ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పొదుపు ఖాతా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లకు మరింత కత్తెర వేసింది. రూ. లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా 3.50 శాతంగా ఉన్న రేటు ఇకపై 3.25%కి తగ్గనుంది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. తగినంత ద్రవ్య లభ్యత ఉన్నందున సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్‌పై రేటును (రూ. లక్ష దాకా బ్యాలెన్స్) సవరిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాల వ్యవధి గల టర్మ్ డిపాజిట్లు, బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు, 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇది అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది.
రుణాలపై 0.10 శాతం తగ్గింపు..
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను స్వల్పంగా 0.10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రుణాలపై రేటు తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్‌ఆర్ ఇకపై 8.15% కాకుండా 8.05%గా ఉండనుంది. ఈ తగ్గింపు అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. ‘పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని వివిధ విభాగాల ఖాతాదారులందరికీ ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం‘ అని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన ఎస్‌బీఐ.. రుణాలపై వడ్డీ రేటును మాత్రం 0.10 శాతమే తగ్గించడం గమనార్హం. వృద్ధికి ఊతమిచ్చే దిశగా తక్కువ వడ్డీ రేట్లకే ప్రజలకు రుణాలు అందాలన్న లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను (రెపో రేటు) తగ్గిస్తూ వస్తోంది. అయినప్పటికీ బ్యాంకుల స్థాయిలో ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందడం లేదు. ఆర్‌బీఐ ఈ ఏడాది వరుసగా 5 సార్లు రెపో రేటును తగ్గించడంతో ఇది ప్రస్తుతం దశాబ్దపు కనిష్ట స్థాయి 5.15%కి చేరింది. కానీ బ్యాంకుల స్థాయిలో మాత్రం ఆ మేరకు రుణాలపై వడ్డీ రేటు తగ్గడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర
Published Thu, Oct 10 2019 4:17 AM | Last Updated on Thu, Oct 10 2019 8:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment