– 19 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.5 లక్షల కోట్లకు పడిపోయింది. దేశంలో పెట్టే మొత్తం పెట్టుబడుల్లో.. దాదాపు 66%గా ఉండే ప్రైవేటు పెట్టుబడులు 2018–19 ఆర్థిక సంవత్సరంలో 47%నికి క్షీణించాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గడిచిన పదేళ్లలో ఏడేళ్లుగా క్షీణిస్తున్నది. రూపాయి క్షీణత వల్ల దేశీయ కార్పొరేట్ సంస్థల్లో విదేశీ మదుపరుల వాటాలు, ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులు పడిపోతున్నాయి. మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల దిగుమతులకు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఈ అంశాలు దేశంలో నగదు నిల్వల తగ్గుదలకు కారణం అవుతున్నాయి.
వేధిస్తున్న నగదు లభ్యత
మొండి బకాయిలు (ఎన్‌పిఏ) కారణంగా బ్యాంకులు రుణాల మంజూరును కఠినతరం చేయడంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎన్నడూ లేనివిధంగా నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రజల కొనుగోళ్లు, వినియోగం తగ్గాయి. వివిధ పరిశ్రమల టర్నోవర్‌లో క్షీణత నమోదవుతున్నది. ఫలితంగా.. ప్రభుత్వానికి పన్నులు, ఇతరత్రా రూపేణా సమకూరే ఆదాయం తగ్గింది. దీంతో ఆయా రంగాల్లో ప్రభుత్వ వ్యయం పడిపోయింది. రెండు, మూడేళ్ల ముందు వరకూ ప్రభుత్వ వ్యయంలో వృద్ధి ఏడాదికి సగటున 19% ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది దాదాపుగా 10%కి పరి మితం అయింది. దీంతో దేశ వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్ఠస్థాయికి చేరుకొని 6.3% వద్ద నిలబడింది.
కేంద్రం దిద్దుబాటు చర్యలు
ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం లక్షణాలపై కేంద్రం అప్రమత్తం అయింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు ఉన్నతాధికారులతో సమావేశమై ప్రత్యామ్నాయాలపై సుదీర్ఘంగా చర్చించి కొన్ని చర్యలు చేపట్టారు. సంపద సృష్టించే వారికి తమ ప్రభుత్వం మద్దతు ఉంటుందని ప్రకటించడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. కేంద్రం తీసుకున్న చర్యలను పరిశీలించినట్లయితే.. ద్రవ్య లభ్యత పెంచడానికి బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తున్నారు.
రెపో రేట్ల కోత బదిలీలకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, జలాన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్బీఐ బోర్డ్ ఆమోదముద్ర వేయడం గొప్ప ఊరట. ఈ నిధుల లభ్యతతో ఆర్థిక వృద్ధిరేటును మెరుగుపర్చడం సాధ్యపడుతుంది. ఇదికాక మొత్తంగా రూ. 5 లక్షల కోట్ల నగదు చలామణిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గృహ, వాహన, ఇతర రిటైల్ రుణాలు చౌకగా అందిస్తున్నట్లు ప్రకటించారు. వాహనాల పన్నుల్లో కోత విధించడం, ప్రభుత్వమే భారీగా కార్లు కొనడం తదితర చర్యలు తీసుకుంటున్నారు.
ఏంజెల్ పన్ను వల్ల ఇబ్బందుల పాలవుతున్న స్టార్టప్‌లకు (అంకుర కంపెనీలకు) ఆ పన్నును తొలగించారు. అధిక సంపన్నవర్గాలపై సర్‌చార్జి ఉపసంహరణ, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు 60 రోజుల్లోనే జీఎస్టీ రిఫండ్‌లు మొదలైన పలు రాయితీలను ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్యాకేజీలూ (ఉద్దీపనలు) ప్రకటించబోమని స్పష్టం చేసినప్పటికీ.. ఆర్థిక మందగమనం రీత్యా కేంద్రం దిగిరాక తప్పలేదు. కేంద్రం కొన్ని నెలల క్రితమే సమర్పించిన బడ్జెట్‌లోని నిర్ణయాలపై ‘యు టర్న్’ తీసుకున్నదని కొందరు విమర్శిస్తున్నప్పటికీ.. ఈ చర్యలను సానుకూల దృష్టితోనే చూడాలి.
ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి కేంద్రం ఏ చర్య తీసుకున్నా స్వాగతించాల్సిందే. ముఖ్యంగా.. నగదు లభ్యత పెరగాలి. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత గరిష్ఠస్థాయికి చేరగలగాలి. కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలి. ఇవన్నీ సాకారం కావాలంటే.. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. తాజాగా, కేంద్రం తీసుకున్న ఉద్దీపన చర్యలు ఆర్థిక మాంద్యం రుగ్మతకు మందుగా పని చేయగలవా? ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి ఉరుకులు పెట్టించగలవా? ప్రతిపక్షాలు విమర్శిం చినట్లు ఇవి అరకొర చర్యలేనా? ఈ ప్రశ్నలకు జవాబులు భవిష్యత్తు పరిణామాలే స్పష్టం చేయగలవు.
వ్యాసకర్త: సి. రామచంద్రయ్య
మాజీ ఎంపీ, అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Comments
Please login to add a commentAdd a comment