మొబైల్ బ్యాంకింగ్.. పోటాపోటీ! | Increase efficiency of mobile banking | Sakshi
Sakshi News home page

మొబైల్ బ్యాంకింగ్.. పోటాపోటీ!

Published Tue, Jul 14 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

మొబైల్ బ్యాంకింగ్.. పోటాపోటీ!

మొబైల్ బ్యాంకింగ్.. పోటాపోటీ!

అగ్రస్థానం కోసం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వ్యూహాలు
- ఈ ఏడాది ఎస్‌బీఐ 250 ఇన్ టచ్ లైట్ డిజిటల్ శాఖలు
- కోటి మంది ఖాతాదారులపై ఐసీఐసీఐ బ్యాంక్ దృష్టి
- స్మార్ట్ వాచీల్లోనూ అందుబాటులోకి  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
బ్యాంకులో డబ్బులు వెయ్యాలంటే లైను. తియ్యాలంటే లైను. డీడీ తియ్యాలన్నా... ఇంకే సర్వీసు కోసమైనా లైను కట్టాల్సిందే. కాకపోతే ఇదంతా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి రాక ముందటి మాట. ఇపుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందరికీ అందుబాటులోకి రావటమే కాదు... కొత్త కొత్త అడుగులు వేస్తూ మొబైల్‌లోకి కూడా యాప్ రూపంలో దూరిపోయింది. అందరూ కాకపోయినా మెజారిటీ ఖాతాదారులిపుడు బ్యాంకింగ్ పనులన్నీ కంప్యూటర్, మొబైల్‌తోనే కానిచ్చేస్తున్నారు. ఆన్‌లైన్ కస్టమర్లు, లావాదేవీలు   పెరుగుతుండటంతో ఇదిగో... ఇక్కడా పోటీ మొదలైంది. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ డిజిటల్‌లో అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి.
 
డిజిటల్ బ్యాంకింగ్‌లో ప్రస్తుతం ఎవరు టాప్ అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే లావాదేవీల సంఖ్య చూస్తే ఎస్‌బీఐదే అగ్రస్థానం. కానీ ఆ లావాదేవీల విలువను చూస్తే హెచ్‌డీఎఫ్‌సీయే టాపర్. అందుకే... లావాదేవీల విలువలోనూ మొదటి స్థానానికి చేరేందుకు ఎస్‌బీఐ, రెండింట్లోనూ నంబర్-1 కావటానికి ఐసీఐసీఐ పలు వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. ఈ పోటీని తట్టుకొని ఎలాగైనా తొలి స్థానం కాపాడుకోవటానికి హెచ్‌డీఎఫ్‌సీ ఇటీవలే దేశంలోనే తొలిసారిగా ‘స్మార్ట్ వాచీ’ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టింది.

ఇవికాక పేజాప్, చిల్లర్ వంటి యాప్స్‌తో పాటు కేవలం నిమిష్లాల్లోనే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను మంజూరు చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దీనికి పోటీగా ఐసీఐసీఐ బ్యాంక్ తన మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు మొబైల్ యాప్‌లో 55 లావాదేవీలను అందిస్తున్న ఐసీఐసీఐ ఇప్పుడు ఈ సంఖ్యను రెట్టింపు... అంటే 110కి చేర్చింది. దీంతో అత్యధికంగా 80 వరకు సేవలను అందిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను ఈ విషయంలో అధిగమించినట్లయింది. త్వరలోనే ఫోన్ ద్వారా సుమారు 200 లావాదేవీలను నిర్వహించుకునేలా తీర్చిదిద్దనున్నట్లు ఐసీఐసీఐ చెబుతోంది. వచ్చే 9 నెలల్లో మొబైల్ బ్యాంకింగ్‌లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను 50 లక్షల నుంచి కోటికి చేర్చడం ద్వారా ఈ రంగంలో టాప్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీఐసీఐ ఈడీ రాజీవ్ సబర్వాల్ చెప్పారు.
 
రివార్డు పాయింట్లతో ఎస్‌బీఐ...
ఎస్‌బీఐ కూడా డిజిటల్ బ్యాంకింగ్‌పై మరింత దృష్టిపెట్టింది. ఇంటర్నెట్, మొబైల్, కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై రివార్డు పాయింట్లను అందిస్తోంది. అంతేకాక  ఇన్‌టచ్ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ శాఖలను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదిలో కొత్తగా 250 డిజిటల్ బ్యాంకింగ్ శాఖలను ఏర్పాటు చేయాలనేది బ్యాంక్ లక్ష్యం.
 
భారీగా పెరుగుతున్న లావాదేవీలు...
స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. గతేడాదితో పోలిస్తే మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల సంఖ్య పలు రెట్లు పెరిగినట్లు ఆర్‌బీఐ తాజా గణాంకాలు తెలియచేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో 10 లక్షలుగా ఉన్న లావాదేవీల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్లో ఏకంగా 1.9 కోట్లకు చేరింది. ఇందులో 78.48 లక్షల లావాదేవీలతో ఎస్‌బీఐ మొదటి స్థానంలో ఉండగా, 17.46 లక్షల లావాదేవీలతో హెచ్‌డీఎఫ్‌సీ రెండో స్థానంలో ఉంది.

అదే విలువ పరంగా చూస్తే మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల పరిమాణం రూ.3,296 కోట్ల నుంచి రూ. 18,869 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆన్‌లైన్, కార్డులు సహా వివిధ డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగిన లావాదేవీల పరిమాణం రూ.6 లక్షల కోట్లుగా ఉంది. రెండేళ్లలో ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను మొబైల్ బ్యాంకింగ్ అధిగమిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ చెప్పారు. మొబైల్స్ వాడేవారిలో 70% మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో మొబైల్ బ్యాంకింగ్ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement