
ముంబై: డిపాజిట్ బీమా పథకం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆగస్టు 31లోగా తమ వెబ్‌సైట్‌లు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లలో తన లోగో, క్యూఆర్ కోడ్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని ఆర్‌బీఐ అనుబంధ విభాగం– డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అన్ని బ్యాంకులను కోరింది. బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు డీఐసీజీసీ ద్వారా బీమా కవరేజ్ ఉంటుంది. ఈ బీమా పథకం వాణిజ్య బ్యాంకులుసహా లోకల్ ఏరియా బ్యాంకులు (ఎల్‌ఏబీ), చెల్లింపుల బ్యాంకులు (పీబీ), చిన్న ఆర్థిక బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ) సహకార బ్యాంకులలో డిపాజిట్లకు వర్తిస్తుంది. ఆర్‌బీఐ సంప్రదింపులతో తాజా సూచనలు చేస్తున్నట్లు డీఐసీజీసీ సర్కులర్ వివరించింది.
ఎందుకంటే...
► చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసాన్ని పటిష్టం చేయడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో డిపాజిట్ బీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించింది.
► లోగో, క్యూర్ కోడ్ ప్రదర్శన వల్ల డీఐసీజీసీ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలోకి వచ్చే బ్యాంకులను కస్టమర్ సులభంగా గుర్తించడానికి వీలవుతుందని, అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమాచారం సకాలంలో వారు పొందగలుగుతారని తెలిపింది.
బీమా కవరేజ్ బ్యాంకులు 2,027
డీఐసీజీసీ నమోదిత బీమా బ్యాంకుల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 2,027. ఇందులో 140 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. 43 ఆర్‌ఆర్‌బీలు, రెండు ఎల్‌ఏబీలు, ఆరు పీబీలు, 12 ఎస్‌ఎఫ్‌బీలు, 1,887 సహకార బ్యాంకులు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్ బీమా ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షలు. ఇందుకు సంబంధించి కవరవుతున్న ఖాతాల సంఖ్య 2023 మార్చి 31 నాటికి 294.5 కోట్లు. బీమా కవరవుతున్న డిపాజిట్ల విలువ రూ.83,89,470 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment