సాక్షి రాయచోటి: జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్‌ఫోన్ అందుబాటులో ఉంటే పని సులువవుతోంది. పాల ప్యాకెట్ తీసుకోవచ్చు.. హోటల్‌లో తినొచ్చు.. వేడివేడి టీ తాగొచ్చు.. బార్బర్ షాపులోనూ నచ్చినట్లు కటింగ్ చేయించుకోవచ్చు.. మార్కెట్‌లో కూరగాయలు మొదలుకొని దుకాణంలో సరుకుల కొనుగోలు వరకు కార్డు ఉంటే చాలు ఎలాగైనా పనులు చేసుకోవచ్చు. పాతకాలం పోయింది.. కొత్త కాలం వచ్చింది.. ప్రపంచం డిజిటల్ మయంగా మారింది. ఎక్కడ చూసినా ఆన్‌లైన్ చెల్లింపులకు తెర తీస్తున్నారు. పైగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా డిజిటల్ పేమెంట్లు పెరగడానికి పెద్ద కారణంగా చెప్పవచ్చు.
అన్నిచోట్ల ఆన్‌లైన్ లావాదేవీలు
కాలంలో ఎంత మార్పు అంటే ఏకంగా దుకాణంలో టీ తాగాలన్నా కూడా జనాలు ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. చిన్నపాటి వ్యాపారులు కూడా డిజిటల్ విధానానికి అలవాటు పడుతున్నారు.. మామిడిపండ్ల బండి మొదలుకుని చివరకు గంపలపై పండ్లు పెట్టుకుని అమ్ముకునే చిన్నచిన్న వ్యాపారులు కూడా ఫోన్‌పే అంటున్నారు.
సమయానికి చిల్లర లేకపోయినా, అత్యవసరంగా మందులు కావాల్సి వచ్చినా.. చేతిలో డబ్బుల్లేకున్నా.. ఇంటి ముందుకు సరుకులొస్తున్నాయి అంటే కారణం డిజిటల్ లావాదేవీలేనని చెప్పక తప్పదు. మీ బ్యాంక్ ఖాతాలో నగదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అన్ని పనులు సులభంగా చేసేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఈ విధానం కొనసాగుతున్నా కోవిడ్ నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం పెరిగింది. కరోనా విజృంభించిన తరుణంలో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఆన్‌లైన్ చెల్లింపుల వైపు విపరీతంగా మొగ్గు చూపారు.
ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం తదితర థర్డ్ పార్టీ యాప్‌ల సాయంతో ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీలను సులభంగా చేస్తున్నారు. తక్కువ పరిధిలో సురక్షితమైన చెల్లింపులు జరుగుతుండటంతో వీటికి ఆదరణ లభిస్తోంది. కిరాణా, నిత్యావసరాలు, పెట్రోలు తదితర సామగ్రి మొదలు మొబైల్, డీటీహెచ్ రీచార్జిలు, విద్యుత్, గ్యాస్ బిల్లులు, రుణాల చెల్లింపులు, నగదు బదిలీలు తదితర అవసరాలన్నింటికీ వీటినే ఉపయోగిస్తున్నారు.
యువత సాంకేతికతను ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. డిజిటల్ చెల్లింపుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్ రీచార్జి మొదలు, షాపింగ్, వినోదం, నిత్యావసరాలు, బిల్లులు తదితర అవసరాలన్నింటికి యువత డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నారు.
బ్యాంకులలో డిజిటల్‌కే ప్రాధాన్యం
జిల్లాలో బ్యాంకుల్లో కూడా ఎక్కడచూసినా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. ఎవరికి ఎలాంటి అవసరమొచ్చినా నేరుగా బ్యాంకు నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఏటీఎంల ద్వారా కూడా వెసులుబాటు ఉంది.
సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి
జిల్లాలో ఖాతాదారులు బ్యాంకులు మొదలుకొని బయట కూడా డిజిటల్ లావాదేవీలే చేపట్టాలి. అయితే సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి. కొంతమంది నకిలీ వ్యక్తులు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటీపీలు, పిన్ నంబర్లు అడిగితే పొరపాటున కూడా చెప్పొద్దు. అలా అడిగారంటే వెంటనే కట్ చేసి బ్యాంకులో సంప్రదించాలి. నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గించి ఆన్‌లైన్ ద్వారా చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
– దుర్గాప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్, కడప.
Comments
Please login to add a commentAdd a comment