పేమెంటు బ్యాంకులకు పోటీగా సీఎస్‌పీలు
ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య
కోల్‌కతా : పేమెంట్ బ్యాంకులతో పోటీపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో.. తక్కువ వ్యయాలతో బ్యాంకింగ్ సేవలు అందించేందుకు తాము ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే మరింత మారుమూల ప్రాంతాలకు చొచ్చుకుపోగలగడం పేమెంట్ బ్యాంకులకు అనుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. గ్రామగ్రామాన పేమెంట్ బ్యాంకుల అసోసియేట్లు ఉండటం వల్ల వాటి నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయని ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అరుంధతి భట్టాచార్య చెప్పారు.
ఈ నేపథ్యంలో వాటితో పోటీపడేందుకు బ్యాం కింగ్ సేవలు లేని పంచాయతీల్లో ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్లు (సీఎస్‌పీ) ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మొబైల్ ఫోన్, ప్రింటర్, స్కానర్‌ను ఉపయోగించగలిగేలా కనీస విద్యార్హతలున్న యువతకు శిక్షణనివ్వనున్నట్లు అరుంధతి భట్టాచార్య చెప్పారు. తాము ఇటీవల ప్రవేశపెట్టిన మొబైల్ వాలెట్ ‘బడీ’ కూడా పేమెంట్ బ్యాంకుల పరిధిలోనే పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. సంప్రదాయ బ్యాంకులతో పోలిస్తే రుణాలు ఇవ్వలేకపోవడం పేమెంట్ బ్యాంకులకు ప్రతికూలాంశమని అరుంధతి భట్టాచార్య వివరించారు.
బ్యాంక్ యూనియన్ల వ్యతిరేకత..
వడోదర: పేమెంట్ బ్యాంకుల ఏర్పాటును ‘ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్’ (ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది. పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు ప్రభావం ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఉంటుందని పేర్కొంది. పేమెంట్ బ్యాంకుల వల్ల ప్రైవేట్ రంగ బ్యాంకుల ప్రాధాన్యం పెరుగుతుంది, ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ వాటా తగ్గే అవకాశం ఉందని వివరించింది. దాదాపు 41 సంస్థలు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే వాటిలో 11 సంస్థలకు ఆర్‌బీఐ ఇటీవల అనుమతినిచ్చింది.